Thaman: ఆ పాటకే... నెల రోజులు పనిచేశాం!

‘‘పెళ్లికి ముందు ఆహ్వాన పత్రికలా మారింది సంగీతం. సినిమాకి ప్రేక్షకుల్ని ఘనంగా ఆహ్వానించడం కోసం మంచి పాటలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. 

Updated : 24 Nov 2021 08:04 IST

‘‘పెళ్లికి ముందు ఆహ్వాన పత్రికలా మారింది సంగీతం. సినిమాకి ప్రేక్షకుల్ని ఘనంగా ఆహ్వానించడం కోసం మంచి పాటలు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు.  పది పదిహేనేళ్లపాటు ఈ ట్రెండ్‌ కొనసాగుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. పలువురు అగ్ర కథానాయకుల చిత్రాలకి సంగీతం అందిస్తూ అగ్ర శ్రేణి స్వరకర్తల్లో ఒకరిగా దూసుకెళుతున్నారీయన. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ‘అఖండ’కి తమన్‌ స్వరాలు సమకూర్చారు. ‘అఖండ’ డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా  తమన్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో  ముచ్చటించారు.  

‘‘బాలకృష్ణ సర్‌తో  ‘డిక్టేటర్‌’ తర్వాత... బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు’ తర్వాత నేను చేసిన సినిమా ఇది.  బాలకృష్ణ - బోయపాటి కలయిక ప్రత్యేకమైనది. వాళ్లిద్దరి మధ్య గొప్ప అవగాహన ఉంటుంది. ఇద్దరూ కలిసి వందల చిత్రాలు చేసినా ఫ్లాప్‌ అవ్వవు. ఇందులో నేను భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ‘అఖండ’ తరచూ మనం చూసే వాణిజ్య సినిమా కాదు. విభిన్న థృక్కోణంతో ఆలోచించి చేసిన చిత్రం. ఇప్పటివరకు ఈ జోనర్‌లో నేను చేసిన సంగీతంలో ఇది అత్యుత్తమం అని చెబుతా’’.

‘‘ఈ కథలో సైన్స్‌ ఉంది. అఘోరా గురించి ఎంతో పరిశోధన చేశా. పలు పుస్తకాలు చదివిన తర్వాత ఆ పాత్రలకి తగ్గట్టుగా నేపథ్య సంగీతం ఇచ్చా. సగటు వాణిజ్య సినిమాలకైతే కొంచెం ఘాటుదనంతో కూడిన సంగీతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇలాంటి వాటికి అది కుదరదు. టైటిల్‌ గీతం చేయడానికే నెల రోజులు పట్టింది. ఒక గొప్ప సన్నివేశం తర్వాత ఆ పాట వస్తుంది. ఐదారు వందల మంది ఈ సినిమా సంగీతం కోసం పనిచేసి ఉంటారు. గాయకులే 120 మంది వరకు ఉంటారు. నాలుగు పాటలే ఉన్నా.. అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బాలకృష్ణ సర్‌ టైటిల్‌ గీతం విన్న వెంటనే మెచ్చుకున్నారు. హీరోల ఇమేజ్‌ తప్పకుండా మా పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. వాళ్లే కదా మా సంగీతాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేది. అందుకే వాళ్ల శైలికి, కథకి తగ్గట్టుగా సంగీతం అందిస్తుంటాం. తదుపరి బాలకృష్ణ సినిమాకీ నేనే సంగీతం అందిస్తున్నా’’.  


‘‘పాట ఒకప్పటిలాగా మళ్లీ ముందుకొచ్చింది. ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి పాటతో ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో పాటని విడుదల చేయడంతో అది శ్రోతలకి బాగా చేరువవుతోంది, అదే సమయంలో సినిమా ప్రచారానికీ కలిసొస్తోంది. అన్ని పాటల్నీ ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నాం. ఆడియో కంపెనీలు ఒక్కో పాట చేస్తేనే మేలని చెప్పడంతో అలా కొనసాగిస్తున్నాం. ఈ కొత్త ట్రెండ్‌ వల్ల గాయకులు వెలుగులోకి వస్తున్నారు. వాళ్ల కష్టం కనిపిస్తోంది. కథానాయకులు కూడా సంగీత దర్శకులకి స్వేచ్ఛనిస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నారు. అది మంచి విషయం. ‘సర్కారు వారి పాట’కి సంబంధించిన పాటల సందడి జనవరి నుంచి మొదలవుతుంది’’.


‘‘సినిమా కోరుకున్న సంగీతాన్ని ఇవ్వాల్సిందే అనేది నా అభిప్రాయం. శంకర్‌ మహదేవన్‌ పాడితేనే ఆ పాటకి అందం అనుకుంటే ఆయనతోనే పాడిస్తా. తక్కువ ఖర్చు అవుతుంది కదా అని వేరేవాళ్లతో పాడించను. అదే సమయంలో ఎక్కువ ఖర్చు పెడితేనే ఎక్కువ నాణ్యతతో కూడిన సంగీతం వస్తుందనుకోవడమూ పొరపాటే. ఒకవేళ బడ్జెట్‌ లేదనుకుంటే ఎక్కడో ఒక చోట తగ్గించుకునైనా పాట కోరుకున్న గాయకులతో పాడించే ప్రయత్నం చేస్తుంటా. నెంబర్‌ గేమ్‌ని నేను నమ్మను. అది మనసులో ఉంటే పరిగెత్తలేం. నంబర్‌ అనేది పరిగెత్తే గుర్రాలకి ఉండాలేమో మనకు కాదు. రోజూ కష్టపడుతూ ముందుకు వెళ్లాలనేది నా సిద్ధాంతం’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని