Most Eligible Bachelor: లెహరాయి అంటే అర్థం ఇదే

రేమ... రెండక్షరాల లోకం. ఈ లోకంలో చట్టాపట్టాలేసుకొని విహరించడానికి ప్రియురాలు దొరికితే ఆ ప్రియుడి సంతోషాన్ని వర్ణించడానికి వర్ణమాల సరిపోదనడంలో అతిశయోక్తి లేదు. అలా  ప్రేమజంటలు తమ ప్రేమను...

Published : 24 Sep 2021 09:39 IST

చిత్రం: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌; తారాగణం: అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే; దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌; గీతం: గోపిసుందర్‌; సాహిత్యం: శ్రీమణి; గానం: సిద్‌ శ్రీరామ్‌; నిర్మాణ సంస్థ: జీఏ2పిక్చర్స్‌

ప్రేమ... రెండక్షరాల లోకం. ఈ లోకంలో చట్టాపట్టాలేసుకొని విహరించడానికి ప్రియురాలు దొరికితే ఆ ప్రియుడి సంతోషాన్ని వర్ణించడానికి వర్ణమాల సరిపోదనడంలో అతిశయోక్తి లేదు. అలా  ప్రేమజంటలు తమ ప్రేమను ఆస్వాదిస్తూ పాడుకునే ఎన్నో పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. వాటిని రచించిన ఎందరో రచయితలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పదాలు అన్వేషిస్తూ, సరికొత్తగా ప్రణయ గీతాలను పరిచయం చేస్తుంటారు. అలాంటి ఓ పాటే ఈ ‘లెహరాయి...’ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రం కోసం ప్రముఖ యువ రచయిత శ్రీమణి ఈ పాటను రచించారు. గోపిసుందర్‌ సంగీతాన్ని అందించగా తన గాత్రంతో యువతను కట్టిపడేస్తోన్న సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ సందర్భంగా లెహరాయి పాట అనుభవాలను, అందులోని ప్రేమతత్వాన్ని రచయిత శ్రీమణి ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు.

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రంలో నేను రెండు పాటలు రాశా. అందులో ఈ లెహరాయి ఒకటి. లెహరాయి అంటే అర్థం తేలిపోవడం. పక్షి గాల్లో రెక్కలాడిస్తూ ఎగురుతున్న సంతోషాన్ని లెహరాయి అంటారు. ఈ పాట సన్నివేశంలో కథానాయకుడి హృదయ స్పందన అలా ఉంటుంది. ఆ భావన కోసం ప్రయత్నిస్తూ చాలా రకాలుగా పాట రాశా. అందులో లెహరాయి అనే శబ్దం దర్శకుడు భాస్కర్‌కు బాగా నచ్చింది. ఆ పదంతోనే పాట ప్రారంభించాం. కథానాయకుడి జీవితంలో చాలా ముఖ్యమైన సమయంలో ఈ పాట వస్తుంది. అప్పుడే పెళ్లైన కొత్త జంట తాలుకూ రొమాన్స్‌ పదాల్లో ఉండాలని దర్శకుడు అడిగారు. అలాగే నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు ఒక అబ్బాయిలో కలిగే సంతోషం కావాలన్నారు. అవన్నీ ఇమిడి  పోయేలా రాశా.  పెద్ద పెద్ద పదాలతో కాకుండా చాలా అలతి అలతి పదాలు పాటలో ఉంటాయి. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను ప్రతి ప్రేమికుడికి దగ్గరయ్యేలా దర్శకుడు తీర్చిదిద్దారు. ‘‘లెహరాయి లెహరాయి... గోరువెచ్చనైన ఊసులదిరాయి, గుండె వెచ్చనైనా ఊహలెగిరాయి’’ అనే వాక్యాలు దర్శకుడు భాస్కర్‌కు బాగా నచ్చాయి. చరణంలోకి వస్తే.. వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే.. మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ, వేళా పాలలనే మరిచే సరసాలే.. తేదీ వారాలే చెరిపే  చెరసాలే..... ఇలా ప్రతి లైన్‌ కొత్తగా ఉండటానికి ప్రయత్నించాను.

గోపిసుందర్‌ సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన బాణీలు ఎప్పటికప్పుడు కొత్తదనంతో నిండిఉంటాయి. మాలాంటి రచయితలకు సవాల్‌గానూ అనిపిస్తాయి. గోపిసుందర్‌తో కలిసి ‘గీతగోవిందం’ చిత్రంలో వచ్చిందమ్మ అనే పాట రాశాను. అది కూడా సిద్‌ పాడాడు. లెహరాయి మా ఇద్దరికి రెండో పాట. సిద్‌ గాత్రం అందించడం వల్ల ఎంతో మంది హృదయాలకు ఈ పాట చేరువైంది. అన్ని పాటలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. యువత, పెద్దలకు నచ్చే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

లెహరాయి.. లెహరాయీ..

ఏ లేలేలే.. లేలేలేలే..

లెహరాయీ లెహరాయీ..

గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ..

గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

చరణం1:

రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..

రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..

వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..

మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..  ।।లెహరాయి।।

చరణం2:

వేళా పాలలనే మరిచే సరసాలే..

తేదీ వారాలే చెరిపే చెరసాలే..

చనువు కొంచెం పెంచుకుంటూ..

తనువు బరువే పంచుకుంటూ..

మనలోకం మైకం ఏకం అవుతూ..

ఏకాంతాలే లెహరాయీ.. ।।లెహరాయీ।।


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని