Cinema News: నిదానమే విధానము

చిత్రసీమ అనుభవానికి పట్టం కడుతుంది. కొత్తదనానికి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతుంది. కథానాయికల విషయంలోనూ అంతే. ఇటు సీనియర్‌ భామలు, అటు కొత్త అందం తళుకులతో చిత్రసీమ కళకళలాడుతూ....

Published : 10 Sep 2021 13:22 IST

చిత్రసీమ అనుభవానికి పట్టం కడుతుంది. కొత్తదనానికి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతుంది. కథానాయికల విషయంలోనూ అంతే. ఇటు సీనియర్‌ భామలు, అటు కొత్త అందం తళుకులతో చిత్రసీమ కళకళలాడుతూ కనిపిస్తోంది. ఎవరికి తగ్గ అవకాశాలు వాళ్లకు అందుతున్నాయి. అయితే సీనియర్‌ భామలు ఇప్పుడు వరుస అవకాశాల కంటే... ఆచితూచి అడుగులు వేయడానికే మొగ్గు చూపుతున్నారు. వచ్చిన సినిమాలన్నీ చేసేద్దాం అన్నట్టు కాకుండా నచ్చిన కథ వచ్చేవరకు... కలయికలు కుదిరే వరకు ఎదురు చూస్తున్నారు.

అనుష్క మొదలుకొని... నిన్న మొన్న వచ్చిన టీనేజ్‌ భామ కృతిశెట్టి వరకూ తెలుగులో అందరి కోసం పాత్రలు సిద్ధం అవుతున్నాయి. శ్రుతిహాసన్‌, తమన్నా, కాజల్‌, శ్రియ, సమంత తదితర సీనియర్లు మొదలుకొని... అనుపమ పరమేశ్వరన్‌, నభా నటేష్‌, మేఘ ఆకాష్‌ వంటి నవతరం తారల వరకు అందరూ బిజీనే. యాభై ఏళ్లు పైబడిన హీరోలతోపాటు... యువతరం కథానాయకులూ వరుసగా సినిమాలు చేస్తున్నారు కాబట్టి అందరికీ తగ్గ హీరోయిన్ల అవసరం ఏర్పడింది. అందుకే కథానాయికలకి విరివిగా అవకాశాలు దక్కుతున్నాయి. అయినా సీనియర్లు ఆలోచించి అడుగులేస్తున్నారు.

సీన్‌ మారింది

ఇదివరకు కొత్త నీరు వస్తున్నకొద్దీ పాతనీరు కనుమరుగైనట్టుగా... కొత్త భామలు వచ్చేకొద్దీ సీనియర్‌ భామల జోరు తగ్గేది. అవకాశాలు తగ్గుముఖం పట్టేలోపే వీలైనన్ని సినిమాలు చేసేద్దాం అనే హడావిడి తారల్లో కనిపించేది. ఇప్పుడు సీన్‌ మారింది. నాలుగు పదుల వయసుకి దగ్గరైన  కథానాయికలకీ అవకాశాలు విరివిగా అందుతున్నాయి. పెళ్లి చేసుకున్నా కెరీర్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేదు. సమంత, కాజల్‌, ప్రియమణి, శ్రియ... వీళ్లంతా పెళ్లి తర్వాతా సత్తా చాటుతున్నారు. కెరీర్‌ పరంగా ఎలాంటి అభద్రతాభావం లేదు కాబట్టి చాలా మంది కథానాయికలు వ్యూహాలను మార్చుకుని బలమైన కథలు, పాత్రలపై దృష్టిపెడుతున్నారు. అనుభవాన్ని రంగరించి గుర్తుండిపోయేలా సినిమాలపై ప్రభావం చూపుతున్నారు.

చాలా మందే...

అనుష్క ‘నిశ్శబ్దం’ తర్వాత మరో సినిమా చేయలేదు. ఆమె కోసం తెలుగులో కథలు, పాత్రలు సిద్ధమవుతూనే ఉన్నాయి. ఆమె తొందరపడటం లేదు. యు.వి.క్రియేషన్స్‌లో అనుష్క కోసం స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయి. ‘జాను’ తర్వాత సమంత నుంచి మరో చిత్రమేదీ రాలేదు. ఆమె కొన్నాళ్ల కిందటే ‘శాకుంతలం’ కోసం రంగంలోకి దిగి పూర్తి చేసింది. ఇప్పుడు మళ్లీ విరామంలో గడుపుతోంది. ‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాలతో మెరిసి మళ్లీ ఫామ్‌ అందుకున్న శ్రుతి ‘సలార్‌’ కోసం ప్రభాస్‌తో జోడీ కట్టింది. ఆ తర్వాత పలు ప్రాజెక్టుల విషయంలో పేరు   వినిపించింది కానీ... శ్రుతి పరుగులు పెడుతూ హడావిడిగా సినిమాలు చేసే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదని చెబుతోంది. ఆమె ఇటీవల ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘సంఖ్య పెంచుకోవడం కోసం నేను సినిమాలు చేయకూడదు. ఒక సినిమా చేశాక అది నటిగా నాకు పూర్తి సంతృప్తినివ్వాలి. అలాంటి కథలతోనే ప్రయాణం చేస్తాన’’ని చెప్పుకొచ్చింది. వీళ్లే కాదు... చాలా మంది తారలు నిదానమే తమ విధానం అన్నట్టు మధ్యలో విరామం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని