Published : 05/12/2021 02:00 IST

Kandikonda: ‘కేటీఆర్‌ సర్‌.. ఈ సాయం కూడా చేయండి’: ప్రముఖ గేయ రచయిత కుమార్తె

హైదరాబాద్‌: హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ. తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే చక్కని గీతాలు ఆయన కలం నుంచి జాలు వారాయి. కందికొండ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కుమార్తె కందికొండ మాతృక తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌ మోతీనగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నామని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

‘‘డియర్‌ కేటీఆర్‌ సర్‌.. ఈ ఏడాది జూన్‌ నెలలో మా కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను గుర్తించి మాకు సాయం చేసి, అండగా నిలిచినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్న వెంటిలేటర్‌పై కిమ్స్‌లో ఉన్నప్పుడు మా పరిస్థితి స్వయంగా తెలుసుకుని చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఆర్థికంగానూ అండగా నిలిచారు. దాదాపు 40రోజుల పాటు వైద్యులు నాన్నకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. మీరు స్వయంగా పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైంది. గత నెలలోనూ నాన్న వెన్నెముకకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం ‘మెడికవర్‌’లో చేరితే అప్పుడు కూడా మీ కార్యాలయం వేగంగా స్పందించింది. ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి, శస్త్ర చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చూడాలని మా అమ్మ మంత్రి హరీశ్‌రావును గతంలో కోరారు. అందుకు ఆయన  సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారిని కలవాల్సిందిగా సూచించారు. 2012 నుంచి నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు సర్జరీలు జరిగాయి. అయినా కూడా చిత్రపురి కాలనీలో సొంత ఇల్లు కోసం నాన్న రూ.4.05లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కారణంగా మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఈ నెల తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని ఆదేశించాడు. మా విన్నపాన్ని మన్నించి మాకు చిత్రపురి కాలనీ లేదా, ఇంకెక్కడైనా నివాసం కల్పించండి. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు కూడా తగిన సాయం చేయాలని ఈ సందర్భంగా సవినయంగా కోరుతున్నాం. మానాన్న ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కలలుకనే ‘బంగారు తెలంగాణ’ కోసం తనవంతు రచనలు చేస్తారని ఆశిస్తున్నా’’ అని మాతృక లేఖరాశారు.

తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ తర్వాత ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు.

Read latest Cinema News and Telugu NewsRead latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని