Tollywood: ఈ హీరోల మాట.. కొత్త బాట.. టాలీవుడ్‌లో కొత్త పరిణామం

జానర్‌లు మార్చాలని, భిన్నమైన పాత్రలు భుజానికెత్తుకోవాలని, సాహసాలకి సిద్ధం కావాలని యత్నిస్తున్నారు యువ కథానాయకులు

Published : 27 Sep 2021 13:11 IST

మాస్‌ కథలతో ప్రయాణం చేసే అగ్ర తారలు సైతం కొత్త రకమైన ప్రయత్నాలపై మొగ్గు చూపుతున్న రోజులివి. తమ మార్క్‌ మాస్‌ అంశాలతోపాటు... కథల్లో ఇంకేదో నవ నేపథ్యం ఉండాలని తపిస్తున్నారు. అవసరమైతే జానర్‌లు మార్చాలని, భిన్నమైన పాత్రలు భుజానికెత్తుకోవాలని, సాహసాలకి సిద్ధం కావాలని యత్నిస్తున్నారు.  కొద్దిమంది హీరోలు వేస్తున్న అడుగుల్ని... వాళ్ల ప్రయాణాన్ని గమనిస్తే ఆ పనిలోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. వారెవరు? ఆ వివరాలేంటో చదివేయండి...

‘యువ హీరోలపై ఇప్పుడున్న ఓ పెద్ద బాధ్యత... కొత్త రకమైన కథలతో ప్రయాణం చేయడం. మేమందరం ఆ బాధ్యతని స్వీకరించాల్సిందే’. - ఇటీవల కథానాయకుడు నాగచైతన్య చెప్పిన మాట ఇది. పడికట్టు సూత్రాలతో కూడిన టెంప్లేట్‌ కథలకి కాలం చెల్లింది. వాస్తవికతతో కూడిన సినిమాలకే ఇప్పుడు ఆదరణ దక్కుతోంది. ఓటీటీ వేదికల ఉద్ధృతి తర్వాత తెలుగు సినిమా కథాగమనం పూర్తిగా మారిపోయింది. అందుకు తగ్గట్టుగానే యువ హీరోలు అడుగులు వేస్తున్నారు.   ఇదివరకు తోటి హీరోలు ఎలాంటి సినిమాలతో హిట్‌ కొట్టారో గమనించి, అలాంటి కథలతో ప్రయాణం చేయడానికే ప్రయత్నించేవాళ్లు. దర్శకనిర్మాతలూ అదే సురక్షితం అని నమ్మేవారు. ఇప్పుడు ఆ రూటు మారింది. ఒకొక్కరు ఒక్కో నేపథ్యంతో కూడిన కథల్ని ఎంపిక చేసుకుంటున్నారు. కథలో నిజాయతీ ఉందంటే... అలాంటివి ఇదివరకు వచ్చాయా లేదా? ఆడాయా లేదా? అని ఆలోచించకుండా భుజానికెత్తుకుంటున్నారు. భిన్నమైన కథలు వెలుగు చూడటానికి ఇదొక కీలక పరిణామం అంటున్నారు సినీ పండితులు.

ఎన్నెన్నో భిన్న కోణాలు

ఒకరు రాజకీయ నేపథ్యం, మరొకరిది స్పై కథ, ఇంకొకరేమో ప్రేక్షకులకి థ్రిల్‌ని పంచాలని నిర్ణయించారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథలు, స్పోర్ట్స్‌ డ్రామాలు, పీరియాడికల్‌ కథలు... ఇలా ఒకటేమిటి యువ హీరోల ప్రయాణాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో ఎన్ని రకాల కథల్ని ఆస్వాదించనున్నామో అర్థమవుతుంది. ఇటీవలే నాని కుటుంబ కథతో ‘టక్‌ జగదీష్‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. పీరియాడికల్‌ కథతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ పూర్తి చేశారు.  గిలిగింతలు పెట్టే మరో కొత్త రకమైన కథతో ‘అంటే సుందరానికి’ చేస్తున్నారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో కూడిన మరో కథని ఎంపిక చేసుకున్నారు. యువ కథానాయకుడు రామ్‌ ఈసారి పక్కా మాస్‌ అంటున్నారు. లింగుస్వామితో జట్టు కట్టిన ఆయన పోలీస్‌ పాత్రలోనూ సందడి చేస్తారని సమాచారం. ఈ చిత్రంతో ప్రేక్షకులకి కొత్త రుచులు  పంచుతానని గట్టిగా చెబుతున్నారు.

వీరి మాట... కొత్త బాట

సాయి తేజ్‌ యువ ఐఏఎస్‌ అధికారి కథతో ‘రిపబ్లిక్‌’ చేశారు. పాలనా వ్యవస్థ గురించి ప్రస్తావించే కథతో ఈ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన పీరియాడికల్‌ కథతో కూడిన ఓ థ్రిల్లర్‌ సినిమాని చేయనున్నారు. కార్తీక్‌ వర్మ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారు.

* ఎక్కువగా ప్రేమకథల్లోనే నటిస్తూ వచ్చిన నితిన్‌ ఇటీవల డార్క్‌ కామెడీ క్రైమ్‌ కథతో కూడిన ‘మాస్ట్రో’ చేసి మెప్పించారు. తదుపరి ఆయన     రాజకీయ నేపథ్యంతో కూడిన ‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో సినిమా   చేయనున్నారు.

* శర్వానంద్‌ ప్రేమకథతో కూడిన యాక్షన్‌ చిత్రం ‘మహాసముద్రం’ పూర్తి చేశారు. ప్రస్తుతం కుటుంబ కథతో  ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ చేస్తున్నారు.

* అఖిల్‌ అక్కినేని ఓ స్పై కథతో ‘ఏజెంట్‌’ చిత్రం చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌, నాగశౌర్య తదితరులు స్పోర్ట్స్‌ డ్రామాతో ‘గని’, ‘లక్ష్య’ సినిమాలు చేస్తున్నారు.

* యువ హీరోల సినిమాలంటే ఒకప్పుడు ప్రేమకథలతోనే రూపొందేవి. కొన్నిసార్లు అగ్ర హీరోల్లా మాస్‌ మసాలా అంశాలతోనూ సందడి చేసేవారు. ఇప్పుడు వీళ్లు స్పృశించని జానర్‌ లేదేమో అనిపిస్తోంది. పొరుగు భాషల్లో కొత్త రకమైన కథలొచ్చినా వెంటనే వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. యువ హీరోలకి కొత్త కథలపై పెరుగుతున్న మక్కువకి తార్కాణం ఇది. తెలుగు ప్రేక్షకులకు భిన్నమైన నేపథ్యాలు చూపించే భాగ్యమిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు