
Trisha: పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన త్రిష
హైదరాబాద్: దక్షిణాది అగ్రకథానాయిక త్రిష కృష్ణన్ పెళ్లి వార్తలపై స్పష్టత వచ్చింది. త్రిషకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె టీమ్ తెలిపింది. కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో త్రిష ప్రేమలో ఉందని.. పెద్దల అంగీకారంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై త్రిష టీమ్ స్పందించింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని.. ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని వివరించింది.
‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘కింగ్’, ‘బాడీగార్డ్’, ‘బంగారం’, ‘స్టాలిన్’, ‘లయన్’ వంటి చిత్రాలతో తెలుగులోని స్టార్ హీరోలందరి సరసన త్రిష నటించారు. 2016లో విడుదలైన ‘నాయకి’ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె వరుస తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటి.