Tuck Jagadish: ఎదురుచూపులకు చెక్‌..  ‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌ వచ్చేసింది 

నాని నటించిన ‘టక్‌ జగదీష్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.

Updated : 01 Sep 2021 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది.

‘భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి’ అనే సంభాషణతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ యాక్షన్‌, భావోద్వేగ సన్నివేశాలతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘ఆ వీరేంద్రకి భయపడకుండా జనం కోసం ఎవరో ఒకరు నిలబడాలి కదా’ అని జగపతిబాబు అనగానే నానిని పరిచయం చేసిన షాట్‌ అభిమానులకి మాంఛి కిక్‌ ఇచ్చేలా ఉంది. నీలం రంగు చొక్కా.. నల్ల కళ్లద్దాలతో ‘టక్‌ జగదీష్‌’గా నాని ఇచ్చిన ఎంట్రీ మెప్పిస్తుంది. అన్నదమ్ములైన జగపతి బాబు, నాని మధ్య సాగే సంభాషణలు ట్రైలర్‌కే ప్రధానంగా నిలిచాయి. ‘చిన్నప్పుడు నాకో మాట చెప్పావ్‌ గుర్తుందా? నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే’, ‘భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక. ఇప్పుడది నా బాధ్యత’ అని నాని చెప్పిన మాటలు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. మరి భూదేవిపురం కథేంటి? టక్‌ జగదీష్‌ అనుకున్నది సాధించాడా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

‘నిన్నుకోరి’ తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. ఈ సినిమాలో నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. ఏప్రిల్‌లోనే సందడి చేయాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ ముగిశాక థియేటర్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఓటీటీకే మొగ్గుచూపారు నిర్మాతలు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు