Updated : 03 Jan 2022 06:56 IST

Cinema News: ముగ్గుల పండక్కి.. తగ్గేదే లే

రెండేళ్లుగా వేసవి సీజన్‌ని దెబ్బ కొడుతూ వస్తున్న కరోనా.. తొలిసారి సంక్రాంతి సీజన్‌పై ప్రభావం చూపించింది. దీంతో సంక్రాంతి బరిలో నిలిచిన పాన్‌ ఇండియా చిత్రాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికే వాయిదా పడింది. ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ పండగ రేసులోనే ఉంది. ఇది జనవరి 14నే రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అనుకున్న సమయానికి వస్తుందా? రాదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు   పలు పెద్ద, చిన్న చిత్రాలు ఉత్సాహం చూపిస్తున్నాయి. బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. సంక్రాంతి లెక్క మారినా.. వినోదాలు వడ్డించడంలో ‘తగ్గేదేలే’ అంటూ విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి.


సంక్రాంతి.. ‘బంగార్రాజు’?

‘బంగార్రాజు’ సంక్రాంతి చిత్రమని ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు కథానాయకుడు నాగార్జున. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ వంటి పాన్‌ ఇండియా సినిమాలు పండగ రేసులో ఉండటంతో.. నాగ్‌ ఆ బరిలో నిలుస్తారా? లేదా? అన్నది ఇన్నాళ్లు అనుమానంగా ఉండేది. ఇప్పుడీ రేసు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తప్పుకోవడంతో.. ‘బంగార్రాజు’ రాకకు మార్గం సుగమమైంది. అందుకే టీజర్‌తోనే పండగ బరిలో నిలుస్తున్నట్లు స్పష్టత ఇచ్చేశారు నాగార్జున. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రానున్న రోజుల్లో పరిస్థితుల వల్ల ‘రాధేశ్యామ్‌’ వెనకడుగు వేయాల్సి వస్తే.. పండగ బరిలో నిలిచే పెద్ద సినిమా ఇదొక్కటే అవుతుంది. ఇందులో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా కనిపించనున్నారు. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది.


చిన్న చిత్రాల జోరు..

ఈసారి ముగ్గుల పండగ బరిలో చిన్న చిత్రాల సందడి ఎక్కువగా కనిపించనుంది. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ    ‘డిజె టిల్లు’, మహేష్‌ మేనల్లుడు అశోక్‌ గల్లా ‘హీరో’ చిత్రాలు సంక్రాంతి బెర్తులు ఖరారు చేసుకున్నాయి. వీటిలో సిద్దు సినిమా ఈనెల 14న విడుదల కానుండగా.. అశోక్‌ గల్లా చిత్రం 15న రానున్నట్లు ప్రకటించారు. ఇప్పుడీ రేసులోకి మరో మూడు చిత్రాలు వచ్చి చేరాయి. కల్యాణ్‌ దేవ్‌ హీరోగా పులి వాసు తెరకెక్కించిన చిత్రం ‘సూపర్‌ మచ్చి’. రిజ్వాన్‌ నిర్మించారు. రచినా రామ్‌ కథానాయిక. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమాని.. ఈనెల 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కల్యాణ్‌, రచితా కలిసి ఉన్న ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు.


* ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రం ‘రౌడీబాయ్స్‌’. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. ముగ్గుల పండక్కే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ   సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘యువతరం మెచ్చే కథతో రూపొందిన చిత్రమిది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంటుంది. ఇందులో ప్రేమకథ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు.


* గత సంక్రాంతికి ‘డర్టీ హరి’ సినిమాతో ఓటీటీ వేదికగా వినోదాలు పంచిచ్చారు దర్శకుడు ఎం.ఎస్‌.రాజు. ఈ పండక్కి ‘7డేస్‌ 6నైట్స్‌’ చిత్రంతో వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సుమంత్‌ అశ్విన్‌, మెహర్‌ చావల్‌, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల తేదీ ఖరారు చేస్తామన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని