
Tollywood: దీపావళికి థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!
వరుస పండగలు, సెలవులతో ప్రతి వారం కొత్త సినిమాలు వెండితెరపై సందడి చేస్తున్నాయి. దీంతో క్రమంగా థియేటర్‌లో విడుదలయ్యే సినిమాల సంఖ్య పెరుగుతోంది. దసరా సందర్భంగా పలు చిత్రాలు విడుదలై సందడి చేయగా, ఇప్పుడు దీపావళికి వెండితెరపై కాంతులీనేందుకు మరికొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. అంతేకాదు, ఓటీటీలోనూ పలు చిత్రాలు అలరించేందుకు వస్తున్నాయి.
‘పెద్దన్న’గా వస్తున్న రజనీకాంత్
భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టే అతి కొద్దిమంది స్టార్ కథానాయకుల్లో రజనీకాంత్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే కేవలం అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుడూ ఆసక్తిగా ఎదురు చూస్తాడు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’గా ఈ దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. నయనతార కథానాయిక. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే సిస్టర్ సెంటిమెంట్‌కు తోడు రజనీ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని కమర్షియల్ హంగులతో ‘పెద్దన్న’ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత విడుదలవుతున్న ఓ అగ్ర కథానాయకుడి చిత్రం ఇదే కావడం మరో విశేషం.
శత్రువు ఎవరు? స్నేహితుడు ఎవరు?
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు విశాల్. ఆర్యతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకుడు. మిని స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్‌లలో విడుదల కానుంది. పూర్తి యాక్షన్ చిత్రంగా ‘ఎనిమి’ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మిత్రులుగా ఉన్న విశాల్, ఆర్యలు ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది? ఇద్దరి మధ్య జరిగే పోరులో పై చేయి ఎవరిది? అన్నది తెరపైనే చూడాలి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
మారుతీ మార్కు చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం ముస్తాబు చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆద్యంతం వినోదాత్మకంగా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
వాయిదాల మీద వాయిదలు పడి.. దీపావళి రేసులో..
అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషించారు. పోలీస్ కథ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్/లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా సెకండ్‌వేవ్ కారణంగా మరోసారి విడుదలను విరమించుకున్నారు. ఎట్టకేలకు ఈ దీపావళి కానుకగా థియేటర్‌లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
మరో సూపర్‌హీరోస్ ఫిల్మ్ ‘ఇటర్నల్’
సూపర్‌హీరోస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. మార్వెల్ కామిక్స్ నుంచి ఎందరో సూపర్‌హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్’ వస్తున్నారు. థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్‌ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇటర్నల్స్’. నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
సూర్య సరికొత్త ప్రయత్నం ‘జై భీమ్’
మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న తమిళ నటుడు సూర్య అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. తాజాగా అలాంటి పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘జై భీమ్’. తా.సే.జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవర్ని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైలర్‌లో సూర్య పలికిన సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
ఓటీటీ వేదికపైకి ‘గల్లీ రౌడీ’
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సూరిబాబు- శ్రీదేవి ప్రేమ కథ
కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై మెరిసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ మాధ్యమం వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. సూరిబాబు పాత్రలో సుధీర్ విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీదేవి పాత్రలో ఆనంది ఒదిగిపోయింది.
నెట్‌ఫ్లిక్స్
* ద వెడ్డింగ్ గెస్ట్ (హాలీవుడ్) నవంబరు 01
* ద హార్డర్ దే ఫాల్(హాలీవుడ్) నవంబరు 03
* మీనాక్షి సుందరేశ్వర్ (తమిళ/హిందీ) నవంబరు 5
* ద అన్‌లైక్లీ మర్డరర్ (హాలీవుడ్) నవంబరు 5
* లవ్ హార్డ్(హాలీవుడ్) నవంబరు 5
* నార్కోస్: మెక్సికో(ఒరిజినల్ సిరీస్) నవంబరు 5
సోనీ లైవ్
* ట్రిస్ట్ విత్ డెస్టినీ( హాలీవుడ్) నవంబరు 05
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.