Valimai: సంక్రాంతికి సందడి

పెద్ద పండగ సంక్రాంతికి తెలుగు సినిమాలతోపాటు అనువాద చిత్రాలూ సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా తమిళం నుంచి ఏదో  ఒక అగ్ర తార సినిమా విడుదలవడం పరిపాటి. ఈసారి అజిత్‌ సినిమా ‘వలిమై’ రానుంది.

Updated : 05 Jan 2022 07:08 IST

పెద్ద పండగ సంక్రాంతికి తెలుగు సినిమాలతోపాటు అనువాద చిత్రాలూ సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా తమిళం నుంచి ఏదో  ఒక అగ్ర తార సినిమా విడుదలవడం పరిపాటి. ఈసారి అజిత్‌ సినిమా ‘వలిమై’ రానుంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనీకపూర్‌ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో తెలుగు కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ప్రతినాయకుడిగా నటించారు. నిర్మాత బోనీకపూర్‌ మాట్లాడుతూ   ‘‘జనవరి 13న తమిళంలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ తెలుగునాట సంక్రాంతి పండగకు ఉన్న ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకుని విడుదలకి ఇదే సమయమని తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించాం. అజిత్‌ అభిమానులు కోరుకున్న విధంగానే ఘనమైన విజువల్స్‌తో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. భారీ యాక్షన్‌ ఘట్టాలు, ఛేజింగ్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఓ శక్తివంతమైన పోలీస్‌ అధికారిగా అజిత్‌ నటించార’’న్నారు. హ్యూమా ఖురేషి, గుర్భాని జడ్జి, సుమిత్ర, యోగిబాబు, సెల్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, జిబ్రాన్‌.

26న ‘సామాన్యుడు’

విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘సామాన్యుడు’ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. జనవరి 26న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. శరవణన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశాల్‌కి జోడీగా డింపుల్‌ హయాతి నటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని