Vijay Deverakonda: ఇండియాని షేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాం: విజయ్‌

 ‘‘లైగర్‌’ చిత్రంతో 2022లో ఇండియాని షేక్‌ చేసేందుకు ఫిక్స్‌ అయ్యాం’ అని యువ నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ‘రొమాంటిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.

Updated : 30 Aug 2022 15:55 IST

వరంగల్‌: ‘‘లైగర్‌’ చిత్రంతో 2022లో ఇండియాని షేక్‌ చేసేందుకు ఫిక్స్‌ అయ్యాం’ అని యువ నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ‘రొమాంటిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని నిర్వహించింది. వరంగల్‌ ఇందుకు వేదికగా నిలిచింది.

వేడుకని ఉద్దేశించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘ఈ రొమాంటిక్‌ టీమ్‌ అంతా నాకు కావాల్సినవాళ్లు. వీరిలో చాలామంది నా ‘లైగర్‌’ చిత్రానికి పనిచేస్తున్నారు. వీళ్లు ఎంత ఆనందంగా ఉంటే నాకు అంత మంచిది. ఎందుకంటే వీళ్లు హ్యాపీగా ఉంటేనే ‘లైగర్‌’ ఔట్‌పుట్‌ అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు ఆకాశ్‌ స్పీచ్‌ విన్నాక అతనిపై ప్రేమ పుట్టింది. తనలో ఓ ఫైర్‌ ఉంది. తనకి సినిమా పిచ్చి. ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటాడని భావిస్తున్నా. కేతిక శర్మ అందం, అభినయంతో కట్టిపడేసేలా ఉంది. సునీల్‌ కశ్యప్‌ అందించిన పాటలు బాగున్నాయి. దర్శకుడు అనిల్‌కి బెస్ట్‌ విషెస్‌. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ‘లైగర్‌’ గురించి టీజర్‌, ట్రైలర్‌ వచ్చినప్పుడే మాట్లాడదామనుకున్నా. కానీ, మిమ్మల్ని (అభిమానులు) చూస్తుంటే నా మనసులో మాట పంచుకోవాలనిపిస్తుంది. విధి మా ముగ్గుర్ని (పూరి జగన్నాథ్‌, ఛార్మి, విజయ్‌) కలిపింది. సినిమా కోసం వాళ్లు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. దాని గురించి చెప్పడంకంటే విజువల్స్‌ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇండియాని షేక్‌ చేయాలని మేం ఫిక్స్‌ అయ్యాం. 2022లో చూద్దాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు పూరి జగన్నాథ్‌, అనిల్‌ పాడూరి, నటి, నిర్మాత ఛార్మి, ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ తదితరులు పాల్గొన్నారు. ‘లైగర్‌’ చిత్రం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఛార్మితో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని