Enemy Review: రివ్యూ: ఎనిమి

Enemy Review: విశాల్‌, ఆర్య కీలక పాత్రల్లో నటించిన ‘ఎనిమి’ సినిమా ఎలా ఉందంటే?

Published : 05 Nov 2021 01:53 IST

చిత్రం: ఎనిమి; నటీనటులు: విశాల్‌, ఆర్య, ప్రకాశ్‌రాజ్‌,  మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌ తదితరులు; సంగీతం: తమన్‌, శ్యామ్‌; ఎస్‌ (నేపథ్య); ఎడిటింగ్‌: రేమాండ్‌ డేరిక్‌ క్రస్టా; సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌; నిర్మాత: ఎస్‌.వినోద్‌ కుమార్‌; రచన, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌; విడుదల తేదీ: 04-11-2021

ఈసారి దీపావ‌ళి బ‌రిలో అనువాద చిత్రాల జోరు క‌నిపించింది. ర‌జ‌నీకాంత్ ‘పెద్ద‌న్న’గా పండ‌గ బ‌రిలో దిగ‌గా.. ఆయ‌న‌కు పోటీగా ‘ఎనిమి’(Enemy)తో రేసులోకి దిగారు విశాల్‌(vishal), ఆర్య‌(arya). ‘వాడు వీడు’ త‌ర్వాత  ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన రెండో చిత్ర‌మిది. విభిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ముస్తాబు చేశారు ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్‌. పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో  సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది?(Enemy telugu movie review) పండ‌గ వేళ విజ‌య‌ప‌తాకం ఎగుర‌వేసిందా?

క‌థేంటంటే: భ‌ర‌త్ క‌ల్యాణ్ (ప్ర‌కాశ్ రాజ్‌-Prakashraj) ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. త‌న కొడుకు రాజీవ్ (ఆర్య‌)ను పోలీసు చేయాల‌ని క‌ల‌లుకంటాడు. దీనికోసం చిన్న‌ప్ప‌టి నుంచే శిక్ష‌ణ ఇస్తుంటాడు. వాళ్ల ప‌క్కింట్లోనే ఉండే సూర్య (విశాల్‌) కూడా భ‌ర‌త్ ల‌క్ష్యం ప‌ట్ల ఆక‌ర్షితుడ‌వుతాడు. సూర్య‌లోని ప్ర‌తిభ‌ను గ‌మ‌నించిన భ‌ర‌త్‌.. త‌న బిడ్డ‌తో పాటే అత‌నికీ పోలీస్ శిక్ష‌ణ ఇస్తాడు. ఈ క్ర‌మంలోనే సూర్య, రాజీవ్ మంచి స్నేహితుల‌వుతారు. ఇద్ద‌రి జీవితాలు ల‌క్ష్యం దిశ‌గా సాగుతున్న క్ర‌మంలో అనుకోకుండా భ‌ర‌త్ క‌ల్యాణ్ హ‌త్యకు గురవుతాడు. అనంత‌రం సూర్య‌, రాజీవ్‌ల దారులు వేర‌వుతాయి. అయితే కొన్నేళ్ల త‌ర్వాత ఈ స్నేహితులిద్ద‌రూ శ‌త్రువులుగా ఎదురుప‌డాల్సి వ‌స్తుంది. మ‌రి వాళ్లిద్ద‌రి శ‌త్రుత్వానికి కార‌ణ‌మైన విష‌యం ఏంటి?  అస‌లు భ‌ర‌త్‌ను హ‌త్య చేసింది ఎవ‌రు?  ఈ క‌థ‌లో అనీషా (మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌), అశ్విత (మృణాళిని ర‌వి)ల పాత్ర‌లేంటి? ఆఖ‌రికి మిత్రులిద్ద‌రూ క‌లిశారా?లేదా?అన్న‌ది తెర‌పై చూడాలి.

ఎలా ఉందంటే: సింగ‌పూర్‌లోని లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో సాగే క‌థ ఇది. ఇద్ద‌రు స్నేహితులు.. శ‌త్రువులుగా మారితే ఏం జ‌రిగింది? అస‌లు వాళ్లిద్ద‌రూ అలా మార‌డానికి కార‌ణ‌మేంటి? ఈ ఇద్ద‌రి మ‌ధ్య జరిగిన పోరులో ఆఖ‌రికి పైచేయి ఎవ‌రిదైంది? అన్న‌ది చిత్ర క‌థాంశం.  విశాల్‌, ఆర్య‌ల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌కు చ‌క్క‌టి యాక్ష‌న్ హంగులు జోడించి ఆస‌క్తిక‌రంగా తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్‌. అయితే క‌థ‌ని ర‌స‌వ‌త్త‌రంగా  న‌డ‌ప‌డంలో ఆది నుంచే ఇబ్బంది ప‌డిన‌ట్లు క‌నిపించాడు. ప్రారంభంలో తొలి 20నిమిషాల్ని సూర్య‌, రాజీవ్‌ల ఫ్లాష్‌బ్యాక్ కోసం..  ఆ త‌ర్వాత మ‌రో 15నిమిషాల స‌మ‌యాన్ని విశాల్ ఇంట్ర‌డ‌క్ష‌న్ కోస‌మే తినేశాడు ద‌ర్శ‌కుడు. ఆయా స‌న్నివేశాల‌న్నీ చాలా నెమ్మ‌దిగా.. రొటీన్‌గా సాగ‌డంతో ప్రేక్ష‌కుల‌కు సీరియ‌ల్ చూస్తున్న అనుభూతి క‌లుగుతుంది.  మ‌ధ్య‌లో ప్ర‌కాశ్‌రాజ్ హ‌త్యోదంతం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిరేకెత్తించినా.. ద్వితీయార్ధం కోసం ఆ ఎపిసోడ్‌ను అలా ప‌క్క‌కు పెట్టాడు ద‌ర్శ‌కుడు.  విరామ స‌మ‌యానికి ముందు రాజీవ్‌ లిటిల్ ఇండియాలోకి అడుగుపెట్ట‌డం.. అత‌ను చేయాల్సిన ఓ మ‌ర్డ‌ర్ ఆప‌రేష‌న్‌ను సూర్య అడ్డుకోవ‌డంతో క‌థలో వేగం పెరుగుతుంది. ఇక ఇద్దరూ ఒక‌రికొక‌రు ఎదురుప‌డ్డాక వ‌చ్చే స‌న్నివేశాలు కాసేపు ఆస‌క్తిరేకెత్తిస్తాయి.  అయితే సూర్య‌పై రాజీవ్ ద్వేషం పెంచుకోవ‌డానికి వెన‌కున్న కార‌ణం తెలిశాక‌.. ఈ మాత్రం దానికే  ఇంత హంగామా అవ‌స‌ర‌మా అనిపిస్తుంది.

అయితే ప్ర‌ధ‌మార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో క‌థ కాస్త వేగంగా న‌డిచిన‌ట్లు అనిపించినా.. సూర్య, రాజీవ్‌ల మ‌ధ్య వ‌చ్చే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ చాలా పేల‌వంగా అనిపిస్తాయి. మ‌ధ్య‌లో రాజీవ్ పోలీస్ క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకునే ఎపిసోడ్ క‌థ‌కి కాస్త ఊపు తెచ్చిన‌ట్లు అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో సూర్య - రాజీవ్‌ల మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ ఎపిసోడ్ మ‌రీ సుదీర్ఘంగా సాగడంతో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టిన‌ట్ల‌వుతుంది. ఇక చివ‌ర్లో సినిమాని ముగించిన తీరు చూస్తే.. క‌థ‌ను ఇంత అర్ధాంత‌రంగా ముగించాడేంటి అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే:  విశాల్‌, ఆర్య‌లు మాత్ర‌మే ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. సూర్య‌, రాజీవ్‌లుగా ఇద్ద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల‌కు నూటికి నూరుశాతం న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేశారు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో నువ్వానేనా అన్న‌ట్లు పోటీ ప‌డి న‌టించారు. మ‌మ‌తా మోహ‌న్‌దాస్, మృణాళిని ర‌విల పాత్ర‌లు అలంకార ప్రాయంగానే మిగిలాయి. తెర‌పై అలా వ‌చ్చి పోతుంటారు త‌ప్ప‌.. వారి పాత్ర‌ల వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేదు. ఇక పాట‌లు మ‌రీ ఇబ్బంది పెట్టాయి. క‌థ కాస్త వేగం పుంజుకుంటుంది క‌దా అనిపించిన ప్ర‌తిసారీ పాట‌లు బ్రేకుల్లా అడ్డుప‌డ్డాయి. క‌థ విష‌యంలో ఆనంద్ పెద్ద‌గా క‌స‌ర‌త్తు చేయ‌లేద‌నిపిస్తుంది. లాజిక్ లేకుండా ప్ర‌తి సీన్‌ను త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో.. ఎక్క‌డా ఓ అర్ధ‌వంత‌మైన క‌థ చూసిన‌ట్లు అనిపించ‌దు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ట్రిమ్ చేసుకోవాల్సింది. అలాగే హీరోలిద్ద‌రి మ‌ధ్య బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ‌ను రాసుకోలేక‌పోయారు. త‌మ‌న్ పాట‌లు ఏమాత్రం మెప్పించవు. శామ్‌.సిఎస్ నేప‌థ్య సంగీతం, రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం ఫ‌ర్వాలేద‌నిపించాయి.

బ‌లాలు

+ విశాల్‌, ఆర్య న‌ట‌న‌

+ క్లైమాక్స్ ఫైట్‌

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌.. క‌థ‌నం.. పాట‌లు

- సాగ‌తీత స‌న్నివేశాలు

చివ‌రిగా: ప్రేక్ష‌కుల పాలిట  ‘ఎనిమి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని