Vishwaksen: మీరు ఎంతమంది ఉన్నా నేను ఒక్కడినే..! 

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడిప్పుడే కెరీర్‌ సెట్‌ చేసుకుంటున్నానని.. కానీ, కొంతమంది సోషల్‌మీడియా వేదికగా తనపై నెగటివిటీ క్రియేట్‌ చేస్తున్నారని విశ్వక్‌సేన్‌ అన్నారు....

Published : 22 Aug 2021 01:09 IST

విజయోత్సవ వేడుకలో విశ్వక్‌సేన్‌

హైదరాబాద్‌: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడిప్పుడే కెరీర్‌ సెట్‌ చేసుకుంటున్నానని.. కానీ, కొంతమంది సోషల్‌మీడియా వేదికగా తనపై నెగెటివిటీ క్రియేట్‌ చేస్తున్నారని విశ్వక్‌సేన్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పాగల్‌’ ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్‌సేన్‌ నెగెటివ్ కామెంట్లు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాగల్‌’ సినిమా బాగున్నప్పటికీ కొంతమంది కావాలనే అసత్యప్రచారం చేస్తున్నారని అన్నారు.

‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా.  ఎన్నో కష్టాలు ఎదుర్కొని ‘వెళ్ళిపోమాకే’తో నటుడిగా పరిచయమయ్యా. నాకంటూ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ‘ఫలక్‌నామాదాస్‌’ కథ రాసుకుని స్నేహితుల డబ్బులతో ఆ సినిమా తీసి హిట్‌ పొందా. ‘పాగల్‌’ సినిమా విడుదలకు ఒకరోజు ముందు విపరీతమైన నెగెటివిటీ ప్రారంభమైంది. నా గురించి, నా సినిమా గురించి అసత్యప్రచారాలు జరిగాయి. ఎవరు ఈ ప్రచారాలు చేస్తున్నారో తెలీదు. కనిపించని శత్రువుతో నేను పోరాటం చేస్తున్నా. నెగెటివ్‌ ప్రచారాలు చేసేవాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ.. ఇటు వైపు నేను ఒక్కడినే. వాటిని ఎదుర్కొంటా. వాళ్లపై నేను తిరిగి దాడి చేయలేను.. ఎందుకంటే వాళ్లలాగా నా దగ్గర వందల్లో సోషల్‌మీడియా అకౌంట్లు లేవు. ఎలాంటి ప్రచారాలు జరిగినా సరే నా సినిమాకి విజయం అందించిన ఘనత ప్రేక్షకులదే’’అని విశ్వక్‌సేన్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని