K Vishwanath: ‘విశ్వనాథ్‌ విశ్వరూపం’.. కళాతపస్వి సినిమాలపై విశ్లేషణాత్మక పుస్తకం

కళాతపస్వి  కె.విశ్వనాథ్‌ సినీ రంగానికే ఆదర్శం. ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం. శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కె.విశ్వనాథ్‌

Published : 15 Oct 2021 17:29 IST

హైదరాబాద్‌: కళాతపస్వి  కె.విశ్వనాథ్‌ సినీ రంగానికే ఆదర్శం. ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం. ‘శంకరాభరణం’ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కె.విశ్వనాథ్‌ సినిమాలు చూసి ముగ్దుడైన ఆర్‌బీఐ ఉన్నతోద్యోగి డాక్టర్‌ రామశాస్త్రి.. ఆయన సినిమాల గురించి ఏకంగా ఓ పుస్తకాన్నే  రచించారు. ‘‘విశ్వనాథ్‌ విశ్వరూపం’’ పేరుతో  రచించిన పుస్తకాన్ని విజయదశమి సందర్భంగా కె.విశ్వనాథ్‌ చేతులమీదుగా  ఆవిష్కరించారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు... కళలకు ప్రాధాన్యం, సామాజిక స్పృహ కలిగించేలా సన్నివేశాలు తీయడం, సాహిత్యానికి పెద్దపీట. వీటన్నింటికీ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో సమ ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగిపోతారు. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతి కిరణం’, ‘స్వర్ణకమలం’, ‘శుభసంకల్పం’, ‘సిరివెన్నెల’ ఇలా ప్రతి సినిమా ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేశాయి. అలా చిన్నప్పటి నుంచి కె.విశ్వనాథ్‌ సినిమాలు చూసి ఆయనకు వీరాభిమానిగా మారారు డాక్టర్‌ రామశాస్త్రి. ఆర్‌బీఐలో చీఫ్ జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి.. పదవీ విరమణ పొందిన రామశాస్త్రి 2017లో కె.విశ్వనాథ్‌పై ఓ పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అంగీకారంతో రాసిన పుస్తకంలో ఎన్నో అంశాలను పొందుపర్చారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘‘ఓ వైపు ఉన్నతోద్యోగం నిర్వహిస్తున్నా.. ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా రామశాస్త్రి సాహిత్యంపై మక్కువతో కె.విశ్వనాథ్‌ సినిమాలను తరచూ చూసేవారు. సమయం చిక్కినప్పుడల్లా భార్యతో కలిసి సినిమాకు వెళ్లి అందులోని కళలను, సందేశాన్ని విశ్లేషించేవారు. ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పలు బ్యాంకులకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ కె.విశ్వనాథ్‌ సినిమాల పట్ల ఉన్న మక్కువ ఏమాత్రం తక్కువ కాలేదు. కె.విశ్వనాథ్‌పై పుస్తకం రచించాలన్న రామశాస్త్రి నిర్ణయాన్ని ఆయన భార్య గాయత్రీదేవి వెన్నుతట్టి ప్రోత్సహించారు. గాయత్రీదేవి వృత్తిరీత్యా  ఆయుర్వేద వైద్యురాలైనప్పటికీ ఆమెకూడా రచనలు చేస్తుండటంతో రామశాస్త్రి రచనలకు తోడ్పాటునందించారు. రామశాస్త్రి నాలుగు నెలలపాటు పూర్తి సమయాన్ని కేటాయించి పుస్తకాన్ని పూర్తి చేశారు. పలు సందర్భాల్లో విశ్వనాథ్‌ సినిమాలను మళ్లీ మళ్లీ చూసి అందులో సందర్భాలను విశ్లేషించి పుస్తకంలో పొందుపర్చారు. కె.విశ్వనాథ్‌ సినిమాల్లో ఎక్కువగా ప్లాష్‌ బ్యాక్‌ ఉంటుంది. శంకరాభరణం, ఉండమ్మా బొట్టుపెడతా, సాగరసంగమం సినిమాల్లోని ప్లాష్‌ బ్యాక్‌ను రామశాస్త్రి తన పుస్తకంలో ప్రస్తావించారు’’ అని తనికెళ్ల భరణి తెలిపారు. రామశాస్త్రి పుస్తకాన్ని చదివిన కె.విశ్వనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. పుస్తకం చదువుతుంటే ప్రస్తుతం తన చిత్రాలను తానే చూసుకున్నట్టుందని రామశాస్త్రిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని