vj sunny: బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీ

బిగ్‌బాస్‌ సీజన్‌-5(Bigg boss telugu 5) విజేతగా నటుడు వీజే సన్నీ(VJ sunny) నిలిచాడు.

Updated : 26 Dec 2021 16:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg boss telugu 5) విజేతగా నటుడు వీజే సన్నీ(VJ sunny) నిలిచాడు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌ (300 square yards), టీవీఎస్‌ అపాచీ బైక్‌ సొంతం చేసుకున్నాడు. సినీతారల సందడితో బిగ్‌బాస్‌-5 గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. టాప్‌-5లో సన్నీతో పాటు షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, సిరి నిలవగా.. ఓటింగ్‌లో వాళ్లను వెనక్కి నెట్టి ఈ సీజన్‌ విజేతగా సన్నీ అవతరించాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్‌ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ(VJ Sunny) విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. రన్నర్‌గా నిలిచిన షణ్ముఖ్‌కు కూడా సువర్ణ భూమి కుటీర్‌ నుంచి మంచి బహుమతి ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా విజేత వీజే సన్నీ మాట్లాడుతూ.. ‘‘ఓటు వేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. నాతో పాటు జర్నీ చేసిన 19మంది కంటెస్టెంట్‌లను ఎప్పటికీ మర్చిపోలేను. నా వల్ల అయినంత వరకూ ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటా. నేను కప్పు గెలుచుకోవడంలో నాగార్జున గారి మోటివేషన్‌, స్నేహితుల సహకారం, మా అమ్మ ప్రోత్సాహం మర్చిపోలేను. మా అమ్మ అడిగిన మొదటి గిఫ్ట్‌. ఆమెకు ఇచ్చేస్తున్నా’’ అని సన్నీ చెప్పుకొచ్చాడు. ఇక రన్నరప్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ మాట్లాడుతూ.. ‘‘ గెలుపు ముఖ్యం కాదు. ఆట ఎలా ఆడమన్నదే ముఖ్యం. నేను అదే నమ్ముతాను. కప్పు ఈ రోజు కాకుంటే రేపు. అమ్మానాన్న ఇక్కడి వరకు వచ్చారు. వాళ్లను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నాడు. ఇక కొత్త సంవత్సరంలో రెండు నెలలు కాగానే ‘బిగ్‌బాస్‌ సీజన్‌-6’ ప్రారంభం కానున్నట్లు ఈ సందర్భంగా నాగార్జున ప్రకటించారు.

కొత్త శ్రీరామ్‌ను చూస్తారు!

ఎలిమినేషన్‌ అనంతరం శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. ‘‘హౌస్‌లో ఉండగా, నాగార్జున ఇచ్చిన మోటివేషన్‌ బాగుంది. ఎవరో ఒక్కరు గెలుస్తారు. ఇక్కడకు వచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని అనుకున్నా. కచ్చితంగా దగ్గరయి ఉంటా. బిగ్‌బాస్‌ జర్నీ ఒక పాఠం. రేపటి నుంచి కొత్త శ్రీరామచంద్రను చూసుకుంటా. హౌస్‌మేట్స్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ 5 ముందున్న శ్రీరామ చంద్రకూ రేపటి నుంచి మీరు చూసే శ్రీరామ చంద్రకు చాలా తేడా ఉంటుంది. నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నాడు.

ఇంకా ఓపిక కావాలి: మానస్‌

‘‘జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నా. మనకు ఎంత ఓపికున్నా తక్కువేనని ఇక్కడ నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ సీజన్‌-5 టైటిల్‌ గెలుచుకోవాలన్న ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుని ఉంటాడు. ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రయత్నించారు. ఎవరు టైటిల్‌ గెలిచినా మేమంతా ఏదో ఒకటి సాధించాం. ఇంత దూరం వచ్చామంటే మాలో ఏదో ఒక పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చే ఉంటుంది. ఎవరు ఎక్కువ నచ్చితే వాడే విన్నర్‌’’ అని మానస్‌ చెప్పుకొచ్చాడు. సిరి మాట్లాడుతూ.. ‘‘19మంది కంటెస్టెంట్‌లలో ఒకరిగా వచ్చిన నేను టాప్‌-5లో నిలవడం సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ జర్నీ చాలా బాగుంది. చాలాసార్లు ఎమోషనల్‌ అయ్యా. ఏదైనా హౌస్‌లో నాకు నచ్చినట్టు నేను ఉన్నా. నా దృష్టిలో సీజన్‌-5 విన్నర్‌ (షణ్ముఖ్) ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15 వారాలు నన్ను భరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు లేనిదే నేను లేను’’ అని భావోద్వేగానికి గురైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని