Pawankalyan: అవన్నీ రూమర్సే.. పవన్‌కల్యాణ్‌కి కథ చెప్పలేదు: విజయేంద్రప్రసాద్‌

‘బాహుబలి’, ‘మణికర్ణిక’, ‘బజరంగీ బాయిజాన్‌’ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లకు కథలందించిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పవన్‌కల్యాణ్‌ ప్రాజెక్ట్‌ గురించి స్పందించారు....

Updated : 02 Aug 2021 12:55 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’, ‘మణికర్ణిక’, ‘బజరంగీ భాయిజాన్‌’ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లకు కథలందించిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పవన్‌కల్యాణ్‌ ప్రాజెక్ట్‌ గురించి స్పందించారు. తాను పవన్‌కల్యాణ్‌ అభిమానినని.. పవన్‌ కోసం ఓ కథ సిద్ధం చేయాలని ఎప్పటి నుంచో ఉందని.. కాకపోతే ఇప్పటివరకూ ఆయన కోసం ప్రత్యేకంగా ఎలాంటి కథ రాయలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా తాను పవన్‌కి కథ వివరించానంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఛాన్స్‌ వస్తే తప్పకుండా ఆయన కోసం కథ రాస్తానని మరోసారి తన మనసులోని మాట బయటపెట్టారు.

అనంతరం ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి స్పందిస్తూ.. ‘‘ఇద్దరు హీరోలతో ఓ బిగ్గెస్ట్‌ కమర్షియల్ చిత్రం చేయాలని రాజమౌళి అనుకున్నాడు. రజనీకాంత్‌-ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌-ఎన్టీఆర్‌, కార్తి-సూర్య, కార్తి-బన్నీ.. ఇలా రకరకాల కాంబినేషన్‌ల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఓసారి రాజమౌళి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అల్లూరి సీతారామరాజు పోరాటయోధుడిగా మారడానికి ముందు కళాశాల చదువు పూర్తి చేసుకుని ఓ రెండేళ్లపాటు ఎక్కడికో వెళ్లిపోయారు. అక్కడి నుంచి వచ్చాకే ఆయన ఆంగ్లేయులపై పోరాటం చేశారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారు? ఆ రెండేళ్లు ఎక్కడ ఉన్నారు? అనే విషయంపై ఎక్కడా కూడా సరైన సమాచారం లేదు. మరోవైపు అల్లూరి సీతారామరాజు వెళ్లిన సమయంలోనే కొమురంభీమ్‌ కూడా కొంతకాలంపాటు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కడికో వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాకే ఆయన మనందరికీ తెలిసిన కొమురంభీమ్‌గా మారారు. ఈ విషయాన్ని చెప్పిన అనంతరం.. ‘నాన్నా.. వీళ్లిద్దరూ ఒకే సమయంలో కొంతకాలంపాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఒకవేళ వాళ్లిద్దరే కనుక పరస్పరం తారసపడితే ఎట్లా ఉంటుంది?’ అని అడిగాడు. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ ప్రారంభమైంది’ అని విజయేంద్రప్రసాద్‌ వివరించారు.

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురంభీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విడుదలైన ‘దోస్తీ’ పాట ప్రతి ఒక్కర్నీ ఎంతో ఆకట్టుకుంటోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు