WWW Movie Review: రివ్యూ: ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’

WWW Movie Review: అదిత్‌ అరుణ్‌, శివానీ రాజశేఖర్‌ కీలక పాత్రల్లో నటించిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు సినిమా ఎలా ఉందంటే?

Updated : 24 Dec 2021 12:23 IST

చిత్రం: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు; నటీనటులు: అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌, సందీప్ భరద్వాజ్‌, రియాజ్‌ ఖాన్‌,సత్యం రాజేశ్‌, ప్రియదర్శి తదితరులు; సంగీతం: సిమన్‌ కె కింగ్‌; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: డాక్టర్‌ రవి ప్రసాద్‌రాజు దాట్ల; సినిమాటోగ్రఫీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్‌; బ్యానర్‌: రమంత్ర క్రియేషన్స్‌; విడుదల: సోనీ లివ్‌

తెలుగులో ఇప్పుడిప్పుడే కాన్సెప్ట్‌ బేస్డ్‌ కథలతో చిత్రాలు వస్తున్నాయి. నేటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న పాయింట్‌ను తీసుకుని ఉత్కంఠతో సాగే కథ, కథనాలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకూ ఇతర భాషల్లో వచ్చిన ఇలాంటి సినిమాలపై మనసు పారేసుకున్న ప్రేక్షకులు.. తెలుగు సినిమాలనూ ఆదరిస్తున్నారు. అయితే, అవి ఎక్కువగా ఓటీటీ బాటపడుతుండటం విశేషం. కరోనా-లాక్‌డౌన్‌తో ప్రజా జీవనంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాంటి వాటిలో ఆన్‌లైన్‌ కనెక్టింగ్‌ ఒకటి. ఈ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమే ‘‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). తెలుగులో వచ్చిన కంప్యూటర్‌ స్క్రీన్‌ ఫీచర్‌ చిత్రంగా ఇది రూపొందింది. మరి ఈ సినిమా కథేంటి?(www movie review) దర్శకుడు కేవీ గుహన్‌ ఎలా తెరకెక్కించారు?

కథేంటంటే: విశ్వ(అదిత్‌ అరుణ్‌)(Adith Arun)సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. స్నేహితులు అష్రఫ్‌(ప్రియదర్శి), క్రిస్టీ(దివ్య శ్రీపాద), సదా(సత్యం రాజేశ్‌)లతో కలిసి పనిచేస్తుంటాడు. విశ్వ ఒకరోజు సడెన్‌గా ఆన్‌లైన్‌లో ఉరివేసుకుంటూ కనిపిస్తాడు. అతడు ఉరితాడు మెడకు తగిలించుకోవడానికి కారణం ఎవరు? ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి? క్రిస్టీ రూమ్‌లో ఉండేందుకు వచ్చిన స్నేహితురాలు మిత్ర(శివానీ రాజశేఖర్‌)తో అతడి ప్రేమకథ ఎలా మొదలైంది? విశ్వ నిజంగానే ఉరి వేసుకున్నాడా?(www movie review) తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: గత కొంతకాలంగా పేపర్లు, టీవీల్లో తరచూ వినిపిస్తున్న మాట సైబర్‌ ఎటాక్‌. బ్యాంకు ఖాతాలు, సామాజిక మాధ్యమాలు, వివిధ కంపెనీలకు సంబంధించిన వినియోగదారుల డేటాను కూర్చొన్న చోటు నుంచి కదలకుండా సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తున్నారు. సైబర్‌క్రైమ్‌కు సంబంధించి సరైన చట్టాలు కూడా లేకపోవటం వీరికి కలిసి వస్తోంది. ఈ ఇతివృత్తాన్నే ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’లో చూపించాలనుకున్నారు దర్శకుడు గుహన్‌.  తెరపై ఆ మేజిక్‌ను క్రియేట్‌ చేయటంలో మాత్రం తడబడ్డారు. సైబర్‌క్రైమ్‌ అనే సబ్జెక్ట్‌ అనంతం. తవ్వేకొద్దీ కొన్ని వందల, వేల కేసులు బయటపడతాయి. ప్రతి కేసూ ఆసక్తికరమే. అయితే, ఏ పాయింట్‌ను ఎంత ఆసక్తికరంగా చూపించారన్న దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అయితే, దర్శకుడు గుహన్‌ వాటి జోలికి పోకుండా  ఈ చిత్రాన్ని ఒక రివేంజ్‌ డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్‌, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది.

క్రిస్టీ రూమ్‌కు ఒక ఆగంతకుడు వచ్చి ఆమెను కత్తితో పొడవటంతో సినిమా కీలక మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఉత్కంఠతో సాగుతాయి. మిత్రను కొట్టి బంధించడంతో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో కలుగుతుంది. అటువైపు నుంచి అన్నీ ఆన్‌లైన్‌లో చూస్తున్న విశ్వ.. ఆమెను ఎలా కాపాడతాడన్న ఉత్కంఠతో కథాగమనం సాగుతుంది. ఆగంతకుడు ఎందుకు ఇలా చేస్తున్నాడన్న ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది. అయితే, అందుకు దర్శకుడు ఇచ్చిన రీజన్‌ చాలా పేలవంగా ఉంది. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆ ఆగంతకుడితో చాలా సాధారణంగా చెప్పించారు. అతడి ఫ్లాష్‌బ్యాక్‌లో బలమైన ఎమోషన్‌ లేదు. అందరూ ఊహించినట్టే పతాక సన్నివేశాలు ఉంటాయి.

ఎవరెలా చేశారంటే: ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’లో కనిపించే పాత్రలు చాలా తక్కువ. పైగా సినిమా అంతా వెబ్‌ కెమెరాతో తెర కనిపిస్తుంటుంది. విశ్వగా అదితి అరుణ్‌ చక్కగా నటించాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాలు ప్రదర్శించాడు. ‘అద్భుతం’ తర్వాత శివానీ రాజశేఖర్‌ నటించిన మరో చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు పెద్దగా ఆస్కారం లేదు. మిగిలిన వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సంగీతం పర్వాలేదు ‘నైలు నది’ పాట వినసొంపుగా ఉంది. అయితే, వెబ్‌ కెమెరాపై తెరపై హీరో-హీరోయిన పాత్రల మధ్య సన్నివేశాలు తప్ప మరొకటి ఊహించలేం. దర్శకుడు కె.వి.గుహన్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. కంప్యూటర్‌ స్క్రీన్‌ ఫీచర్‌ చిత్రంగా దీన్ని మలచాలనుకోవడం అభినందనీయం. అయితే దాన్ని ఆసక్తిగా మలచడంలో ప్రభావం చూపలేకపోయారు. ఉత్కంఠతో సాగే కొన్ని సన్నివేశాలు మినహా ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’(www movie review) పెద్దగా మెప్పించలేదు.

బలాలు

+ ద్వితీయార్ధం

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- ప్రథమార్ధం

- భావోద్వేగాలు పండకపోవటం

చివరిగా: ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ప్రయత్నం బాగున్నా.. ప్రేక్షకులను మెప్పించాలి కదా!

ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని