Cinema News: నాయకా.. ఎప్పుడు నీ రాక!

‘‘కొన్నిసార్లు రావడం ఆలస్యమవ్వొచ్చు.. కానీ, రావడం మాత్రం పక్కా’’ అంటుంటారు అగ్ర కథానాయకులు.

Published : 15 Jun 2024 00:39 IST

చిత్రీకరణ ముగింపుకొచ్చినా తేలని సినిమా విడుదల

‘‘కొన్నిసార్లు రావడం ఆలస్యమవ్వొచ్చు.. కానీ, రావడం మాత్రం పక్కా’’ అంటుంటారు అగ్ర కథానాయకులు. ప్రేక్షకులు మాత్రం ‘ఆ విచ్చేసేదెప్పుడో కాస్త ముందుగానే చెప్పేయండి బాబూ’ అంటూ ఆ విడుదల కబురు కోసం ఆసక్తి కనబరుస్తుంటారు. ఎందుకంటే తమ అభిమాన తారల నుంచి ఆ కబురు వినిపించిందంటే చాలు వాళ్లలో కనిపించే ఉత్సాహం మరో స్థాయిలో ఉంటుంది. ఆ కబురే బాక్సాఫీస్‌కు ఓ భరోసాని.. నూతనోత్తేజాన్ని అందిస్తుంటుంది. అందుకే కొందరు హీరోలు సినిమా శ్రీకారం రోజే విడుదల తేదీ ప్రకటిస్తే.. మరికొందరు చిత్రీకరణ దశలో ఆ కబురు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో పలువురు స్టార్‌ హీరోల చిత్రాలు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నా.. ఎప్పుడొస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో వాళ్లు ఎప్పుడు విచ్చేస్తారన్నది ప్రేక్షకుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

నిజానికి తెలుగు సినీ క్యాలెండర్‌ ఎప్పుడూ పక్కా ప్రణాళికలతోనే సిద్ధంగా కనిపించేది. ముఖ్యంగా అగ్ర కథానాయకుల విడుదలల విషయంలో ఆరేడు నెలల ముందు నుంచే స్పష్టత వచ్చేసేది. కాకపోతే కొవిడ్‌ తర్వాత నుంచి ఈ లెక్కలన్నీ కాస్త అదుపు తప్పాయి. పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఊపందుకున్నాక నాణ్యతను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణల విషయంలో ఆచితూచి అడుగులేయడం.. మరోవైపు ఓటీటీ, శాటిలైట్‌ రైట్ల ఒప్పందాల్లో ఎదురవుతున్న జాప్యాల వల్ల విడుదల కబురు ఆలస్యమవుతోంది. ఇలా ప్రస్తుతం తెలుగులో ముగింపు దశ చిత్రీకరణలో ఉండీ ఇంత వరకు విడుదల విషయమై స్పష్టత ఇవ్వని చిత్ర బృందాలు చాలానే ఉన్నాయి.

రెండేళ్ల క్రితం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆ తర్వాత ఆయన మళ్లీ తెరపై కనిపించలేదు. అప్పటి నుంచి తను శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం సెట్లో శ్రమిస్తూనే ఉన్నారు. నిజానికి ఇది ఈ ఏడాది ఆరంభంలోనే రావాల్సి ఉన్నప్పటికీ శంకర్‌ మరోవైపు ‘భారతీయుడు 2’ కోసం కూడా సమయం కేటాయించాల్సి రావడంతో చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ‘గేమ్‌ ఛేంజర్‌’ ముగింపు దశకు చేరుకున్నా ఇంత వరకు విడుదలెప్పుడన్నది తేలలేదు. ఆ మధ్య ఇది అక్టోబరు నెలాఖరున బరిలో దిగనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, తాజాగా ఎన్టీఆర్‌ ‘దేవర’ దసరా బరి నుంచి తప్పుకుని సెప్టెంబరు నెలాఖరున రావడానికి సిద్ధమవడంతో.. ఇప్పుడా పండగ తేదీకి చరణ్‌ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. 

పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ సెప్టెంబరు 27న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పుడది వాయిదా పడటం దాదాపుగా ఖాయమైపోయింది. నిజానికి అది ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నా.. ప్రస్తుతం పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో మిగిలిన ఉన్న చిత్రీకరణను పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించిన ఓటీటీ, శాటిలైట్‌ రైట్ల ఒప్పందాలు పూర్తిగా కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో ఇది ఏడాదిలో విడుదలవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మరోవైపు ‘హరి హర వీరమల్లు’ బృందం మాత్రం తమ చిత్రాన్ని ఈ ఏడాదే బాక్సాఫీస్‌ బరిలో దింపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇది రెండు భాగాలుగా సినీప్రియుల ముందుకు రానుండగా.. తొలి భాగం కోసం పవన్‌ మరో 20రోజులు షూట్‌లో పాల్గొనాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగి పవన్‌ ఆగస్టు నాటికి సెట్లోకి వచ్చినా.. డిసెంబరు నాటికి సినిమాని సిద్ధం చేయడం పెద్ద పనేమీ కాకపోవచ్చు. అందుకే ఈ చిత్ర బృందం కూడా పవన్‌ సెట్లోకి వచ్చే దాన్ని బట్టి విడుదల తేదీ ప్రకటించాలని చూస్తోంది.

ఈ ఏడాది ఇప్పటికే ‘ఈగల్‌’ సినిమాతో సినీప్రియుల్ని పలకరించారు కథానాయకుడు రవితేజ. ప్రస్తుతం ఆయన హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో ఉంది. ఇది ఈ ఏడాదే థియేటర్లలోకి రానుందని చిత్ర వర్గాలు చెబుతున్నప్పటికీ విడుదల తేదీపై ఇంత వరకు ఏ స్పష్టతా ఇవ్వలేదు. ఓటీటీ, శాటిలైట్‌ ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చాకే ఆ కబురు వినిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

యువ హీరోలూ చెప్పాలి

విడుదల విషయంలో స్పష్టత ఇవ్వని జాబితాలో అగ్రతారలతో పాటు పలువురు కుర్ర స్టార్ల సినిమాలూ ఉన్నాయి. ప్రస్తుతం కథానాయకుడు రామ్‌ పోతినేని.. దర్శకుడు పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వీళ్లిద్దరి కాంబోలోనే వచ్చిన విజయవంతమైన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. ఇప్పుడు సెట్స్‌పై తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం.. తెరపైకి ఎప్పుడొస్తుందన్నది ఇంకా తేలలేదు. నిన్నమొన్నటి వరకు ఇది జులై బరిలో దిగనున్నట్లు ప్రచారం వినిపించింది. కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ ఆగస్టు బరి నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో రామ్‌ సినిమా ఆ తేదీపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ‘పుష్ప 2’ రాకను బట్టి త్వరలోనే దీని విడుదలపై స్పష్టత రానున్నట్లు సమాచారం. ‘మట్కా’తో సినీప్రియుల్ని అలరించేందుకు సమాయత్తమవుతున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియాడిక్‌ డ్రామా ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ, దీన్నెప్పుడు తీసుకొస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని డిసెంబరులో బాక్సాఫీస్‌ ముందు చూసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

అనువాదాలు ఆకర్షిస్తున్నాయి 

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని.. సినీప్రియులను ఆకర్షిస్తున్న వాటిలో కొన్ని పరభాషా అగ్రతారల సినిమాలూ ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది విక్రమ్‌ ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో ముస్తాబైన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా చాలా నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్నా.. ఇంత వరకు విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఇది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశమున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఇక సూర్య కథానాయకుడిగా శివ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ‘కంగువా’. కొన్ని నెలల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. కానీ, దీని నుంచి ఇంత వరకు విడుదల కబురు వినపడలేదు. ఇది అక్టోబరులో థియేటర్లలోకి రానున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని