Ponniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. ముఖ్యమైన ఈ పది పాత్రలు గురించి మీకు తెలుసా?

Ponniyin Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌లో పాత్రల గురించి మీకు తెలుసా?

Updated : 27 Sep 2022 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పొన్నియిన్‌ సెల్వన్‌.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనే కాదు, సినీ అభిమానుల్లో ట్రెండ్‌ ఇదే. మణిరత్నం కలల ప్రాజెక్టు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దక్షిణాపథాన్ని పరిపాలించిన చోళుల ఇతివృత్తంగా కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా మణిరత్నం దీనిని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష ఇలా పలువురు ప్రముఖులు ఇందులో నటించారు. మరి వీరిలో ముఖ్య పాత్రలు ఎవరు? సినిమాలో వారి నేపథ్యం ఏంటి? చూసేయండి.


సుందర చోళుడు

సువిశాల చోళ సామ్రాజ్యానికి రాజు సుందర చోళుడు. ఈ కథ మొదలయ్యే సమయానికి సుందర చోళుడు అనారోగ్యం బారినపడి తంజావురు కోటలో మంచంలో ఉంటాడు. సుందర చోళుడు ఆయన భార్య వానవన్‌ మహాదేవికి ముగ్గురు సంతానం. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో సుందర చోళుడి పాత్రను ప్రకాశ్‌రాజ్‌ పోషిస్తుండగా, వానవన్‌ మహాదేవిగా విద్య సుబ్రమణియన్‌ చేస్తున్నారు.


ఆదిత్య కరికాలన్‌

సుందర చోళుడి పెద్ద కుమారుడు చోళ సామ్రాజ్యపు యువరాజు ఆదిత్య కరికాలుడు. కాంచీపురం/కంచిలో అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించుకుని అక్కడే ఉంటాడు. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు ఇక్కడకు రావటం, ఆదిత్యుడు వాళ్ల దగ్గరకు వెళ్తుంటారు. ఈ సినిమాలో విక్రమ్‌.. ఆదిత్య కరికాలన్‌గా కనిపించనున్నారు.


కుందవై

రాజకుమారి కుందవై సుగుణవతి. రాజనీతిజ్ఞత కలది. చోళుల కాలం నాటి రాజకీయలు, రాజనీతితంత్రంపై ఆమెకున్న పట్టు మరొకరికి లేదు. చోళుల పాత రాజధాని అయిన పళయారై ప్యాలెస్‌ ఆమె రాజప్రసాదం.  కుందవై పాత్రలో త్రిష నటిస్తున్నారు.


అరుళ్‌మోళి వర్మన్‌

సుందర చోళుడి చిన్న కుమారుడు అరుళ్‌మోళి వర్మన్‌. ఇతడిని తమ తర్వాతి రాజుగా చోళ ప్రజలు భావిస్తుంటారు. ఇతడొక గొప్ప నాయకుడు అవుతాడని అనుకుంటారు. ఇతడినే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అని కూడా పిలుస్తారు. జయం రవి అరుళ్‌మోహి వర్మన్‌గా కనిపించనున్నారు.


వల్లవరాయన్‌ వందిదేవన్‌

ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు. చోళులకు విధేయులుగా ఉండే బాన తెగకు చెందిన వాడు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కథ వల్లవరాయన్‌తోనే మొదలై, అతడితోనే ముగుస్తుంది. పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసేది ఇతడే.  వల్లవరాయన్‌ సమయస్ఫూర్తి కలవాడు. చమత్కారి కూడా. కార్తి ఈ పాత్రలో నటిస్తున్నారు.


నందిని

పొన్నియిన్‌ సెల్వన్‌ ప్రపంచంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్ర నందిని. పెరియా  పళవెట్టారియార్‌కు భార్య. తన అందం, అభినయంతో ఎలాంటి పురుషుడినైనా పాదాక్రాంతం చేసుకుంటుంది. గతంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించి అవమానాల పాలు చేసిన వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావిస్తుంటుంది. ఈ పాత్రను ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ చేస్తున్నారు.


పెరియ పళవేట్టురాయర్‌

పళవేట్టురాయర్‌ వంశానికి చెందిన వాడు పెరియ పళవేట్టురాయర్‌. చోళ సామ్రాజ్యానికి కోశాధికారి. ఇతడికి ఒక తమ్ముడు పేరు చిన పెరియ పళవేట్టురాయర్‌. రాజ్యాధికారం దక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. వీరిపై సుందర చోళుడికి అపారమైన నమ్మకం. పెరియ పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ కనిపించనున్నారు.


చిన పళవేట్టురాయర్‌

తంజావూరు కోటకు సేనాధిపతి. ఇతడి అనుమతి లేకుండా సుందర చోళుడిని కలవడానికి ఎవరికీ అనుమతి లేదు. ఆర్‌.పార్తిబన్‌ చిన పళవేట్టురాయర్‌గా నటించారు.


పూంగుళలి

పూంగుళలి అలియాస్‌ సముదిరై కుమారై పాత్రలో ఐశ్వర్యా లక్ష్మీ నటించారు. ఇందులో ఆమె బోటు నడిపే యువతిగా కనిపిస్తారు. వల్లవరాయన్‌ వందిదేవన్‌, అరుళ్‌మోళి వర్మన్‌ ప్రాణాలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోతుంది. అసలు విషయం ఏంటంటే, ఆమె చోళ రాజ్యానికి చెందిన మహిళేనన్న విషయం చాలా ఆలస్యంగా తెలుస్తుంది.


ఆళ్వార్‌ కడియాన్‌ నంబి

చోళ సామ్రాజ్యపు గూఢచారి. చోళ ప్రధాని అనిరుద్ధ బ్రహ్మయ్యర్‌ కోసం పని చేస్తుంటాడు. చోళ రాజ్యాన్ని కాపాడే క్రమంలో నంబి తరచూ వల్లవరాయన్‌ వందిదేవన్‌ను కలుస్తుంటాడు. ఈ పాత్రలో జయరామ్‌ కనిపించనున్నారు.

ఇక వీరు కాకుండా ఈ సినిమాలో మధురాంతకుడు (రెహమాన్‌), వానతి (శోభితా ధూళిపాళ -సామంతరాజు కుమార్తె), పార్థిబేంద్ర పల్లవన్‌ (విక్రమ్‌ ప్రభు), వీరపాండ్యన్‌ (నాజర్‌) సెంబియన్‌ మహాదేవి( జయచిత్ర) ఇలా ఈ కథ నిండా ఎన్నో పాత్రలు ఉన్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts