Natti Kumar: ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలి: నిర్మాత నట్టికుమార్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏపీ సినిమా టికెట్‌ ధరల విషయం మరోసారి వివాదాన్ని రాజేసింది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయంటూ నాని చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్..

Updated : 23 Dec 2021 16:25 IST

నటుడి వ్యాఖ్యలు తప్పుపట్టిన నిర్మాత

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఏపీ సినిమా టికెట్‌ ధరల విషయం మరోసారి వివాదాన్ని రాజేసింది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయంటూ నాని చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్‌ తప్పుపట్టారు. ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరలు, కలెక్షన్స్‌, షేర్స్‌ గురించి సరైన అవగాహన లేకుండా నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘కలెక్షన్స్‌, టికెట్‌ రేట్లు, ఎంత షేరు వస్తుంది? అనే దానిపై నానిగారికి అవగాహన ఉంటే మాట్లాడొచ్చు. ఇదే రేట్లుపై రాష్ట్రంలో ఉన్న సినిమా హాళ్లన్నీ ఫుల్‌ అయితే, రోజుకు రూ.16కోట్లు వస్తుందని అంచాన వేశారు. గతంలో రూ.100 టికెట్‌ మాత్రమే ఉంది. ఇప్పుడు రూ.150, రూ.250 టికెట్లు కూడా ఉన్నాయి. కాకపోతే బీ,సీ సెంటర్లలో టికెట్‌ రేట్లు తక్కువ. రూ.35 ఉండటం అన్యాయం. దాని గురించి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సినిమా పెద్దలందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీ,సీ సెంటర్లలో టికెట్‌ రేట్ల విషయంలో ‘పుష్ప’, ‘అఖండ’ సినిమాలకు ఇబ్బంది వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి. రేట్లు తెలియకుండా ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదు. నానిగారు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’’

‘‘ఇలాంటి వ్యాఖ్యల వల్ల పెద్ద సినిమాలు ఇబ్బంది పడతాయి. సినిమా విడుదలైన తర్వాత రెండు వారాల పాటు రేట్లు పెంచుకునే అవకాశం లభిస్తుందన్న నమ్మకం ఉంది. అన్ని వైపుల నుంచి చిన్న చిన్న తప్పులు జరిగాయి. ఇప్పుడున్న రేట్ల ప్రకారం నానిగారి సినిమాకు ఇబ్బంది లేదు. నాకూ బీ,సీ సెంటర్లలో థియేటర్లు ఉన్నాయి. నేనూ బాధపడుతున్నా. నిన్న తనిఖీలు చేశారు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని వ్యాఖ్యలు సరికావు. 230 థియేటర్‌ల యజమానులు వెళ్లి కోర్టు పిటిషన్‌ వేసినందుకు, మిగిలిన అన్ని థియేటర్‌లలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ 70 థియేటర్లను సీజన్‌ చేశారు. ఈ సమస్యలతోనే సతమతమవుతుంటే, ఇలా మాట్లాడటం అవసరమా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో 11మంది హీరోల సినిమా టికెట్లు కొత్త రేట్లకు అమ్మితేనే సమస్య వస్తుంది. దాని గురించి మంత్రి మాట్లాడతానని అన్నారు. ఈ లోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. జీవో నెం.35 రద్దు చేయడం వల్ల 1100 థియేటర్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. నాని వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ తదుపరి కార్యాచరణ మొదలు పెడితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి పెద్ద సినిమాలకు భారీ నష్టం వస్తుంది. ప్రభుత్వాన్ని కిరాణా దుకాణంలో పోల్చడం సరికాదు. జనవరి 4వ తేదీ నాటికి అన్ని సమస్యలు సర్దుమణుగుతాయి. ఈలోగా ప్రభుత్వంతో గొడవపడటం మంచిది కాదు’’ అని నిర్మాత నట్టి కుమార్‌ చెప్పుకొచ్చారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని