అందరిలాగే మా ఇంట్లోనూ గొడవలున్నాయి.. కానీ: విజయ్ తండ్రి చంద్రశేఖర్‌

తన తనయుడు, స్టార్‌ హీరో విజయ్‌తో ఉన్న గొడవలు గురించి ఆయన తండ్రి చంద్రశేఖర్‌ స్పందించారు. కుటుంబంలో ఇవి సర్వసాధారణమని చెప్పిన ఆయన.. విజయ్‌ కోసం తాను ఎప్పుడూ దేవుడిని ప్రార్థిస్తానని చెప్పారు.

Updated : 27 Nov 2022 13:56 IST

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ అన్నారు . అయితే.. ఎంతో శ్రమించి ఈ స్థాయికి ఎదిగాడని వివరించారు. తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రశేఖర్‌ తెలుగు మీడియాతో మాట్లాడారు.

‘‘నటుడిగా పరిచయమైన సమయంలో విజయ్‌ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. లుక్స్‌ ఏం బాలేవని అనేవారు. అప్పుడు విజయ్‌ హీరోగా నేను ఐదు సినిమాలు చేశా. ఆ తర్వాత బయట నుంచి అవకాశాలు వచ్చాయి. విజయ్‌ ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చాడు. మొదట్లో.. చంద్రశేఖర్‌ తనయుడు విజయ్ అని చెప్పేవాళ్లు... ఇప్పుడు, విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ అని చెబుతున్నారంటే.. అందుకు నేనెంతో గర్విస్తున్నా’’

‘‘ప్రతి కుటుంబంలో గొడవలు సాధారణం. అలాగే మా కుటుంబంలోనూ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. విజయ్‌కు నాకు గొడవలు ఉన్నాయని సోషల్‌మీడియాలో తరచూ కథనాలు వస్తుంటాయి. మేమిద్దరం వాటిని పట్టించుకోం. మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. విజయ్‌, నేను రోజూ కలుస్తూనే ఉంటాం. నాకు కాస్త కోపం ఎక్కువ. ఎంత కోపం వచ్చినా అతడు నా కొడుకు. అతడు ఎప్పుడూ బాగుండాలని దేవుడిని కోరుకుంటా’’ అని చంద్రశేఖర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని