
Pawankalyan: ‘భీమ్లానాయక్’పై తమన్ కామెంట్స్ వైరల్
హైదరాబాద్: పవన్‌కల్యాణ్-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లానాయక్’పై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ‘భీమ్లానాయక్’ వీక్షించినట్లు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడారు. ఇప్పటి వరకూ తాను కంపోజ్ చేసిన, చేయనున్న సినిమాలపై తమన్ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీమ్లానాయక్’పై స్పందించమని యాంకర్ కోరడంతో తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘త్రివిక్రమ్‌గారు నేనూ ఇటీవల ‘భీమ్లానాయక్’ రషెస్ చూశాం. ఆ సినిమాలో పవన్‌కల్యాణ్ యాక్షన్ నాకు బాగా నచ్చేసింది. పవన్ కెరీర్‌లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమా కోసం నా వరకూ నేను ది బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించాను’’ అని తమన్ తెలిపారు. ఇక ‘భీమ్లానాయక్’ విషయానికి వస్తే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందించారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తమన్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సినిమా నుంచి ఓ లవ్లీసాంగ్‌ని అభిమానుల ఎదుటకు తీసుకువచ్చేందుకు ‘సర్కారు వారి పాట’ బృందం సన్నాహాలు చేస్తోంది.