Published : 11 Aug 2022 21:13 IST

Sita Ramam: ‘సీతారామం’తో మరో సినిమా చేస్తాం: హను రాఘవపూడి

హైదరాబాద్‌: ‘సీతారామం’ (Sita Ramam) సినిమా జోడీతో మరో అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తానని, ప్రేక్షకుల్ని త్వరలోనే అలరిస్తామని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. ‘సీతారామం’ విజయం సాధించిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చిత్ర బృందం థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. మృణాల్‌ పోషించిన సీత పాత్రతో తాను ప్రేమలో పడినట్లు చెప్పారు.

‘‘అశ్వినీదత్‌ గారి పిల్లలు స్వప్న, ప్రియాంక.. ఎంతో కాలం నుంచి వాళ్లు నాకు తెలుసు. దత్‌, వైజయంతి సంస్థకు వాళ్లిద్దరూ పెద్ద అండ. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా చెప్పుకొనే వైజయంతి బ్యానర్‌ కోసం వాళ్లిద్దరూ ఎంతో శ్రమిస్తున్నారు. అందుకు వారికి నా అభినందనలు. ‘సీతారామం’ చూశా. చాలా అసూయపడ్డా. ఎందుకంటే నాకు రావాల్సిన పాత్ర దుల్కర్‌కు వెళ్లింది. ఆ పాత్రను చూస్తే పాత రోజులు గుర్తుకొచ్చాయి. రొమాంటిక్‌ చిత్రాలను ప్రేక్షకులు ఇంతలా అభిమానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేమకథా చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే దాన్ని వారు ఏ స్థాయికి తీసుకువెళ్తారో ఊహించలేం. ఎన్నిసార్లైనా ఆ చిత్రాన్ని చూస్తూనే ఉంటారు. హను.. సినిమాలోని ప్రతి పాత్రను నువ్వు అద్భుతంగా తీర్చి దిద్దావు. ఇలాంటి చిత్రాన్ని రూపొందించడానికి ధైర్యం కావాలి. ఇలాంటి అందమైన చిత్రాన్ని చూసి చాలా రోజులైంది. మృణాల్‌ మీ పాత్రతో ప్రేమలో పడిపోయా. దుల్కర్‌ నువ్వు ఎప్పుడూ అందంగా, కలివిడిగా ఉంటావు. నా మేనకోడలి కుమార్తెకు నువ్వంటే ఎంతో అభిమానం. తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం. సినిమాలు బాగుంటే తప్పకుండా థియేటర్లకు వస్తామని మరోసారి నిరూపించారు. మా చిత్ర పరిశ్రమకు ఎంతో అండగా నిలిచారు. అందరిలో ఒక ధైర్యం నింపారు’’ అని నాగార్జున అని వివరించారు.

‘‘తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా చిత్రానికి ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన మీకు ఎలా థ్యాంక్స్‌ చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు చూపించిన ప్రేమాభిమానాలు నాకెంతో ఉత్సాహాన్ని అందించాయి. నన్ను మీ వాడిగా ఆదరించినందుకు ధన్యవాదాలు. స్వప్న.. ‘మహానటి’కి ఎలా అయితే పిలిచి అవకాశాన్ని ఇచ్చావో ఈ సినిమాలోని రామ్‌ పాత్రకు సరిగ్గా నప్పుతానని భావించి ఆఫర్‌ ఇచ్చావు. హను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. నేనిప్పటి వరకూ పోషించిన ది బెస్ట్ పాత్రల్లో ఇదీ ఒకటి. అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. మృణాల్‌ పోషించిన సీతామహాలక్ష్మి పాత్రతో ఎంతోమంది ప్రేమలో పడుతున్నారు. ఆ పాత్రకు ముగ్ధులై ఎంతో మంది ప్రేక్షకులు తిరిగి థియేటర్స్‌కు తీసుకువస్తున్నారు. ఆమె లేకపోతే ‘సీతారామం’ లేదు’’ అని దుల్కర్‌ పేర్కొన్నారు. అనంతరం, మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానమిచ్చింది.

మీరు ఇప్పటివరకూ ఎన్నో హిట్‌ చిత్రాలు తీశారు. ఈ హిట్‌ చిత్రం మీకెలాంటి అనుభూతి పంచింది?

అశ్వినీదత్‌: మీరన్నట్టే ఎన్నో గొప్ప సినిమాలు తీశా. ‘ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ చేయలేదే’ అన్న వెలితి ఎంతోకాలం నుంచి నాలో ఉండేది. ఎందుకంటే, నేను ఇండస్ట్రీలోకి రాకముందు, వచ్చిన తర్వాత ‘మరోచరిత్ర’, ‘గీతాంజలి’ ఈ రెండే ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీలు. నేను కూడా అలాంటి ప్రేమ కథను తీయగలనా అనుకునేవాడిని. నాగ్‌ అశ్విన్‌ ఓ రోజు ఆఫీస్‌కు వచ్చి హను రాఘవపూడితో సినిమా చేయండి. మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పాడు. స్వప్న కథ విని నాతో చెప్పాక.. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ విన్నా. ఇదే కదా నేనెంతో కాలంగా నుంచి ఎదురుచూస్తోన్న సినిమా అనిపించింది.

పార్ట్‌- 2 తీస్తారా?

హను: ప్రేక్షకులు అంతగా ఎమోషనల్‌ కావడానికి నటీనటులే కారణం. వాళ్లిద్దరూ బాగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ చేసే అవకాశం లేదు. కానీ, ఈ జోడీతో మరోసారి ఓ సినిమా చేస్తాం.

ఈ బ్యానర్‌లో మూడో సినిమా ఎప్పుడు చేస్తారు?

దుల్కర్‌: ఆ విషయం వైజయంతి వాళ్లనే అడగాలి. ఇలాంటి ప్రొడక్షన్‌ హౌస్‌ని నేను ఎప్పుడూ చూడలేదు. సంస్థ వారంతా ఒక కుటుంబంలా ఉంటారు. 

టాలీవుడ్‌లో చాలా మంది యంగ్‌ హీరోలున్నారు? దుల్కర్‌ని ఎంచుకోవడానికి కారణం?

హను: దుల్కర్‌ మాత్రమే చేయగలిగే రోల్‌ ఇది అని నేను నమ్మాను.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని