Naga Chaitanya: నా తొలి సినిమా అన్నట్టుంది!

‘‘సినిమాల్లో కథానాయకుడిగా కంటే... ప్రత్యేక పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం తొలిసారి వచ్చింది. ఇకపైనా ఈ తరహా ప్రయత్నాలు కొనసాగించాలనేంతగా ప్రభావం చూపించిందీ సినిమా’’ అన్నారు యువ కథానాయకుడు నాగచైతన్య. ఆయన ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఇటీవల నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’.

Updated : 11 Aug 2022 12:01 IST

‘‘సినిమాల్లో కథానాయకుడిగా కంటే... ప్రత్యేక పాత్రల్లో నటించడం అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం తొలిసారి వచ్చింది. ఇకపైనా ఈ తరహా ప్రయత్నాలు కొనసాగించాలనేంతగా ప్రభావం చూపించిందీ సినిమా’’ అన్నారు యువ కథానాయకుడు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఇటీవల నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). ప్రముఖ కథానాయకుడు చిరంజీవి సమర్పకుడిగా గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. ఈ సందర్భంగా నాగచైతన్య బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన విషయాలివీ...

‘‘కొన్ని సినిమాల్లో పనిచేసిన అనుభవం, ఆ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటిదే ‘లాల్‌సింగ్‌ చడ్డా’. ఆమిర్‌ఖాన్‌ని చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నా. తొలిసారి ఈ సినిమా కోసమని నాకు ఫోన్‌ చేశారాయన. అప్పుడు నేను నమ్మలేదు. అదే రోజు సాయంత్రం మళ్లీ ఆమిర్‌ఖాన్‌, ఆ తర్వాత దర్శకుడు అద్వైత్‌ చందన్‌ ఫోన్‌ చేసి ఈ కథ చెప్పారు. నాది 20 నుంచి 30 నిమిషాల నిడివిగల పాత్రే. వినగానే చాలా నచ్చింది. నన్ను దృష్టిలో ఉంచుకునే ఇందులోని బాలరాజు పాత్రని తెలుగు కుర్రాడిగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర కోసమే ఆమిర్‌ఖాన్‌ మన ప్రాంతానికి వచ్చి నటించి వెళ్లారు. దీన్ని నాలుగు రోజులుగా పలు ప్రధాన నగరాల్లో చాలా మంది చూశారు. మెచ్చుకున్నారు’’.

* ‘‘1975 నుంచి మొదలయ్యే ఈ కథ మన దేశంలో జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనల్ని ఆవిష్కరిస్తుంది. అందుకే ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. నేను గుంటూరు జిల్లాలోని బోడిపాలెంలో పుట్టిన బాలరాజు అనే యువకుడిగా కనిపిస్తా. ఆర్మీలోకి వెళ్లిన అతనికీ, కథా  నాయకుడికీ మధ్య సంబంధమేమిటనేది తెరపైనే చూడాలి. కొత్త మార్కెట్‌లోకి నన్ను తీసుకెళుతున్న సినిమా ఇది. ఇదే నా తొలి సినిమా అన్నట్టుగా ఉంది. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కి వస్తారు. ఈమధ్య విడుదలైన     ‘బింబిసార’, ‘సీతారామం’ అదే విషయాన్ని నిరూపించాయి. మంచి కథతో తెరకెక్కిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’’.

* ‘‘హిందీలో ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా. బాలీవుడ్‌ అవకాశాల గురించి ఇంకా ఆలోచించలేదు. అయితే ఎక్కడి నుంచి అవకాశం వచ్చినా తెలుగుకే నా ప్రాధాన్యం. చెన్నైలో పెరిగాను కాబట్టి తమిళ చిత్రాల్లోనూ నటిస్తా. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న నా తదుపరి సినిమా జనవరిలో కానీ, మార్చిలో కానీ విడుదలవుతుంది’’.

* ‘‘మల్టీస్టారర్‌ సినిమాలు చాలానే చేశా. అయితే వాటిలో నేనూ హీరోగానే కనిపిస్తా. హీరో పాత్రలు కొన్ని కొలతలకి అనుగుణంగానే ముందుకు సాగుతుంటాయి. ప్రత్యేక పాత్రలు అలా ఉండవు. నటించేటప్పుడూ ఏ భారం లేకుండా స్వేచ్ఛగా చేసే వెసులుబాటు ఉంటుంది. ఆమిర్‌ఖాన్‌ హీరో కాబట్టి నేను బాలరాజు పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయే ప్రయత్నం చేశా. సినీ పరిశ్రమల్ని పోల్చి చూడటం నాకు ఇష్టం ఉండదు. పని విషయంలో ఎవరి స్టైల్‌ వాళ్లది. ఏది తప్పు కాదు, ఏదీ సరైందని కాదు. ఆ పనితీరుని గౌరవించడానికి ఇష్టపడతా’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts