ఆ నిశ్శబ్దం ఎనిమిదేళ్లు నిద్రలేకుండా చేసింది: దర్శకుడు

ఎనిమిదేళ్ల క్రితం తాను తెరకెక్కించిన ఓ సినిమా పరాజయంపై కోలీవుడ్‌ యువ దర్శకుడు యువరాజ్‌ దయాలన్‌ (Yuvaraj Dhayalan) తాజాగా స్పందించారు. ఆ సినిమా ఫలితంతో తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు.

Published : 27 Sep 2023 17:22 IST

చెన్నై: తాను తెరకెక్కించిన ఓ సినిమా ఫలితం తనని ఎంతో కలచివేసిందని తమిళ చిత్ర దర్శకుడు యువరాజ్‌ దయాలన్‌ (Yuvaraj Dhayalan) తెలిపారు. ఆ సినిమా పరాజయం కొన్నేళ్లపాటు నిద్ర లేకుండా చేసిందని చెప్పారు. ‘‘ఇలై’ (ELI) చిత్రాన్ని విడుదలకు ముందు విలేకర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాం. ప్రెస్‌వాళ్ల స్పందన కోసం నేనూ, వడివేలు సర్‌ థియేటర్‌ బయట ఎదురుచూశాం. ఎవరూ బయటకు రాలేదు. దాంతో మేమే లోపలికి వెళ్లాం. హాల్‌ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. వాళ్ల నిశ్శబ్దం నన్ను చిన్నాభిన్నం చేసింది. ఎనిమిదేళ్లు నిద్రలేని రాత్రులు గడిపా. వాళ్ల జీవితంలో మూడు గంటలు వృధా చేశానని సిగ్గుపడ్డా. పరిశ్రమకు దూరంగా ఉన్నా. ‘ఇరుగపట్రు’ నిర్మాతల వల్లే నేను మళ్లీ పరిశ్రమలోకి అడుగు పెట్టగలిగాను. వాళ్లు నన్ను ఎంతో నమ్మారు. మీ సమయం, డబ్బుకు సరైన విలువని ఇచ్చే చిత్రాన్ని తెరకెక్కించా’’ అని ఆయన అన్నారు.

‘పోటాపోటీ’ అనే కామెడీ చిత్రంతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు యువరాజ్‌ దయాలన్‌. ఇది మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఆయన వడివేలుతో ‘తెనాలి రామన్‌’ తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి వడివేలుని కథానాయకుడిగా పెట్టి ‘ఇలై’ రూపొందించాడు. 2015లో విడుదలైన ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సనియా, శ్రద్ధా శ్రీనాథ్‌, విక్రమ్‌ ప్రభు, శ్రీ ప్రధాన పాత్రధారులుగా యువరాజ్‌ ‘ఇరుగపట్రు’ తెరకెక్కించారు. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్‌ 6న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని