Oscars 2023: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’

లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ అవార్డుల (Oscars) ప్రదానోత్సవం  అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఏడాది వేడుకల్లో భారతీయ చిత్రానికి పురస్కారం లభించింది.

Updated : 13 Mar 2023 08:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 95వ అకాడమీ అవార్డుల (Oscars 2023) ప్రదానోత్సవంలో భారతీయ చిత్రం తొలి అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశం నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ (The Elephant Whisperers) ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ మేరకు  దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.. అవార్డులను అందుకున్నారు. తమ శ్రమను గుర్తించి, ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన దంపతుల కథ ఇది (The Elephant Whisperers). 42 నిమిషాల నిడివి గల చిత్రం.. కనిపించేది ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగు పిల్లలే. కానీ, దీని కోసం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. నేడు ఆస్కార్‌ వేదికపై భారత్‌ తరఫు నుంచి అవార్డును సొంతం చేసుకున్నారు దర్శకురాలు కార్తికి గోన్‌ సాల్వెస్‌ (Kartiki Gonsalves). దర్శకురాలిగా తొలి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మక అకాడమీ పురస్కరాన్ని సొంతం చేసుకున్న కార్తికి.. తన సినిమా గురించి పంచుకున్న విశేషాలివే..! 

కార్తికి.. ఓ ప్రకృతి ప్రేమికురాలు..!

కార్తికిది ఊటీ. ఆ దగ్గర్లోని నీలగిరి జీవావరణ రిజర్వ్‌లోనే పెరగడంతో వన్యజీవులపై అవగాహన, ప్రేమ ఏర్పడ్డాయి. పర్యావరణం, వన్యప్రాణులు, ప్రకృతి చిత్రాల ద్వారా జీవావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించాలనుకుంది. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఫొటోగ్రఫీ. ఫొటోగ్రాఫర్‌ కావాలనే లక్ష్యం విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో పీజీ చేసింది. ఆ తర్వాత మనసు మాట విని ప్రకృతి, దాని చుట్టూ ఉన్న జీవనంపై దృష్టిపెట్టింది. కార్తికి తండ్రి ఫొటోగ్రాఫర్‌. తల్లికి మూగజీవులంటే ఇష్టం. బామ్మ పర్యావరణ ప్రేమికురాలు. కార్తికితోపాటు చుట్టు పక్కల పిల్లల్నీ అడవులు, జంతు ప్రదర్శన శాలలు, పర్వతాల చుట్టూ తిప్పుతుండేది. ఆ ముగ్గురి అభిరుచులే తనకు వచ్చాయని కార్తికి అంటోంది.

ఆ సంఘటనే మలుపుతిప్పింది..!

అయిదేళ్ల క్రితం.. ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం కార్తికి గమనించింది. వాళ్లిద్దరి అనుబంధం ఆమెను ఆశ్చర్యపరిచింది. అతనితో మాట కలిపితే తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసిన విధానం చెప్పాడు. ఆ సంఘటనే ఆమె కెరియర్‌ను మలుపు తిప్పింది. ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ తీసేలా ప్రేరేపించింది.

450 గంటల ఫుటేజీ : కార్తికి 

‘‘నా సినిమాలోని బొమన్‌, బెల్లీ ఇద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నవాళ్లే. వాళ్ల అనుబంధమే కథగా తీశా. దాన్ని హడావుడి కథగా ముగించడం ఇష్టం లేదు. భావోద్వేగాలను చూపించాలి. కెమెరా లేదన్న భావన కలిగించినప్పుడే అది సాధ్యం. దానికోసం నేను ముందు 18 నెలలు వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. మిగతా సమయమంతా ఏనుగులు, వాళ్ల మధ్య సహజ సాన్నిహిత్యాన్ని చిత్రీకరించాం. అందుకే 450 గంటల ఫుటేజీ వచ్చింది. ఈ సమయంలోనే బొమన్‌, బెల్లీ పెళ్లి చేసుకున్నారు. అలా కట్టునాయకన్‌ తెగ సంస్కృతినీ తెలియజేసే అవకాశం వచ్చింది. మొత్తం అటవీ ప్రాంతం కదా.. కొన్ని అపాయాలూ తప్పలేదు. అయినా అవన్నీ అందమైన అనుభవాలే’’ అని కార్తికి తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని