Nagarjuna: ఆ ఆలోచనే ఉంటే అన్నీ ‘శివ’, ‘అన్నమయ్య’లే అయ్యేవి: నాగార్జున

ప్రేక్షకులెప్పుడు ఎలాంటి చిత్రాలు అంగీకరిస్తారు? ఎలాంటి పాత్రలు అంగీకరించరు? అనే విషయంలో తనకే కాదు ఎవ్వరికీ సరైన ఆలోచన ఉండకపోవచ్చని నటుడు, అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna) అన్నారు......

Updated : 09 Jul 2022 21:14 IST

హైదరాబాద్‌: ప్రేక్షకులెప్పుడు ఎలాంటి చిత్రాలు అంగీకరిస్తారు? ఎలాంటి పాత్రలు అంగీకరించరు? అనే విషయంలో తనకే కాదు ఎవ్వరికీ సరైన ఆలోచన ఉండకపోవచ్చని నటుడు, అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna) అన్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘ది ఘోస్ట్‌’ (The Ghost) ఫస్ట్‌ విజువల్‌ ట్రీట్‌ రిలీజ్‌ అనంతరం ‘ఘోస్ట్‌’ టీమ్‌తో కలిసి ఆయన మీడియాతో ముచ్చటించారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..

‘శివ’లో(SHIVA) సైకిల్ చైన్‌తో ఫైట్‌ చేశారు. ఇప్పుడు కత్తులు పట్టుకున్నారు. ఈ సినిమా మరో ‘శివ’ అనుకోవచ్చా? 

నాగార్జున: ‘శివ’తో పోల్చాలని ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ క్రియేట్‌ చేయలేదు. ఫైట్‌ సీక్వెన్స్‌ కొత్తగా, కాస్త స్టైలిష్‌గా ఉండాలనే ఉద్దేశంతో అలా చేశాం. ‘శివ’ ఒక విభిన్నమైన కథ. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.

‘ఘోస్ట్‌’(Ghost) అంటే ఏమిటి?

నాగార్జున: ఈ సినిమాలో నా పాత్ర పేరు విక్రమ్‌. ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపిస్తా. ‘ఘోస్ట్‌’ అనేది విక్రమ్‌కు కోడ్‌ నేమ్‌‌.

మీ నుంచి ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ వచ్చాయి. అలాగే ‘వైల్డ్‌డాగ్‌’, ‘ఆఫీసర్‌’ లాంటి సినిమాలూ వచ్చాయి. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు అంగీకరిస్తారు అనే విషయంలో మీకొక ఐడియా వచ్చి ఉంటుంది కదా?

నాగార్జున: నిజంగా ఇప్పటికీ తెలియదు. నాకే కాదు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు ఎలాంటి కథను ఓకే చేస్తున్నారో,  ఏ సినిమా ఎందుకు హిట్‌ అవుతుందో?
తెలియడం లేదు. ఇటీవల రాజమౌళితో ఇదే విషయంపై మాట్లాడాను. ‘‘మన మనసుకు నచ్చిన చిత్రాన్నే చేయాలి. ఏది ఏమైనా ఆ సినిమాపై ముందు మనకి నమ్మకం ఉంటే ప్రేక్షకులకూ అది నచ్చుతుంది’’ అని ఆయన చెప్పారు.

ప్రేక్షకులు మిమ్మల్ని ఎలాంటి సినిమాల్లో ఓకే చేస్తారు అనే విషయంపై మీకో ఆలోచన ఉంటుంది కదా?

నాగార్జున: నాకు ఆ ఆలోచన లేదు. ‘వైల్డ్‌డాగ్‌’ సరిగ్గా ఆడలేదని మీరు అంటున్నారు. కానీ, ఆ సినిమా బాగా ఆడిందని నేనంటాను. డెల్టా వైరస్‌ వ్యాపిస్తున్న సమయంలో మాకు వేరే గత్యంతరం లేక రిలీజ్‌ చేశాం.నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమా పది వారాలు పాటు నెం.1 స్థానంలోనే ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో జనం నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో పట్టుకోవడం తెలిస్తే ఇండస్ట్రీలో అందరూ నంబర్‌ 1 గానే ఉంటారు. వర్మ తీసిన ‘శివ’ను మెచ్చుకున్నారు.. ‘ఆఫీసర్‌’ను తిరస్కరించారు. కృష్ణవంశీ తీసిన ‘నిన్నే పెళ్లాడతా’ బాగా ఆడింది. ఆ తర్వాత మా కాంబినేషన్‌లో వచ్చిన ‘చంద్రలేఖ’ ఫ్లాప్‌ అయింది. ఇలా ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు? దేన్ని అంగీకరించరు? అనే విషయంపై నాకొక ఆలోచన ఉంటే నా కెరీర్‌లో అన్నీ ‘శివ’, ‘అన్నమయ్య’లే ఉండేవి. ‘అన్నమయ్య’ తీస్తున్నప్పుడు ఆడదని అన్నారు. కానీ, రాఘవేంద్రరావుగారు నమ్మకంతో తీశారు.

నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’ చేశారు. నాగార్జునతో ‘ఘోస్ట్‌’ చేస్తున్నారు. మరి అఖిల్‌తో ఎప్పుడు సినిమా చేస్తారు?

సునీల్‌ నారంగ్‌: అఖిల్‌ ఎప్పుడు ఓకే చెబితే అప్పుడు చేస్తాం.

‘ఘోస్ట్‌’ ఓకే చేయడానికి కారణం ఏమిటి?

నాగార్జున: ప్రవీణ్‌ చెప్పిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు కొత్తగా అనిపించాయి. అందుకే వెంటనే ఓకే అనేశా. ఇప్పుడున్న ట్రెండ్‌కి ఇది నప్పుతుందని భావిస్తున్నా.

కొవిడ్‌లోనూ వరుస షూట్స్‌ చేశారు కదా?

నాగార్జున: వర్క్‌ చేయకపోతే నాకెందుకో వెలితిగా అనిపిస్తుంటుంది. కొవిడ్‌లోనూ వరుస షూట్స్‌లో పాల్గొని.. ఎంతోమందికి ఉపాధి కల్పించినందుకు, వారి మన్ననలు పొందినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నా. కొవిడ్‌ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది. భాషతో సంబంధం లేకుండా అందరూ అన్ని రకాల సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు.

ఈ సినిమా టికెట్‌ ధరలు ఎలా ఉంటాయి?

సునీల్‌ నారంగ్‌: సాధారణ టికెట్‌ ధరలే ఉంటాయి. ధరలు పెంచాలనుకోవడం లేదు.

యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎక్కువగా ఉంటాయా? పార్ట్‌-2 ప్లాన్‌ ఉందా?

ప్రవీణ్‌ సత్తారు: ఇందులో మొత్తం 12 యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయి. అందులో ఎనిమిది భారీగా ఉంటాయి. ఇక, పార్ట్‌-2పై ఎలాంటి ఆలోచన లేదు. సినిమా విడుదలయ్యాక వచ్చే స్పందన ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో ఆలోచిస్తా.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని