The Ghost: ‘ది ఘోస్ట్‌’.. మనసుల్ని గెలుచుకుంటుంది

‘‘యాక్షన్‌.. ఎమోషన్‌ రెండూ సమపాళ్లలో ఉన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ఇది బాగుందని ప్రేక్షకులు చెబితే తప్పకుండా కొనసాగింపు చిత్రాల్ని తీస్తాం’’ అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా...

Updated : 01 Oct 2022 14:06 IST

‘‘యాక్షన్‌.. ఎమోషన్‌ రెండూ సమపాళ్లలో ఉన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’ (The Ghost). ఇది బాగుందని ప్రేక్షకులు చెబితే తప్పకుండా కొనసాగింపు చిత్రాల్ని తీస్తాం’’ అన్నారు నాగార్జున (Nagarjuna). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 5నప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ఓ సెంటిమెంట్‌తో ప్రారంభమైంది. నాతో సినిమా తీయాలనేది దివంగత నిర్మాత నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ కోరిక. అలా ఆయన తనయుడు సునీల్‌ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. నాలాగే ఈ సినిమాకి పనిచేసిన వారంతా చాలా యంగ్‌ (నవ్వుతూ). కసి, ప్రేమతో ఈ చిత్రాన్ని తీశాం. ఇందులో చాలా బలమైన కథ ఉంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కూ చాలా ప్రాధాన్యముంది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే కంటెంట్‌తో పాటు సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి. ఈ రెండింటితో ఈ చిత్రాన్ని నింపేశారు దర్శకుడు ప్రవీణ్‌. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. ఇటీవల ప్రీరిలీజ్‌ వేడుకలో మాకు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవికి థ్యాంక్స్‌. ఆయన చెప్పినట్లు అన్ని సినిమాలు మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నాగార్జున ఓ యాక్షన్‌ విజువల్‌ ఫీస్ట్‌ను ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. విజయదశమి రోజున మా ‘ఘోస్ట్‌’ వస్తోంది. మీ అందరి మనసుల్ని గెలుచుకుంటుంది’’ అన్నారు చిత్ర దర్శకుడు ప్రవీణ్‌. నటి సోనాల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంతో నాగార్జునతో కలిసి తొలిసారి యాక్షన్‌ చేసే అవకాశమొచ్చింది’’ అంది. ఈ కార్యక్రమంలో జాన్వీ, సునీల్‌ నారంగ్‌, అదిత్‌ మరార్‌, విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ ప్రచారం వినిపిస్తోంది!
తాను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు నాగార్జున. ఆయన త్వరలో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ‘ది ఘోస్ట్‌’ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ‘‘గత పదేళ్లుగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నేను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని ప్రచారం జరుగుతోంది. అదెప్పుడూ నిజం కాలేదు. ఇప్పుడీ ప్రచారంలోనూ నిజం లేదు. నేను ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయట్లేదు. మంచి కథ దొరికితే మాత్రం రాజకీయ నాయకుడిగా నటిస్తా’’ అన్నారు నాగ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని