The Gray Man review: రివ్యూ: ది గ్రే మ్యాన్‌

ధనుష్‌ కీలక పాత్రలో నటించిన ‘ది గ్రే మ్యాన్‌ ఎలా ఉందంటే?

Published : 23 Jul 2022 10:01 IST

చిత్రం: ది గ్రే మ్యాన్‌; నటీనటులు: రేయాన్‌ గాస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అన్నాడీ అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌, ధనుష్‌ తదితరులు; సంగీతం: హెన్రీ జాక్‌మెన్‌; సినిమాటోగ్రఫీ: స్టీఫెన్‌ ఎఫ్‌.విన్‌డన్‌; ఎడిటింగ్‌: జెఫ్‌ గ్రోత్‌, పైట్రోస్కాలియా; రచన, దర్శకత్వం: ఆంటోనీ రస్సో, జో రస్సో; విడుదల: నెట్‌ఫ్లిక్స్‌

హాలీవుడ్‌ చిత్రాలు భారతీయ ప్రేక్షకులను పలకరించడం కొత్తేమీ కాదు. అయితే, భారతీయ నటులు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించడం అరుదు. అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన రస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రే మ్యాన్‌’. మార్క్‌ గ్రీని రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ధనుష్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ధనుష్‌ ఎలాంటి పాత్ర పోషించారు?

కథేంటంటే: చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు, కష్టాలు, ఆఖరికి జైలు జీవితాన్ని అనుభవించిన సిక్స్‌ (రేయాన్‌ గాస్లింగ్‌)ను సియారా ప్రోగ్రామ్‌లోకి సీఐఏ ఏజెంట్‌గా తీసుకుంటారు. ఈ క్రమంలో సిక్స్‌ ఒక పెన్‌డ్రైవ్‌ కనుగొంటాడు. అందులో చీకటి రహస్యాలు, సీఐఏకు సంబంధించి కీలక విషయాలు ఉంటాయి. ఆ రహస్యాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని లాయిడ్‌ హన్సన్‌ (క్రిస్‌ ఇవాన్స్‌) ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సిక్స్‌ను అంతం చేసి, పెన్‌డ్రైవ్‌ పొందేందుకు నర రూప రాక్షసుల్లాంటి కొంతమంది కిరాయి హంతకులను పంపుతాడు. ఇంతకీ ఆ పెన్‌డ్రైవ్‌తో లాయిడ్‌కు ఉన్న సంబంధం ఏంటి? లాయిడ్‌, అతడు పంపిన కిరాయి హంతకుల నుంచి సిక్స్‌ ఎలా తప్పించుకున్నాడు? అవిక్‌సాన్‌ (ధనుష్‌) పాత్ర ఏంటి? తెలియాలంటే ‘ది గ్రే మ్యాన్‌’ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: రస్సో బ్రదర్స్‌ అనగానే మనకు గుర్తొచ్చే చిత్రాలు అవెంజర్స్‌ సిరీస్‌. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌, మంత్రముగ్ధులను చేసే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చిత్రాలను తెరకెక్కించిన వారు.. ఆ జానర్‌ నుంచి పూర్తిగా బయటకు వచ్చి తెరకెక్కించిన చిత్రమే ఇది. అయితే, అలాంటి దర్శకులు ఒక రొటీన్‌ కథకు యాక్షన్‌ అనే మసాలా జోడించి ‘ది గ్రే మ్యాన్‌’ తీసుకొచ్చారు. ఈ పాయింట్‌ను జేమ్స్‌ బాండ్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌ చిత్రాల్లో చూశాం. ఆయా చిత్రాల్లో యాక్షన్‌కు ఎమోషన్‌, కథ జోడించి ఉంటాయి. అదే ‘ది గ్రే మ్యాన్‌’ను కేవలం యాక్షన్‌కు మాత్రమే పరిమితం చేశారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిన ‘అండర్‌ గ్రౌండ్‌’, ‘రెడ్‌ నోటీస్‌’లాంటి చిత్రాలను చూసిన అనుభూతే కలుగుతుంది తప్ప, సరికొత్త చిత్రాన్ని చూస్తున్నామన్న ఫీలింగ్‌ రాదు. కథ, కథనాల కన్నా కూడా యాక్షన్‌ సన్నివేశాలపైనే దృష్టిపెట్టారు దర్శకులు. పెన్‌డ్రైవ్‌ కోసం లాయిడ్‌ ప్రయత్నాలు చేయటం, వాటిని సిక్స్‌ తిప్పికొట్టడం చివరి వరకూ ఇదే కొనసాగుతంది. హీరో-విలన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా గ్రిప్పింగ్‌గా లేవు. అవిక్‌ సాన్‌గా ధనుష్‌ యాక్షన్‌ మాత్రం అలరిస్తుంది. కథ పాతదే అయినా దానికి వింటేజ్‌ లుక్ తీసుకురావాలన్న ఉద్దేశంతో 80వ దశకంలో జరిగినట్లు చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు. అవేవీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఈ వీకెండ్‌లో కాలక్షేపం కోసం ఏదైనా యాక్షన్‌ మూవీ చూడాలనుకునేవారికి ‘ది గ్రే మ్యాన్‌’ ఒక ఛాయిస్‌.

ఎవరెలా చేశారంటే: ఏజెంట్‌ సిక్స్‌ పాత్రలో రేయాన్‌ గాస్లింగ్‌ చక్కగా నటించారు. యాక్షన్‌ సన్నివేశాల్లో ది బెస్ట్‌ ఇచ్చారు. ప్రతినాయకుడు లాయిడ్‌ హాన్సన్‌గా కెప్టెన్‌ అమెరికా పాత్రధారి క్రిస్‌ ఇవాన్స్‌ నటన ఓకే. పెద్దగా మెరుపులు ఏమీ లేవు. అనా డి అర్మాస్‌, జెస్సికా హన్‌విక్‌ తమ పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమాలో ధనుష్‌ పాత్ర గురించి మాట్లాడుకుంటే.. విలన్‌ పంపే కిరాయి హంతకుల్లో ఒకరిగా నటించారు. ఆయన ఉన్నంతసేపూ యాక్షన్‌ సీన్స్‌ వైల్డ్‌గా, మరింత బాగుంటాయి. బహుశా మనకు తెలిసిన నటుడు కావడంతో ఆ సన్నివేశాల ప్రభావం మనపై ఉండొచ్చు. సాంకేతికంగా సినిమా బాగుంది. హెన్రీ జాక్‌మెన్‌ నేపథ్య సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. స్టీఫెన్‌  సినిమాటోగ్రఫీ, జెఫ్రీగ్రోత్‌, పైట్రోస్కాలియా ఎడిటింగ్‌ బాగుంది. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’లాంటి భారీ చిత్రాన్ని తీసిన రస్సో బ్రదర్స్‌ ‘ది గ్రే మ్యాన్‌’ను మాత్రం సాధారణ యాక్షన్‌ ఫిల్మ్‌గా తీర్చిదిద్దారంతే. యాక్షన్‌కు బలమైన భావోద్వేగాలు జోడించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

బలాలు

+ యాక్షన్‌ సన్నివేశాలు

+ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

+ కథనం

బలహీనతలు

- రొటీన్‌ కథ

- బలమైన భావోద్వేగాలు లేకపోవటం

చివరిగా: కేవలం యాక్షన్‌ సీన్స్‌ కోసం ‘ది గ్రే మ్యాన్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts