The Great Indian Kitchen Review: రివ్యూ: ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌

The Great Indian Kitchen Review: ఐశ్వర్యరాజేశ్‌, రాహుల్‌ రవీంద్రన్‌ జంటగా నటించిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ ’ ఎలా ఉందంటే?

Updated : 03 Mar 2023 18:09 IST

The Great Indian Kitchen Review: చిత్రం: ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌; నటీనటులు: ఐశ్వర్య రాజేశ్‌, రాహుల్‌ రవీంద్రన్‌, నందకుమార్‌, యోగిబాబు తదితరులు; సంగీతం: జెర్రీ సిల్వస్టర్‌ విన్సెంట్‌; సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియన్‌; ఎడిటింగ్‌: లియో జాన్‌ పాల్‌; నిర్మాత: దుర్గారామ్‌ చౌదరి, నీల్‌ చౌదరి; దర్శకత్వం: ఆర్‌.కణ్ణన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: జీ5

అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్‌ తీసుకుని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్‌లోనూ తీర్చిదిద్దారు. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ఉందా?

కథేంటంటే: ఐశ్వర్యరాజేశ్‌ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్‌ రవీంద్రన్‌కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంతో ఐశ్వర్య రాజేశ్‌ అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ, తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్దిరోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు.. ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడళ్లు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాజేశ్‌ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకిరీ మొత్తం ఐశ్వర్యరాజేశ్‌పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? భర్త, మావయ్య చెప్పినట్లు నడుచుకుందా? ఇంటి పనులతో విసిగి పోయిన ఐశ్వర్య రాజేశ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని  వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతి వృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘ది గ్రేట్‌ ఇండియా కిచెన్’. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించి విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కి తమిళ్‌లో రీమేక్‌ చేశారు. కానీ, మలయాళ ప్రేక్షకులను మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు సరి కదా.. టీవీ సీరియల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీసి వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్‌ బాగున్నా..  నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్యరాజేశ్‌- రాహుల్‌ రవీంద్రన్‌ల వివాహంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి  కాదు.. కాదు.. వంటింట్లోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెలియింగ్‌గా చెప్పడంలో తప్పు లేదు కానీ, చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లు ఉంటుంది. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’లో జరిగింది ఇదే.

వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావాల్సినవి చేస్తూ కనీసం టిఫిన్‌ కూడా చేయలేని మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా.. వేసిన దోసెలే వేస్తూ, చేసిన చెట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ.. ‘మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది’ అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్‌.  ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తినింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి, దర్శకుడు కేవలం ఒక దృష్టి కోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే, దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుకునే సీన్, సంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళలు పీరియడ్స్‌ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకట్రెండు సన్నివేశాలతో నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే, చాలా కుటుంబాల్లో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి, చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. పతాక సన్నివేశాల్లో ఐశ్వర్యా రాజేశ్‌ స్పెషల్‌ సాంగ్‌ ఎందుకో దర్శకుడికే అర్థంకావాలి.

ఎవరెలా చేశారంటే: భార్యభర్తలుగా ఐశ్వర్య, రాహుల్‌ రవీంద్రన్‌ తమ పాత్రలో ఒదిగిపోయారు. భార్య అంటే కేవలం ఇంటి పనులు, వంట పనులు, శారీరక సౌఖ్యాలు అందించే వస్తువుగా చూసే వ్యక్తిగా రాహుల్‌ నటన బాగుంది. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా ఐశ్వర్య చక్కగా నటించింది. ఇంట్లో వాళ్లను కాదనలేక సర్దుకుపోయే సగటు మహిళ పాత్రలో ఆమె హావభావాలు బాగున్నాయి. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. సినిమాటోగ్రఫ్రీ, సంగీతంలో పెద్దగా మెరుపులేవీ లేవు. ఈ సినిమా నిడివి గంటన్నర మాత్రమే. అదొక్కటే కాస్త ఉపశమనం. మాతృకను తీసుకుని నేటి యువతకు సరిపోయేలా సినిమాను తీర్చిదిద్దే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆర్‌.కణ్ణన్‌ ఆ పనిమాత్రం చేయలేదు. మలయాళంలో ఉన్నది ఉన్నట్లు తీశారు.

బలాలు: + దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ + నిడివి

బలహీనతలు: - సన్నివేశాల సాగదీత, - బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం, - దర్శకత్వం

చివరిగా: ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’.. దర్శకుడు ఎక్కువ తోమేశాడు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని