The Kerala Story: మేం క్షేమంగానే ఉన్నాం.. ప్రమాదంపై స్పందించిన అదాశర్మ

ది కేరళ స్టోరీ చిత్ర బృందానికి రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్తలపై నటి అదా శర్మ స్పందించారు. స్వల్ప గాయాలే అయ్యాయని.. అంతా క్షేమంగానే ఉన్నట్టు ట్వీట్‌ చేశారు.

Published : 14 May 2023 21:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ది కేరళ స్టోరీ’ (the kerala story) చిత్ర బృందం ముంబయిలో రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్తలపై హీరోయిన్‌ అదాశర్మ (adah sharma) స్పందించారు. తామంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. స్వల్ప గాయాలే అయినట్టు పేర్కొన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. దీన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పకుండా చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ కొన్ని గంటల ముందు ట్వీట్‌ చేయడం గమనార్హం. ఆ కారణంగా కరీంనగర్‌లో నిర్వహించిన ‘హిందూ ఏక్తా యాత్ర’కు రాలేకపోతున్నానని ఆయన తెలిపారు.

 ‘‘ఈ రోజు మేం (ది కేరళ స్టోరీ టీమ్‌) కరీంనగర్‌ రావాల్సి ఉంది. మా సినిమా గురించి చర్చించాల్సి ఉంది. కానీ, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో రాలేకపోతున్నా. కరీంనగర్‌ ప్రజలకు క్షమాణలు తెలియజేస్తున్నా. యువతులను రక్షించేందుకే మేం ఈ సినిమా తెరకెక్కించాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్‌ చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు. 

భాజపా ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’ను ఆదివారం నిర్వహించిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడేందుకే ఆ యాత్ర చేపడుతున్నట్టు భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మ, తరుణ్‌ ఛుగ్, భాజపా ముఖ్య నేతలతోపాటు ‘ది కేరళ స్టోరీ’ టీమ్‌కి ఆహ్వానం అందింది. సినిమా విషయానికొస్తే.. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో తెరకెక్కిన ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదమైంది. ఈ సినిమాలో చూపించేది నిజం కాదని కొందరు ఆరోపించారు. అలా.. మే 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ.112 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో అదాశర్మ, సిద్ధి ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు