The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’.. అసలేమిటీ వివాదం..?

తప్పిపోయిన అమ్మాయిల ఇతివృత్తంతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాపై వివాదం కొనసాగుతోంది. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకే ఈ సినిమా రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 01 May 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాపై వివాదం మొదలైంది. మే 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై కేరళలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కూడా ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి రాజకీయాలు కేరళలో పనిచేయవని స్పష్టంచేశారు. ఈ తరుణంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నెలకొన్న వివాదాన్ని ఓసారి పరిశీలిస్తే..

ఇదీ నేపథ్యం..

దర్శకుడు సుదీప్తోసేన్‌ ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. అయితే, తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. ఈ చిత్రానికి నిర్మాతగా విపుల్‌ అమృత్‌లాల్‌ షా వ్యవహరించారు. గతంలో ‘అస్మా’, ‘లఖ్‌నవూ టైమ్స్‌’, ‘ది లాస్ట్‌ మాంక్‌’ వంటి చిత్రాలు నిర్మించారు. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి ఆగ్రహం..

‘రాష్ట్రంలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు హిందీ సినిమా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘లవ్‌ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినా.. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాయని.. వారి రాజకీయాలు ఇక్కడ సాగవని స్పష్టం చేశారు.

నిషేధం విధించాల్సిందే..

‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలను అధికార పార్టీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్సు కాదంటూ మండిపడ్డాయి. రాష్ట్రంలో విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్‌, డీవైఎఫ్‌ఐ, ఐయూఎంఎల్‌ వంటి యువజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కేరళను అవమానించే రీతిలో ఈ చిత్రం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీడీ సతీశన్‌ పేర్కొన్నారు. మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఓ వర్గం యత్నిస్తోందని ఐయూఎంఎల్ జాతీయ కార్యదర్శి పీకే ఫిరోజ్‌ స్పష్టం చేశారు. ఇలా ఈ చిత్ర విడుదలను ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే..  క్రిస్టియన్‌ అసోసియేషన్‌ (CASA) వంటి సంఘాలు మాత్రం చిత్రం విడుదలకు మద్దతు తెలుపుతున్నాయి. ‘లవ్‌ జిహాద్‌’కు ఛిద్రమైన ఎన్నో కేరళ కుటుంబాల కథను ఇది ఆవిష్కరిస్తుందని సీఏఎస్‌ఏ పేర్కొంది.

చిత్రం కోసం ఏడేళ్లు.. 

తాజాగా వివాదం చెలరేగడంపై చిత్ర దర్శకుడు సుదీప్తోసేన్‌ స్పందించారు. ‘ప్రియమైన కేరళ వాసులారా.. అక్షరాస్యతలో మీరు అగ్రస్థానంలో ఉన్నారు. విద్య మనకు సహనాన్ని నేర్పింది. ఇప్పుడే ఒక అభిప్రాయానికి ఎందుకు వస్తారు..? ముందుగా సినిమా చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు చర్చిద్దాం. ఈ చిత్రం కోసం ఏడేళ్లు కేరళలో పనిచేశాం. మీలో మేము ఓ భాగం. మనమందరం భారతీయులమే’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఏప్రిల్‌ 26న విడుదలైంది. అనంతరం దీనిపై వివాదం మొదలయ్యింది. చివరకు ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు అనుమతి రావడంతో మే 5న విడుదలకు సిద్ధమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని