Tollywood: బన్నీ-బాలయ్య రూ.100కోట్లు.. చైతూ-అఖిల్‌ రూ.50కోట్లు

telugu movies: 2021లో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి రూ.100కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలివే!

Published : 23 Dec 2021 10:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా అంటే కేవలం వినోదాన్ని పంచడమే కాదు, ఎంతో మందికి ఉపాధి, అవకాశాలు కల్పిస్తోంది. ఒక సినిమాకు పెట్టిన పెట్టుబడి వస్తే ఆ సినిమా హిట్టయినట్టే. లాభాల్లో దూసుకుపోతే బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టినట్లే. అప్పుడే ఆ నిర్మాత మరిన్ని సినిమాలు తీయగలడు. కరోనా గడ్డు పరిస్థితులను దాటుకుని కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్‌ వర్షం కురిపించాయి. ఆ చిత్రాలివే!

ఈ నాలుగు సెంచరీలు కొట్టాయి..

‘పుష్ప’ అంటే ఫ్లవరు అనుకుంటివా.. కలెక్షన్ల ఫైరు..

ఏడాది తెలుగు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. అల్లు అర్జున్‌ కథానాయకుడగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాన్‌ ఇండియాలో స్థాయిలో ‘పుష్ప’ విడుదలవటం కూడా కలిసొచ్చింది. ఇప్పటికే రూ.150*కోట్ల(గ్రాస్‌)వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ ‘పుష్ప’ కాసుల వేట కొనసాగనుంది. అల్లు అర్జున్‌ నటన, రష్మిక అందాలు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.


పవన్‌ స్టామినా ఏంటో చెప్పిన చిత్రం

రాజకీయాలతో కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు పవన్‌కల్యాణ్‌. అయితే, ‘వకీల్‌సాబ్’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. పవన్‌ సినిమా స్టామినో ఏంటో చూపించారు. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా పవన్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా వేణు శ్రీరామ్‌ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా కరోనా పరిస్థితులు ఉన్నా.. రూ.130 కోట్ల(గ్రాస్‌)కు పైగా వసూలు చేసింది. ‘పవన్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ అదరగొట్టింది.


బాక్సాఫీస్‌ వద్ద ‘అఖండ’ గర్జన

రైన దర్శకుడు, కథ పడితే అగ్ర కథానాయకుడు బాలకృష్ణను ఆపటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. సింహా, లెజెండ్‌ చిత్రాలతో ప్రేక్షకుల నాడిని పట్టేశారు ఆయన. ముచ్చటగా మూడోసారి ‘అఖండ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కాంబినేషన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదండోయ్‌ బాలకృష్ణ కెరీర్‌లో రూ.115*కోట్లు(గ్రాస్‌) వసూలు చేసిన చిత్రంగా ‘అఖండ’నిలిచింది. అఘోరగా బాలకృష్ణ నటన, డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ థియేటర్‌లలో ‘అఖండ’ ప్రభంజనం కొనసాగుతోంది.


ప్రేమ ‘ఉప్పెన’.. ప్రేక్షకులను మెప్పించింది

థానాయకుడిగా వెండితెరకు చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ పరిచయం.. సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం.. యూట్యూబ్‌లో అదరగొట్టిన దేవిశ్రీ పాటలు.. ఇంకేముందు థియేటర్‌లో రెడీ అనుకుంటున్న సమయంలో కరోనా ఫస్ట్‌వేవ్‌తో సినిమా విడుదల ఆగిపోయింది. ఓటీటీ కోసం భారీ ఆఫర్లు వచ్చినా వద్దనుకున్నారు. దాదాపు ఏడాది పాటు వేచి చూశారు.  కథను నమ్మి థియేటర్‌లో విడుదల చేశారు. అదే ‘ఉప్పెన’. ప్రేక్షకులను ప్రేమ సముద్రంపై విహరింపజేయడమే కాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆశి, బేబమ్మలుగా వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టిలు మెస్మరైజ్‌ చేశారు. కొత్తవారితో తీసిన ‘ఉప్పెన’ రూ.100కోట్ల (గ్రాస్‌) సాధించిన సినిమా రికార్డు సృష్టించింది.


నవ్వుల ‘జాతిరత్నాలు’

సినిమా అంటేనే వినోదం.. అలాంటి వినోదానికే వినోదాన్ని పంచిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించటంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సుమారు రూ.5కోట్లతో సినిమాను తెరకెక్కిస్తే ఏకంగా రూ.70కోట్లు(గ్రాస్‌) వసూలు చేసింది. ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చిన ముగ్గురు యువకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కథాంశంతో ఆద్యంతం నవ్వులు పంచేలా ‘జాతిరత్నాలు’ను తీర్చిదిద్దారు.


రవితేజ మార్కు యాక్షన్‌ ‘క్రాక్‌’

రోనాతో కుదేలైన చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది ఆరంభంలో ఊపిరులూదిన చిత్రం ‘క్రాక్‌’. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ మాస్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.. రవితేజ, శ్రుతిహాసన్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని వారి పాత్రల్లో జీవించారు. తమన్‌ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ ఏడాది రూ.50కోట్ల వసూళ్ల మార్కును దాటిన తొలి చిత్రంగా నిలిచింది. మొత్తంగా రూ.60.6(గ్రాస్‌) వసూళ్లతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపింది.


అన్నదమ్ములిద్దరూ అదరగొట్టారు!

2021 అక్కినేని కుటుంబానికి కలిసొచ్చింది. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ ముగ్గురు హీరోలూ ప్రేక్షకులను పలకరించారు. నాగార్జున ‘వైల్డ్‌డాగ్‌’తో చైతన్య ‘లవ్‌స్టోరీ’తో, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదండోయ్‌ రూ.58కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఎక్కడ చూసినా ‘సారంగదరియా’ పాట మార్మోగింది. ఇక ఎంతోకాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న అఖిల్‌కు ఈ ఏడాది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అఖిల్‌ కెరీర్‌లో రూ.50కోట్లు (గ్రాస్‌) సాధించిన చిత్రంగా నిలిచింది. 2022 తెలుగు చిత్ర పరిశ్రమ వసూళ్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది అత్యధికంగా భారీ బడ్జెట్‌, మల్టీస్టారర్‌, పాన్‌ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని