Tollywood: ఆగస్టులో ఆరంభించేనా?

అగ్ర తారల సినిమాలు కొన్ని వెనక్కు జరిగితే... కొన్ని ముందుకు వస్తూ విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. మరికొన్ని ఎప్పుడు విడుదలవుతాయో ఇప్పటికీ స్పష్టత లేదు

Updated : 21 Jun 2024 09:55 IST

అగ్ర తారల సినిమాలు కొన్ని వెనక్కు జరిగితే... కొన్ని ముందుకు వస్తూ విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. మరికొన్ని ఎప్పుడు విడుదలవుతాయో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ ఏడాదిలో రావల్సిన సినిమాలు ఎన్ని వస్తాయో, వచ్చే ఏడాదికి ఎన్ని వాయిదాని ప్రకటిస్తాయో తెలియదు. టాలీవుడ్‌లో విడుదలల వ్యవహారం ఎప్పుడూ ఇంతే. అయితే ఈ మధ్య  కొత్త చిత్రాల చిత్రీకరణ ప్రారంభంలోనూ ఇదే రకమైన గందరగోళమే. ఆగస్టులో పట్టాలెక్కాల్సిన తెలుగు సినిమాల జాబితా చాలా పెద్దదే. మరి వాటిలో ప్రారంభమయ్యేది ఎన్నో?

చిత్రీకరణలో జాప్యం... నిర్మాణానంతర పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, పోటీగా వస్తున్న చిత్రాలు, భారీ ప్రారంభ వసూళ్లు రాబట్టేందుకు తగిన తేదీ కోసం చూడటం... ఇలా ఓ సినిమా విడుదల వాయిదా వెనక ఎన్నెన్నో కారణాలు కనిపిస్తాయి. నెలలు కాదు, ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వచ్చిన సినిమాల్ని చాలానే చూశాం. విడుదలల్లోనే కాదు.. సినిమాల్ని ప్రారంభించడంలోనూ అన్నేసి సమస్యలు ఉంటాయనేది పరిశ్రమ వర్గాలు చెప్పే మాట. పాత్రలకి తగ్గ నటుల కోసం అన్వేషణ... ఆ నటుల కాల్షీట్లు సినిమాకి తగ్గట్టుగా కుదరడం, లొకేషన్లు, హీరోల ఇతరప్రాజెక్టులు... ఇలా బోలెడన్ని వ్యవహారాలు ఉంటాయి. దాంతో విడుదలల్లాగే సినిమాల ప్రారంభాలూ తరచూ వాయిదా పడుతుంటాయి. ఇప్పటికైతే ఆగస్టులో ఆరంభమే అనే సంకేతాలు ఇస్తున్న తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. వెంకటేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని ప్రాజెక్టులు ఆ దిశగానే పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్నాయి. 

పనులు చకచకా... 

వెంకటేశ్‌ కథానాయకుడిగా... అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. దర్శకుడు స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నారు. నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని ఆగస్టు నుంచే పట్టాలెక్కించాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కథానాయిక ఎంపిక పూర్తయింది. మరో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. నాని కథానాయకుడిగా... శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా చిత్రీకరణ కూడా ఆగస్టులోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ కలయికలో ఇదివరకు ‘దసరా’ రూపొందిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. దాన్ని వచ్చే నెలలోపు పూర్తి చేసి, కొత్త సినిమా కోసం రంగంలోకి దిగాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లతోపాటు పలువురు యువ కథానాయకులు కొత్త సినిమాల్ని ఆరంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ వాటికి సమయమే కలిసి రావడం లేదు. 

రామ్‌చరణ్‌ రెడీ.. మరి ఎన్టీఆర్‌?

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో పట్టాలెక్కనుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఎప్పుడో స్క్రిప్ట్‌ని పూర్తి చేశారు. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ వల్ల సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల్ని దాదాపు పూర్తి చేశారు చరణ్‌. ఇక కొత్త సినిమా కోసం రంగంలోకి దిగడమే ఆలస్యం అంటున్నారాయన. ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలోనూ ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘దేవర’ చిత్రీకరణలో ఉన్నారు ఎన్టీఆర్‌. అది పూర్తి చేసి, ప్రశాంత్‌ నీల్‌ చిత్రం కోసమే రంగంలోకి దిగాలనేది ఆయన ప్రణాళిక. అయితే ఈ సినిమా సంగతులేవీ బయటికి రావడం లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌ 2’ చిత్రాన్నీ పూర్తి చేయాల్సి ఉంది. మరి ‘సలార్‌ 2’ ఎప్పుడు? ఎన్టీఆర్‌ సినిమా ఎప్పుడనేది తేలాల్సి ఉంది. రెండూ ఏకకాలంలో చేసే పరిస్థితులైతే ఉండవు. మరోవైపు ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు