The Night Manager: రివ్యూ: ది నైట్‌ మేనేజర్‌ (వెబ్‌సిరీస్‌)

అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Published : 17 Feb 2023 17:44 IST

The Night Manager Review వెబ్‌సిరీస్‌: ది నైట్‌ మేనేజర్‌; నటులు: అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, శోభిత ధూళిపాళ, తిలోత్తమ షోమ్‌, అరిస్టా మెహతా, సస్వతా ఛటర్జీ, రేష్‌ లంబా తదితరులు; సంగీతం: సామ్‌ సి. ఎస్‌; సినిమాటోగ్రఫీ: బెంజమిన్‌ జాస్పర్‌; నిర్మాణ సంస్థలు: ది ఇంక్‌ ఫ్యాక్టరీ, బనిజయ్‌ ఏసియా; దర్శకత్వం: సందీప్‌ మోదీ; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

విదేశీ చిత్రాలనే కాదు టీవీ సిరీస్‌లను పలువురు దర్శక,నిర్మాతలు రీమేక్‌ చేస్తున్నారు. నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి, భారతీయ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా.. 2016లో వచ్చిన ఆంగ్ల సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ (The Night Manager)ను అదే పేరుతో ఓటీటీ సంస్థ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో రీమేక్‌ చేసి, శుక్రవారం విడుదల చేసింది. నైట్‌ మేనేజర్‌గా ఎవరు కనిపించారు? ఆయన ఏం చేశారు? చూద్దామా (The Night Manager Review)..

ఇదీ కథ: షాన్‌ సేన్‌గుప్త (ఆదిత్యరాయ్‌ కపూర్‌) (Aditya Roy Kapur) బంగ్లాదేశ్‌లోని ఓ రాయల్‌ హోటల్‌లో నైట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆపదలో ఉన్నవారికి చేయూతనందిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన సఫీనా (అరిస్టా మెహతా) తనను ఇండియాకు పంపించమని అతణ్ని ప్రాధేయపడుతుంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో అల్లర్లు చెలరేగడంతో స్వదేశానికి పంపించడం వీలుపడదని షాన్‌ ఆమెకు చెబుతాడు. అయినా ఆమె వినిపించుకోదు. 14 ఏళ్ల తనకు పెళ్లి చేశారని, తన భర్త రెహమాన్‌ (రేష్‌ లంబా) బిజినెస్‌మ్యాన్‌ ముసుగులో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్‌ అని తెలియజేసే వీడియోను షాన్‌కు పంపిస్తుంది. అదే వీడియో దిల్లీ కేంద్రంగా ఉన్న రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఏజెంట్‌ చేతికి వెళ్తుంది. తమ రహస్యాలను బయటపెట్టిందనే కారణంతో సఫీనాను హత్య చేస్తారు. వ్యాపారం పేరుతో ఆయుధాలు సరఫరా చేయాలని రెహమాన్‌తో డీల్‌ కుదుర్చుకున్న శైలేంద్ర రుంగ్తా (అనిల్‌ కపూర్‌) (Anil Kapoor)నే ఆ మర్డర్‌ చేయించాడనే షాన్‌ అనుమానం నిజమైందా? పైకి గొప్ప వ్యాపారవేత్తగా కనిపించే శైలేంద్ర చీకటి వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు? ఒకప్పుడు నేవీ అధికారి అయిన షాన్‌.. మేనేజర్‌గా ఎందుకు మారాడు? అన్నది తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే. (The Night Manager Review).

ఎలా సాగిందంటే: తనను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలిస్తుంటే మార్గమధ్యంలో తప్పించుకుని హీరో పారిపోయే సన్నివేశంతో సిరీస్‌ ఆసక్తిగా ప్రారంభమవుతుంది. కట్‌చేస్తే, హీరో బంగ్లాదేశ్‌లోని హోటల్‌లో కనిపిస్తాడు. మధ్యలో ఏం జరిగిందో, తన ఫ్లాష్‌బ్యాక్‌ ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకత కొనసాగుతూనే ఉంటుంది. మేనేజర్‌గా షాన్‌ స్టైలిష్‌ లుక్‌, అందరితో కలివిడిగా ఉండడం, సఫీనాకు సాయం చేసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమించడం.. ఇలా ప్రతిదీ ఆకట్టుకుంటుంది. అయితే, తొలుత వేగంగా సాగిన సిరీస్‌ తర్వాతర్వాత స్లో అవుతుంది. విలన్ల భరతం పట్టేందుకు వారి కుటుంబ సభ్యులను హీరో పావులా వాడుకుని, వారితోనే స్నేహం చేసినట్టు నటించి, గుట్టురట్టు చేసే సన్నివేశాలు ఎన్నో సినిమాల్లో కనిపిస్తాయి. ఈ సిరీస్‌లో షాన్‌, శైలేంద్రల మధ్య అదే తరహా కంటెంట్‌ నడుస్తుంది. సఫీనా ఇచ్చిన వీడియోలో కనిపించిన శైలేంద్రపై అనుమానం వ్యక్తం చేసిన షాన్‌.. అతడి మోసాల గురించి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో శైలేంద్ర ఫ్యామిలీకి దగ్గరవ్వడం, ఇంట్లో ఎవరూ లేనప్పుడు సీక్రెట్‌ లాకర్‌ తెరిచి సమాచారం సేకరించాలనుకోవడం, ఆ క్రమంలో విలన్‌ భార్య పైకి కనిపించేంత ఆనందంగా లోపల లేదని తెలుసుకుని ఆమెతో అసలు విషయం చెప్పడం.. తదితర సీన్స్‌ రొటీన్‌గా అనిపిస్తాయి.

శైలేంద్ర కుటుంబ సభ్యులకు దగ్గరయ్యేందుకు షాన్‌ వేసిన ప్లాన్‌ను రివీల్‌ చేసే సీన్‌లో స్పష్టత లోపించింది. తన కోసమే షాన్‌ వచ్చాడని తెలుసుకున్న శైలేంద్ర ఇచ్చే వార్నింగ్‌ కూడా సాదాగా ఉంటుంది. విలనిజం పెద్దగా ప్రభావం చూపించలేదు. షాన్‌కు సాయం చేసే ‘రా’ ఏజెంట్‌ లిపిక పాత్ర మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తన లక్ష్యం నెరవేరదేమోనని హీరో అనుకున్న ప్రతిసారి ఆమె ఫోన్‌ చేసి ముందడుగేసేలా చేస్తుంది. ఈ కథంతా నాలుగు ఎపిసోడ్లలో సాగగా మరో సీజన్‌ ఉన్నట్టు ఆఖరి ఎపిసోడ్‌లో చెప్పారు. ఈ సీజన్‌లో ప్రేక్షకులకు తలెత్తే పలు సందేహాలకు సీజన్‌ 2లో సమాధానమిస్తారేమో చూడాలి (The Night Manager Review).

ఎవరెలా చేశారంటే: మేనేజర్‌ షాన్‌ సేన్‌గుప్తగా ఆదిత్యరాయ్‌ కపూర్‌ ఒదిగిపోయాడు. ఆహార్యం, హావభావాలు ఆకట్టుకుంటాయి. శైలేంద్రగా ఈ సీజన్‌లో అనిల్‌కపూర్‌ సాఫ్ట్‌గానే కనించారు. ఆయన్ను ఎలివేట్‌ చేస్తూ ‘రా’ ఏజెంట్‌ చెప్పే సీన్స్‌ మినహా ఆయన ఎక్కడా నెగెటివ్‌ ఛాయల్లో కనిపించరు. రా ఏజెంట్‌గా తిలోత్తమ ఆకట్టుకుంటారు. శోభిత ధూళిపాళ.. శైలేంద్ర ఇష్టపడిన అమ్మాయిగా అందాల ఆరబోతకే పరిమితమయ్యారు. అరిస్టా మెహతా పాత్ర నిడివి తక్కువే అయినా భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇతరులు తమ తమ పాత్రల మేరకు నటించారు. థీమ్‌కు తగ్గట్టు సాగిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. సిమ్లాలోని మంచు వాతావరణాన్ని, శ్రీలంకలో సాగే కొన్ని సీన్స్‌ను బెంజిమన్‌ తన కెమెరాతో చక్కగా చూపించారు. సందీప్‌ మోదీ టేకింగ్‌ బాగుంది.

బలాలు: + ఆదిత్యరాయ్‌ నటన; + షాన్‌ పాత్రను తీర్చిద్దిన తీరు; + నేపథ్య సంగీతం

బలహీనతలు: - ఎక్కువగా రొటీన్‌ సన్నివేశాలు ఉండడం; హీరో, విలన్ల మధ్య సంఘర్షణ లేకపోవడం 

చివరిగా: ప్రస్తుతానికి ‘మేనేజ్‌’ చేశారంతే!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు