Tollywood: ఏపీ సీఎంతో మీటింగ్‌.. సినీ ప్రముఖులు ఏం మాట్లాడారంటే..!

సినిమా టికెట్‌ ధరల పెంపు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు రాయితీలు.. ఇలా పలు అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో తాము జరిపిన చర్చలు కొంతమేర సఫలీకృతమైనట్లేనని గురువారం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో..

Updated : 11 Feb 2022 09:45 IST

హైదరాబాద్‌: సినిమా టికెట్‌ ధరల పెంపు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు రాయితీలు.. ఇలా పలు అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో తాము జరిపిన చర్చలు సఫలీకృతమైనట్లేనని గురువారం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, కొరటాల శివ, రాజమౌళి, పోసాని కృష్ణ మురళీ, అలీ, ఆర్‌.నారాయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి సీఎంకు వివరించారు. తమ ప్రతిపాదనలు వెల్లడించారు. చిరంజీవి, మహేశ్‌బాబు, రాజమౌళి.. సీఎంతో జరిగిన సమావేశంలో ఏం మాట్లాడారంటే..

‘‘కేవలం ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా మా నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకునేందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. పేద ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తూ.. అదే సమయంలో ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులను దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా.. అదే విధమైన రెవెన్యూ కూడా ఉంటే బాగుంటుందని మేం భావిస్తున్నాం. అందుకోసం మేమంతా చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకోవడం.. దానిపై మీరు ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు కొత్తగా నిర్ణయించిన టికెట్‌ ధరలు మాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. మీ నిర్ణయం మా పరిశ్రమ మొత్తానికి వెసులుబాటు. మీ నిర్ణయాన్ని మేమంతా ఏకీభవిస్తున్నాం. విభేదించడం లేదు. పరిశ్రమ మాటగా మీకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇక మాదొక చిన్న ప్రతిపాదన.. భారీ బడ్జెట్‌ చిత్రాలకు కాస్త మినహాయింపులు ఇస్తే బాగుంటుందని మేం కోరుతున్నాం. ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించడానికి విజువల్‌ ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయడం కోసం కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటివి ఉంటేకానీ థియేటర్‌కు వెళ్లి చూడాలనే మూడ్‌ ప్రేక్షకులకు రావడం లేదు. ఎందుకంటే మా సినిమాలు రిలీజైన వారంలోనే ఓటీటీల్లో వచ్చేస్తున్నాయ్‌, అదీకాక పైరసీ మాకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఇవన్నీ అధిగమించి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. ఖర్చుకు అనుగుణంగా రెవెన్యూ కోరుకోవడం సర్వసాధారణం. ఖ్యాతి పొందుతున్న తెలుగు సినిమాలను కాపాడే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలని చేతులు జోడించి అడుగుతున్నాం. ఆ తర్వాత ఐదో షో అవకాశం ఉంటే చిన్న సినిమాలకు వెసులుబాటు ఉంటుందని ఎప్పటినుంచో ఆర్‌.నారాయణ మూర్తి అడుగుతున్నారు. ఆ విషయంపై ఇటీవల మీతో చర్చించగా.. మీరు అప్పటికప్పుడే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు’’ - చిరంజీవి

‘‘కరోనా వల్ల మాత్రమే కాదు.. సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయో కూడా తెలియక గడిచిన రెండేళ్లు ఎంతో కష్టంగా గడిచాయి. ప్రతి రెండు నెలలకొకసారి రిలీజ్‌ డేట్‌ అనుకుంటాం.. అది వాయిదా పడుతుంది. షూటింగ్స్‌ చేస్తాం.. మళ్లీ ఆగిపోతుంది. నా మొత్తం కెరీర్‌లో ఈ రెండు సంవత్సరాలు ఎంతో కష్టంగా అనిపించాయి. నాకు మాత్రమే కాదు మొత్తం చిత్రపరిశ్రమకూ ఈ రెండేళ్లు గడ్డుకాలమే.  కానీ మీరు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది’’ - మహేశ్‌ బాబు

‘‘చిత్రపరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మధ్య వార్‌ జరుగుతోందని గడిచిన కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ నేడు మా అందర్నీ పిలిచి సమస్యలపై చర్చలు జరిపినందుకు ధన్యవాదాలు’’ - రాజమౌళి

‘‘చిన్న సినిమాలు, చిన్న సినిమా నిర్మాతలను కాపాడాలనే ఉద్దేశంతో ఐదోషోకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ - ఆర్‌. నారాయణమూర్తి

‘‘చిన్న సినిమాలకు థియేటర్లు ఇప్పించండి’’ - పోసాని కృష్ణ మురళీ

‘‘ఇండస్ట్రీలో కేవలం దర్శకులు, నిర్మాతలు, నటీనటులు మాత్రమే కాకుండా సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా’’ - అలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని