మెహ్రీన్‌ పెళ్లి రద్దు.. సినిమాలే కారణమా..!

గతకొంతకాలంగా కాబోయే వాడితో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌.. తాము విడిపోతున్నామని షాక్‌కు గురి చేసింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

Updated : 05 Jul 2021 09:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంతకాలంగా కాబోయే వాడితో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేసిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌.. తాము విడిపోతున్నామంటూ ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురి చేసింది. హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకోవడంతో పాటు బిష్ణోయ్‌, అతడి కుటుంబ సభ్యులతో ఇకపై ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పేసింది.

అయితే, ఉన్నట్టుండి మెహ్రీన్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందోనని ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దని అత్తింటి వారు కోరినప్పటికీ మెహ్రీన్‌ మాత్రం సినిమాల్లో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వాళ్లు విడిపోవడానికి అసలైన కారణాలివేనా.. ఇంకేమైనా మనస్పర్థలున్నాయా తెలియాలంటే మెహ్రీన్‌ స్వయంగా చెప్పే వరకూ వేచి చూడాల్సిందే. మరోవైపు విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే మెహ్రీన్‌ సోషల్‌ మీడియాలో భవ్య బిష్ణోయ్‌తో కలిసి దిగిన నిశ్చితార్థ ఫొటోలు.. ఆ తర్వాత పోస్టు చేసిన ఇతర ఫొటోలను తొలగించింది. పాత ఫొటోలు మాత్రం కొన్నింటిని అలాగే ఉంచింది.

‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది పంజాబీ భామ. అందులో నాని సరసన సందడి చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించింది. హనీ ఈజ్‌ ది బెస్ట్‌ అంటూ మరోసారి అల్లరి చేసేందుకు ‘ఎఫ్‌3’తో సిద్ధమవుతోంది. దీంతో పాటు సంతోష్‌శోభన్‌ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని