The Terminal Review: జీవితం వేచి చూడమంటోంది!
చుట్టూ జనమే... అయినా ఒంటరి తనం. విశాలమైన ప్రదేశం.. ఉండటానికి చోటు దొరకని పరిస్థితి. అందరూ మనుషులే... ఎవరూ అర్థం చేసుకోని దుస్థితి. భాష రాదు. ఆ దేశం కాదు. అడుగుతీసి బయటకు వేస్తే అరెస్టు చేస్తారామోనని భయం...
ప్రేక్షకాలమ్
చిత్రం: ది టర్మినల్(2004); భాష: ఇంగ్లీషు; దర్శకుడు: స్టీఫెన్ స్పిల్‌బర్గ్; స్క్రీన్‌ప్లే: సాచా జుర్‌వేసీ, జెఫ్ నాథన్‌సన్; కథ: ఆండ్రీ నికోల్, సాచా జుర్‌వేసి; నటీనటులు: టామ్ హాంక్స్, కేథరిన్ జిటాజోన్స్, స్టాన్లీ టూచీ తదితరులు; సినిమాటోగ్రఫీ: జనుస్ కమిన్‌స్కీ; సంగీతం : జాన్ విలియమ్స్; నిడివి: 128నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: అమెజాన్ ప్రైమ్
చుట్టూ జనమే... అయినా ఒంటరి తనం. విశాలమైన ప్రదేశం.. ఉండటానికి చోటు దొరకని పరిస్థితి. అందరూ మనుషులే... ఎవరూ అర్థం చేసుకోని దుస్థితి. భాష రాదు. ఆ దేశం కాదు. అడుగుతీసి బయటకు వేస్తే అరెస్టు చేస్తారామోనని భయం... ఒక్క తెలిసిన మనిషీ లేకుండా నెలల తరబడి ఒకే చోట ఉండాల్సి రావడం.. ఎంత నరకమో ఊహిస్తేనే కష్టంగా ఉంది కదూ! లాక్‌డౌన్ కాలంలో ఇంట్లో, కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రోజులు ఉండాల్సి వస్తేనే... ఎంతో బాధపడిపోయిన మనకు అలాంటి పరిస్థితి ఎదురైతే...ఎలా ఉంటుందో? చూపించే ప్రయత్నం చేశాడు ‘ది టర్మినల్’ చిత్రంతో హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పిల్‌బర్గ్.
కథ: క్రకోషియా(సినిమాలో పెట్టిన పేరు) దేశం నుంచి విక్టర్ నవోరిస్కీ(టామ్ హాంక్స్)అనే వ్యక్తి న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతాడు. అతను విమానంలో ప్రయాణించే సమయంలోనే క్రకోషియా దేశంలో అల్లర్లు జరిగి, పాలన సైన్యం చేతుల్లోకి వెళుతుంది. దేశమంతా హత్యలు, ఆస్తుల విధ్వంసాలు, గొడవలతో అట్టుడిగిపోతుంటుంది. ఇవేమీ తెలియని విక్టర్ ఓ ముఖ్యమైన పని మీద న్యూయార్క్ నగరంలోకి వెళ్లాలనుకొంటాడు. తీరా ఎయిర్‌పోర్ట్‌లో దిగాక.. వాళ్ల దేశం ఇచ్చిన విసా చెల్లదు. పోనీ తిరిగి వెళ్లిపోదామంటే... టికెట్లు రద్దైపోతాయి. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సి వస్తుంది. విక్టర్‌కు ఇంగ్లీషు సరిగ్గా రాదు. అక్కడి ఎయిర్‌పోర్ట్ అధికారి ఫ్రాంక్ డిక్సెన్(స్టాలిన్ టూచీ) రూల్స్ అంటే.. రూల్స్ అని గట్టిగా కూర్చొంటాడు. పైగా అతనికి ఇతర దేశస్తుల మీద కాస్త చిన్నచూపు ఉంటుంది. నిబంధనల ప్రకారం తిరుగు ప్రయాణ టికెట్టు జారీ అయ్యేంత వరకూ ఎయిర్‌పోర్ట్‌లో ఉండటానికి విక్టర్‌కు అవకాశమిస్తాడు. అయితే విక్టర్ కదలికలన్నీ సీసీ కెమెరాల ద్వారా గనిస్తుంటాడు. ఎయిర్‌పోర్ట్‌లో మరమ్మతులు జరుగుతున్న ఓ ప్రదేశాన్ని ఆవాసంగా చేసుకొని అక్కడే ఉండటం మొదలు పెడతాడు విక్టర్. భాష సరిగ్గా రాక, భోజనం టోకెన్లు లేక..తన చేతిలోని కార్డులు చెల్లక... ఎవరూ పలుకరించేవారు లేక... తొలుత చాలా కష్టపడతాడు. మెల్లగా అక్కడున్న పుస్తకాలు తీసుకొని ఇంగ్లీషు నేర్చుకుంటాడు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రాలీలను సక్రమంగా పెడితే కొంత డబ్బు బహుమానంగా అందుతుంది. ఇలా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు వదిలేసిన ట్రాలీలను తెచ్చి సక్రమంగా పెడుతూ వచ్చిన డబ్బుతో బ్రెడ్ కొనుక్కొని తినడం మొదలుపెడతాడు. విక్టర్‌కు అక్కడ వివిధ పనులు చేస్తున్న గుప్తా, మౌల్‌రాయ్, ఎన్రిక్ అని ముగ్గురు పరిచయం అవుతారు. విసాలు తనిఖీ చేసే ఓ అమ్మాయిని ఎన్రిక్ ప్రేమిస్తాడు. అతని ప్రేమకు సాయం చేస్తే భోజనం పెట్టేందుకు విక్టర్‌తో ఒప్పందం చేసుకుంటాడు. వీరిద్దరి మధ్య రాయబారిలా మారతాడు విక్టర్. అలాగే ఎయిర్‌హోస్టస్‌గా పనిచేసే ఎమిలియా(కేథరిన్ జిటా జోన్స్) పరిచయం అవుతుంది. స్నేహం చేస్తుంది. విక్టర్‌తో ప్రేమలోనూ పడుతుంది. ఇవన్నీ గమనిస్తున్న డిక్సన్ ఎలాగైనా విక్టర్‌ని ఎయిర్ పోర్ట్‌లోంచి పంపించేయాలనుకుంటాడు. దీనికి కుట్రలు పన్నుతాడు. వీసా లేకుండా న్యూయార్క్‌లోకి అడుగు పెడితే... తర్వాత విక్టర్ పోలీసుల అధీనంలోకి వెళతాడు. తనకు రిస్క్ తప్పుతుందనేది అతని ఆలోచన. మరి చివరికి డిక్సన్ విక్టర్‌ని బయటికి పంపగలిగాడా? ఎన్రిక్ ప్రేమ సఫలమైందా? ఎమిలియా విక్టర్‌కు ఎలాంటి సాయం చేసింది? విక్టర్ అసలెందుకు న్యూయార్క్‌కు వచ్చాడు? క్రకోషియాకు తిరిగి వెళ్లాడా? లేదా? అతని లక్ష్యం నెరవేరడానికి గుప్తా ఎలాంటి సాయం చేశాడు? అనేది మిగతా కథ.
అంతా ఎయిర్‌పోర్ట్‌లోనే
అమాయకమైన వ్యక్తిగా, ఇంగ్లీషు రాక ఇబ్బందులు పడే విదేశీయుడిగా టామ్ హాంక్స్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సందర్భానుసారంగా వచ్చే సంగీతం... ఎయిర్‌పోర్ట్ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చిత్రీకరించిన సినిమాటోగ్రఫీ మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. సున్నితమైన హాస్యం, అద్భుతమైన ప్రేమ, మనసును వెంటాడే భావోద్వేగాలతో సాగే స్క్రీన్‌ప్లే ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. చివరి 5 నిమిషాలు మినహా మొత్తం సినిమా ఎయిర్‌పోర్ట్‌లోనే సాగినా ఎక్కడా విసుగురాదు.
నిజ జీవిత కథ
మెర్హాన్ నస్సారి అనే ఓ ఇరానియన్ పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో 18 సంవత్సరాలు ఉండిపోయిన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడమే కాకుండా నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యాడు స్పిల్‌బర్గ్. ‘‘జీవితం అంటేనే వేచిచూడటం’’ అని ఎమిలియా పాత్రతో చెప్పించి... ఈ సినిమా సందేశాన్ని మనకు వినిపిస్తాడు దర్శకుడు. ప్రతి ఒక్కరం జీవితమంతా దేనికోసమో ఒక దాని కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాం. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, ఒంటరిగా మిగిలిపోయినా, ఏ దశలోనూ నిరాశ చెందకుండా... లక్ష్యం దిశగా నిజాయతీగా ప్రయత్నిస్తే అనుకున్నది సాధిస్తామని.. దీనికి కావాల్సిందల్లా ఓపికేనని విక్టర్ పాత్ర ద్వారా చూపిస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం... న్యూయార్క్‌లోని జెన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయాన్ని మన కళ్లకు కట్టే ‘ది టర్మినల్’ చిత్రాన్ని చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ap Highcourt: ప్రభుత్వ సలహాదారులను నియమించుకుంటూ పోతే ఎలా?: ఏపీ హైకోర్టు
-
Sports News
IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్ చోప్రా
-
General News
Andhra News: అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తాం: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
-
World News
Ukraine Crisis: ‘సైనిక చర్యకు ఏడాది వేళ.. భారీఎత్తున దాడులకు రష్యా ప్లాన్..!’
-
General News
TSSPDCL Jobs: గుడ్‌న్యూస్.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 ఉద్యోగాలకు ప్రకటన
-
Movies News
Yash: యశ్ ఇంటి వద్ద బారులు తీరిన అభిమానులు.. వీడియోలు వైరల్