Ram gani: జైల్లో ఖైదీల కథలు విని స్క్రిప్టు రాశా

‘‘డిప్యూటీ జైలర్‌గా పదేళ్ల కెరీర్‌లో ఎన్నో నేర సంఘటనలతోపాటు... నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కథల్ని విన్నాను. వాటితోపాటు... విదేశాల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని మనకు అన్వయించుకుని రాసుకున్న కల్పిత కథతోనే సినిమా తెరకెక్కించాన’’ని తెలిపారు రామ్‌ గన్ని.

Updated : 21 Nov 2023 09:30 IST

‘‘డిప్యూటీ జైలర్‌గా పదేళ్ల కెరీర్‌లో ఎన్నో నేర సంఘటనలతోపాటు... నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కథల్ని విన్నాను. వాటితోపాటు... విదేశాల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని మనకు అన్వయించుకుని రాసుకున్న కల్పిత కథతోనే సినిమా తెరకెక్కించాన’’ని తెలిపారు రామ్‌ గన్ని. ఆయన దర్శకత్వంలో... స్పందన పల్లి, యుగ్‌రామ్‌, వంశీ కోటు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘ది ట్రయల్‌’. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రామ్‌ గన్ని హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘తెలుగులో విచారణ నేపథ్యంలో రూపొందిన తొలి చిత్రమిది. ఇప్పటివరకూ మన సినిమాల్లో విచారణ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్నే చూశాం కానీ, మొత్తం దాని చుట్టూనే తిరిగే సినిమా మాత్రం రాలేదు. అందుకే తొలి ఇంటరాగేటివ్‌ చిత్రం అని ప్రచారం చేస్తున్నాం. ఇంటరాగేషన్‌ గది నుంచి కథ మొదలై... మళ్లీ అక్కడే ముగుస్తుంది. ఒక మహిళా ఎస్‌.ఐ, ఆమె భర్త కలిసి పెళ్లి రోజు జరుపుకొంటుండగా జరిగిన సంఘటన చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఎస్‌.ఐ రూప పాత్రలో స్పందన పల్లి నటించారు. ఓ విచారణాధికారీ, ఓ ఎస్‌.ఐకీ మధ్య విచారణ అంటే అది ఎంత గాఢంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వాళ్లిద్దరి మధ్య ప్రశ్నలు, జవాబులు, వాటి దృశ్యరూపం ప్రేక్షకుల్ని ఉత్కంఠకి గురిచేస్తాయి’’.  

‘‘నా పూర్తి పేరు రామానాయుడు గన్ని. మాది విశాఖపట్నం. కాలేజీ రోజుల నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌గా 2012 నుంచి 22 వరకూ ఉద్యోగం చేశా. సినిమాలపై తపనతో ఉద్యోగ విరమణ చేసి పరిశ్రమకి వచ్చా. కొత్త రకమైన ప్రజెంటేషన్‌తో సినిమాని తెరకెక్కించాం. బలమైన సందేశం కూడా ఉంటుంది. ‘సెహరి’ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడే నిర్మాణ సంస్థ వర్గో పిక్చర్స్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చేసేలా ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఆ పనులు కొనసాగుతున్నాయి. జీ 5 సంస్థలోనూ ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. డార్క్‌ హ్యూమర్‌తో కూడిన ఓ కథని, మరొక సూపర్‌ హీరో కథని కూడా సిద్ధం చేస్తున్నా’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని