Updated : 30 Oct 2021 14:02 IST

Puneeth Rajkumar: 2006లోనూ ఇలాగే..!

ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకుని అభిమానులు కన్నీరుమున్నీరు

బెంగళూరు: నటుడిగానే కాకుండా తన సేవాగుణంతో కన్నడనాట భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న పవర్‌స్టార్‌ పునీత్‌కుమార్‌ హఠాన్మరణంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. పునీత్‌ను కడసారి చూసేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఆనాడు రాజ్‌కుమార్‌ మరణించిన రోజుల్ని గుర్తు చేసేలా ఉన్నాయని పలువురు అభిమానులు అంటున్నారు. ఇంతకీ 2006లో రాజ్‌కుమార్‌ మరణించినప్పుడు ఏం జరిగిందంటే..!

వాకింగ్‌కు వెళ్లి వచ్చి.. కుప్పకూలి..!

ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే రాజ్‌కుమార్‌ ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్తారు. 2006 ఏప్రిల్‌ 12న ఎప్పటిలానే వాకింగ్‌ చేసి ఇంటికి తిరిగి వచ్చి.. 11.30 గంటల సమయంలో రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నట్టుండి సోఫాలో కుప్పకూలిపోయారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు.. ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్‌కుమార్‌ కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.

15 సంవత్సరాల తర్వాత మళ్లీ..!

సుమారు 15 సంవత్సరాల తర్వాత పునీత్‌ గుండెపోటుతో మరణించడం అభిమానుల్ని ఎంతగానో కలచివేస్తోంది. ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించే పునీత్‌ జిమ్‌లో వర్కౌట్లు.. సైక్లింగ్‌.. వాకింగ్‌.. రన్నింగ్‌.. ఇలా ఏదో ఒకరకంగా తన ఉదయాన్ని ప్రారంభించేవారు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన తర్వాత తన పనులను ముగించుకుని జిమ్‌లోకి అడుగుపెట్టారు. తొమ్మిది గంటల సమయంలో వ్యాయామం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందనడంతో.. ఇంటిసభ్యులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విక్రమ్‌ ఆస్పత్రికి తరలించగా.. పునీత్‌ ప్రాణాలు కాపాడటానికి అక్కడి వైద్యులు ఎంతగానో శ్రమించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో పునీత్‌ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక, తన తండ్రిని ఆదర్శంగా తీసుకున్న పునీత్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌ మాదిరిగానే పునీత్‌ కూడా.. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

రాజ్‌కుమార్‌ పెద్దకుమారుడు శివరాజ్‌కుమార్‌ గతంలో ఓసారి గుండెపోటుకు గురయ్యారు. 2015లో ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని