Suriya: బయోపిక్‌ల బాస్‌.. నటనకు కేరాఫ్‌.. సూర్య!

మరుగున పడ్డ రియల్‌ హీరోలను వెలికితీసి మరీ రీల్‌ హీరోలు ఆకాశానికి ఎత్తేస్తున్న రోజులివి... ఈ ఒరవడిలో వచ్చిందే ‘జై భీమ్‌’...

Updated : 09 Nov 2021 11:15 IST

మరుగున పడ్డ రియల్‌ హీరోల కథలను తెరపై చూపిస్తూ హిట్‌ కొడుతున్నారు రీల్‌ హీరోలు. ఈ ఒరవడిలో వచ్చిందే ‘జై భీమ్‌’. తెలుగువాళ్లకీ దగ్గరైన తమిళ హీరో సూర్య.. జస్టిస్‌ చంద్రు పాత్రలో జీవించేశాడు. ఇదొక్కటే కాదు.. తను బయోపిక్‌ల బాస్‌. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిన పలు పాత్రల్లో మెప్పించాడు. ఆ వివరాలు..

‘యువ’లో జార్జిరెడ్డిగా!

పద్దెనిమిదేళ్ల కిందట వచ్చిన మణిరత్నం దృశ్యకావ్యం ‘ఆయుథ ఎజుత్తు’ చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అందులో విద్యార్థి నాయకుడిగా మెప్పించాడు సూర్య. తమిళంలో భారీ విజయం సాధించి తెలుగులో ‘యువ’గా డబ్బింగ్‌ చేసిన ఈ సినిమాలో మైఖేల్‌ వసంత్‌ పాత్రకు ప్రేరణ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు, తెలుగు యువకుడు జార్జిరెడ్డినే! కాలేజీలో జరిగే అన్యాయాలను ఎదిరించే నాయకుడిగా, అవినీతి రాజకీయ నాయకులతో కడదాకా పోరాడే విద్యార్థిగా సూర్య నటన అద్భుతంగా ఉందని అప్పట్లో అంతా పొగిడారు. ఇది పూర్తిస్థాయి జార్జిరెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కాకపోయినా అతడి లైఫ్‌ స్టోరీ నుంచి ప్రేరణ పొందిన పాత్రగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం సూర్య స్వయంగా జార్జిరెడ్డి స్నేహితులు కొందరితో మాట్లాడాడు. గమనిస్తే మైఖేల్‌ మేకప్‌ జార్జిని పోలి ఉంటుంది.


సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌- గౌతమ్‌ వాసుదేవ మేనన్‌

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ సొంతంగా తెరకెక్కించిన బయోపిక్‌ ‘వారనమ్‌ ఆయిరం’. తెలుగులో ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’. గౌతమ్‌ మేనన్‌ నాన్న ఆర్మీలో పని చేస్తూ చనిపోయారు. తన తల్లి, బంధువులు.. తండ్రి గురించి చెప్పిన వివరాలు తీసుకొని, తన జీవితంలోని కొన్ని సంఘటనలు జోడించి వాటి ఆధారంగా ఈ సినిమాను మలిచాడు మేనన్‌. సూర్య కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి. ఆర్మీ అధికారిగా, అతడి కొడుకుగా సూర్య ద్విపాత్రాభియనం చేసిన ఈ సినిమా జాతీయ అవార్డు సైతం గెల్చుకుంది.


రక్తచరిత్ర- మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి

కరుడు గట్టిన ఫ్యాక్షన్‌ నేతగా, పగ ప్రతీకారాలతో రగిలిపోయే నాయకుడిగా సూర్య మేటి హావభావాలు పలికించిన సినిమా రక్త చరిత్ర-2. ఈ సినిమా ద్వారా తెలుగు, హిందీల్లో నేరుగా తెరంగేట్రం చేశాడు. రాయలసీమలో రక్తచరిత్ర లిఖించిన పరిటాల రవి, మద్దెలచెరువు సూరి వర్గీయుల మధ్య వైరమే ఈ చిత్రం కథ. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సూర్య పాత్ర పేరు యేటూరి సూర్యనారాయణరెడ్డిగా చిత్రీకరించినా ఇది ఫ్యాక్షన్‌ నాయకుడు మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి ప్రేరణతో రూపొందిన పాత్రనే. సినిమా సూపర్‌హిట్‌ కాకపోయినా సూర్య నటనకు సూపర్‌ అనే పేరొచ్చింది.


సెవెన్త్‌ సెన్స్‌- బోధి ధర్మ

ఆరో శతాబ్దంలో జీవించిన మహిమాన్విత బౌద్ధ భిక్షువు బోధిధర్మ. పోరాట విద్యలు, ప్రాచీన వైద్య విధానాల్లో ఆయన దిట్ట. ‘సెవెన్త్‌ సెన్స్‌’ సినిమాతో ఆ చారిత్రక పురుషుడిలో పరకాయ ప్రవేశం చేశాడు సూర్య. ఈ చారిత్రక, కాల్పనిక సినిమా కోసం మూడునెలలపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో, 16 రోజులు కుంగ్‌ఫూలో శిక్షణ తీసుకున్నాడు. షూటింగ్‌ సమయంలో తనకి గాయం అయ్యింది. సూర్య కెరీర్‌లోనే అప్పట్లో ఇది భారీ బడ్జెట్‌ సినిమా. వాణిజ్యపరంగానూ మంచి సక్సెస్‌ సాధించాడు.


ఆకాశమే నీ హద్దురా- జి.ఆర్‌.గోపీనాథ్‌

ఆలోచనకు రెక్కలొస్తే ఆకాశాన్ని ముద్దాడుతుంది. దానికి ఆచరణ తోడైతే అంతులేని విజయం దక్కుతుంది. మారుమూల పల్లెలో పుట్టి, భారత సైన్యంలో పైలట్‌గా పనిచేసి ‘ఎయిర్‌ దక్కన్‌’ విమానయాన సంస్థను నెలకొల్పిన ఒక సామాన్యుడు గోరూర్‌ రామస్వామి అయ్యంగార్‌ గోపీనాథ్‌. ఆయన జీవిత నేపథ్యం కథాంశంగా సూర్య నటించిన సినిమానే ‘సూరారాయ్‌ పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’. ఈ సినిమాలో సూర్య నటనకు విమర్శకులతో సహా అంతా ఫిదా అయ్యారు. సాంకేతిక విలువలు, తెరకెక్కించిన విధానం భేష్‌ అంటూ అంతా పొగిడారు. భారతసైన్యంలో పని చేసి తిరిగొచ్చిన ఓ యువ పైలట్‌ చౌక విమానయాన సంస్థ నెలకొల్పడం కోసం ఎంతలా కష్టపడ్డాడు అనేది కథ.

జై భీమ్‌- జస్టిస్‌ కె.చంద్రు

రియల్‌ హీరో జస్టిస్‌ కె.చంద్రుగా సూర్య నటనతో కట్టిపడేసిన తాజా ఫిల్మ్‌ ‘జై భీమ్‌’. ఒక కమర్షియల్‌, స్టార్‌ హీరో అయ్యి ఉండి కూడా అణగారిన వర్గాల కోసం పోరాడే మామూలు లాయర్‌ పాత్రలో నటించడం ద్వారా పెద్ద సాహసమే చేశాడు సూర్య. ఈ లీగల్‌ డ్రామా సినిమాలో నటన ద్వారా తను మరో రేంజ్‌కి వెళ్లిపోయాడని విమర్శకులతో సహా అంతా సూర్యని పొగుడుతున్నారు. 1993లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చంద్రు పాత్రలో జీవించడం కోసం ఆయన గురించిన సమాచారం అంతా తెప్పించుకున్నాడు. చంద్రు రాసిన పుస్తకం చదివాడు. కోర్టులో ఉండే విధివిధానాలు తెలుసుకోవడం కోసం చాలా హోంవర్కే చేశాడు సూర్య. అందుకే ఈ బయోపిక్‌ అందరికీ చేరువైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని