Tollywood: విజయోత్సవం కాస్తా.. వివాదమైంది.. విమర్శల పాలైంది!

సంక్రాంతి సందర్భంగా వచ్చిన తెలుగు చిత్రాలు ‘వీరసింహారెడ్డి’,(veera simha reddy) ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ కార్యక్రమాలు సినిమాలకు అదనపు ప్రయోజనం చేకూర్చకపోగా, వివాదాలను తెచ్చిపెట్టాయి.

Updated : 31 Jan 2023 17:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చిన తెలుగు చిత్రాలు ‘వీరసింహారెడ్డి’,(veera simha reddy) ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya)లు బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో చిత్ర బృందాలు వేర్వేరుగా విజయోత్సవాలను నిర్వహించాయి. వీటి వల్ల అదనపు ప్రయోజనం రాకపోగా, విజయోత్సవాలు కాస్తా.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

బాలకృష్ణ వ్యాఖ్యలు.. అక్కినేని వారసుల ట్వీట్లు..

బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం జనవరి 22న ‘వీరసింహుని విజయోత్సవం’ నిర్వహించింది. వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ ఒక సందర్భంలో అక్కినేని, ఎస్వీఆర్‌ పేర్లను ఉదహరిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్లు పెట్టారు. ‘తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలైన ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎస్వీఆర్‌లను అగౌరవపరచటం మనల్ని మనం కించపరుచుకోవటమే ’ అంటూ ట్వీట్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతమైన చర్చ నడిచింది. బాలకృష్ణ కావాలని ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, ప్రసంగంలో అలా అనడాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదంటూ బాలయ్య అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అగ్ర కథానాయకుడుగా ఉన్న బాలకృష్ణ మాట్లాడేటప్పుడు, అది కూడా వేదికలపై సంయమనంతో మాట్లాడితే బాగుండేదని అక్కినేని అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.


వీరయ్య విజయ విహారం.. చరణ్‌ మాటల ప్రవాహం..

ఇక చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర పోషించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో జనవరి 28న చిత్ర బృందం ‘వీరయ్య విజయ విహారం’ పేరుతో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. దీనికి అతిథిగా రామ్‌చరణ్‌ విచ్చేసి తనదైన శైలిలో మాట్లాడారు. తొలినాళ్లలో కాస్త అగ్రెసివ్‌గా మాట్లాడే చరణ్‌, ‘రంగస్థలం’ తర్వాత డౌన్‌ టు ఎర్త్‌ అయిపోయారు. ప్రతి సందర్భంలోనూ ఆచితూచి మాట్లాడేవారు. కానీ, ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌మీట్‌లో కాస్త పదునైన వ్యాఖ్యలతో మాట్లాడుతూ.. పాత చరణ్‌ను గుర్తు చేశారు. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన హీరో రవితేజను ‘రవి’ అని పేరు పెట్టి పలుమార్లు పిలవడం మాస్‌ మహారాజ్‌ అభిమానులను ఒకింత ఆశ్యర్యానికి గురిచేసింది. ఇక చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే చూస్తూ ఊరుకోమంటూ కొంచెం గట్టిగానే హెచ్చరించాడు. అయితే, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల వేదికగా జరిగింది. అలాగే ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాతలను చూసి నేర్చుకోవాలంటూ పరోక్షంగా ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు చరణ్ కౌంటర్ వేయడం గమనార్హం. మరోవైపు రవితేజను చిరంజీవి చిన్న హీరో అంటూ చిరు అనడాన్ని కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ చేశారు. రవితేజ నటనను చిరు మెచ్చుకోవటం, ఆయన తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో సమానమంటూ చిరంజీవి అన్న వ్యాఖ్యలను పక్కకు పెట్టి, చిన్న హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కావాలనే కొందరు వైరల్‌ చేయడం గమనార్హం. ఈ విషయంలో రవితేజ అభిమానులు కూడా చిరంజీవికే మద్దతు తెలిపారు. కావాలనే కొందరు దీన్ని వివాదం చేస్తున్నారని, చిరంజీవిలాంటి నటుడు మాటల సందర్భంలో అన్న వ్యాఖ్యలను వివాదం చేయాల్సిన అవసరం లేదని ట్వీట్లు పెట్టారు. దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. ఏదేమైనా ఈ ఏడాది సంక్రాంతి చిత్రాల విజయోత్సవాలు సామాజిక మాధ్యమాల వేదికగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. చివరిగా ప్రతి అభిమాని మహేశ్‌బాబు అన్న మాటలను గుర్తు పెట్టుకోవాలి. ‘భరత్‌ అనే నేను’ ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘మేము మేమూ (హీరోలం) బాగానే ఉంటాం. మీరు(అభిమానులు) బాగుండాలి’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు