Prabhas: మాట నిలబెట్టుకున్న ప్రభాస్‌.. తర్వాత మూవీ ఏంటి?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకుల్లో వరుస సినిమాలతో పలకరిస్తున్న స్టార్‌ హీరో ప్రభాస్‌ నుంచి రాబోయే కొత్త సినిమా ఏంటా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Published : 27 Jun 2024 17:11 IST

హైదరాబాద్‌: ‘ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తా. కుదిరితే మూడు సినిమాలు వచ్చేలా చూస్తా’ ఇది గతేడాది జూన్‌లో ‘ఆది పురుష్‌’ మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్‌ (Prabhas) అన్న మాటలు.  ఆయన చెప్పినట్లుగానే ఏడాది కాలంలో మూడు సినిమాలతో అలరించారు. గతేడాది డిసెంబరు చివరిలో ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన డార్లింగ్‌ ఇప్పుడు ఆరు నెలల్లో ‘కల్కి 2898 ఏడీ’తో అలరించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్‌, అమితాబ్‌ల నటన, నాగ్‌ అశ్విన్‌ కథను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.  మరి ప్రభాస్‌ తర్వాతి మూవీ ఏంటి?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకుల్లో ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కల్కి’ విడుదలవడంతో ప్రభాస్‌ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ సినిమాల జాబితా చూస్తే, మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాజా సాబ్‌’తోనే ఆయన పలకరించనున్నారు. ఎందుకంటే, ‘సలార్‌: శౌర్యంగ పర్వం’ షూటింగ్‌ కొన్ని రోజుల కిందట మొదలైంది. మొదటి భాగం ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంతకుమించి ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో బలమైన డ్రామాగా ప్రశాంత్‌నీల్‌ ఈ మూవీని తీర్చిదిద్దనున్నారు. ఖాన్సారా ప్రపంచాన్ని ఇంకాస్త విస్తృతంగా చూపించనున్నారు. దీంతో ఈ మూవీ మరింత ఆలస్యం కానుంది. ఇది కాకుండా  సందీప్‌ వంగా దర్శకత్వంలో‘స్పిరిట్‌’ ఉంది. ఇది ఇంకా అసలు పట్టాలెక్కలేదు. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను సందీప్‌ లాక్‌ చేయనున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక పూర్తయ్యే సరికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ప్రభాస్‌ నుంచి వచ్చే సినిమా కచ్చితంగా ‘రాజా సాబ్‌’. ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రభాస్‌ ఇంకాస్త ఎక్కువ సమయం దీని కోసం కేటాయిస్తే, మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేయనున్నారు.  రొమాంటిక్ హారర్‌ ఫిల్మ్‌గా ఇప్పటివరకూ ప్రభాస్‌ నటించని సరికొత్త జానర్‌ను ప్రయత్నిస్తున్నారు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇవి కాకుండా హను రాఘవపూడితో ప్రభాస్‌ మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తిస్థాయి పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా. చారిత్రక ఫిక్షన్ చిత్రం. మరి ఈ మూవీని వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్తారా? ‘సలార్‌’,‘స్పిరిట్‌’ అయిన తర్వాతే వెళ్తారా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈలోగా ప్రభాస్‌ మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. అదే ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న  ఈ మూవీలో ప్రభాస్‌ అతిథి పాత్రలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని