పామును మెడలో ఎందుకు వేసుకోరంటే!

ప్రతి దేవతా రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మను తలచుకుంటే నాలుగు తలలు, చేతిలో పద్మం ఉన్న రూపం మన కళ్లముందు దర్శనమిస్తుంది.

Updated : 28 Feb 2022 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి దేవతా రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మను తలచుకుంటే నాలుగు తలలు, చేతిలో పద్మం ఉన్న రూపం మన కళ్లముందు దర్శనమిస్తుంది. శ్రీమహా విష్ణువు అంటే శేషతల్పంపై పడుకున్న రూపం మనసులో మెదులుతుంది. మరి శివుడు అంటే ముందుగా గుర్తొచ్చేది మెడలో పాము, చేతిలో త్రిశూలం. మన ఇళ్లలో ఉండే దేవతా చిత్ర పటాల్లో కానీ, పౌరాణిక సినిమాల్లో కానీ, ఈ మూడు రూపాలు ఇలాగే కనపడతాయి. అయితే సినిమాల్లో బ్రహ్మ, విష్ణుల పాత్రలు వారి ఆహర్యం ఫొటోల్లో చూసినట్లు.. పురాణాల్లో విన్నట్లు యథాతథంగా కనిస్తాయి. కానీ, శివుడి పాత్ర ధరించే వ్యక్తి మాత్రం అన్ని ఆభరణాలు పెట్టుకున్నా, నిజమైన పాముని మాత్రం మెడలో వేసుకోవడం చాలా తక్కువ సినిమాల్లో చూసి ఉంటాం.

సాధారణంగా శివుడి పాత్రలు ధరించేవారికి మెడలో సర్పాన్ని వెయ్యడం పరిపాటి. అయితే, ‘దక్షయజ్ఞం’, ‘ఉమా చండీ గౌరీ శంకరుల’ కథల్లో నటించిన నందమూరి తారక రామారావు సర్పాన్ని ధరించలేదు. ‘శ్రీమంజునాథ’లో కూడా చిరంజీవి నిజమైన పామును మెడలో వేసుకోలేదు. లోహంతో చేసిన పామునే ధరించారు. శివుడు ముఖ్యపాత్రలో నటించిన శివాజిగణేశన్‌ కూడా ‘తిరువిళైయాడల్‌’ లోహసర్పాన్నే వేసుకున్నారు. ‘బ్రహ్మచారి’లో కమల్‌ స్టంట్‌ మాస్టర్‌గా కనిపిస్తారు. అందులో ఆయన శివుడి పాత్రను వేసినప్పుడు మాత్రం నిజమైన పామును ధరించి అందులో కనిపిస్తారు. కేవలం ఒకరిద్దరు నటులు మాత్రమే నిజమైన పామును ధరించారు.

అసలు శివుడి పాత్ర ధారి ఎందుకు నిజమైన పామును ధరించరంటే.. శివుడి మెడలో ఉన్న ఆ సర్పం తిన్నగా ఉండదు. సరిగ్గా టేక్‌ జరుగుతూ ఉండగా నెత్తి మీదికైనా ఎక్కవచ్చు.. కిందికైనా జారవచ్చు. దానివల్ల కాలం, వ్యయం ఎక్కువవుతాయని నిర్మాత భయపడుతుంటారు. అది పాకుతూ ఉంటే మూడ్‌ సరిగ్గా ఉండదనో, ఒంటి మీద కంపరం పుడుతుందనో నటుల భయం నటులది. పాముని మెడలో పెట్టుకుని శివుడు నాట్యం చెయ్యవలసి వస్తే పాము కనిపించదు. అందుకే చాలా సినిమాల్లో నటులు లోహ సర్పాన్ని ధరించి కనిపిస్తారు. వీఎఫ్‌ఎక్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాల్లో జంతువులను వాడటం చాలా తగ్గిపోయింది. ఎక్కువశాతం గ్రాఫిక్స్‌లోనే వాటిని అత్యంత సహజంగా చూపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని