Allu Aravind: సినిమాకి హద్దుల్లేవు: అల్లు అరవింద్‌

సంక్రాంతి, దసరా పండగలకు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్‌ చిత్రాలను ఆపడం జరిగే పని కాదన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఇప్పుడు సినిమాకి సౌత్‌, నార్త్‌ అన్న హద్దులు లేవని.. బాగున్న చిత్రం ఎక్కడైనా ఆడుతుందన్నారు.

Updated : 20 Nov 2022 15:39 IST

సంక్రాంతి, దసరా పండగలకు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్‌ చిత్రాలను ఆపడం జరిగే పని కాదన్నారు నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind). ఇప్పుడు సినిమాకి సౌత్‌, నార్త్‌ అన్న హద్దులు లేవని.. బాగున్న చిత్రం ఎక్కడైనా ఆడుతుందన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తోడేలు’ (Thodelu) చిత్ర విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రమిది. దినేష్‌ విజన్‌ తెరకెక్కించారు. తెలుగులో అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్‌ 25న విడుదలవుతోంది. ‘‘సినిమాలకి ఇప్పుడు ఎల్లలు లేవు. బాగుంటే ఎక్కడైనా ఆడుతుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నా. ‘కాంతార’, ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత ఇది హ్యాట్రిక్‌ అనుకోవచ్చు. డిసెంబర్‌లో మా మరో చిత్రం ‘18పేజెస్‌’ విడుదలవుతుంది’’ అన్నారు. హీరో వరుణ్‌ ధావన్‌ మాట్లాడుతూ.. ‘‘నా చిత్రం తెలుగులో విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో సినీప్రియులు ఎక్కువ. ఈ నగరాన్ని సొంతింటిలా ఫీలవుతున్నా. గతంలో నేను నటించిన ‘డ్యాన్స్‌ త్రీడీ’ తెలుగులోనూ విడుదలైంది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు అరచి అరచి నా గొంతు ఎన్నోసార్లు పోయింది. దవడ కూడా తెరచుకోలేదు’’ అన్నారు. ‘‘1 నేనొక్కడినే’తో నటిగా తెరపైకి వచ్చా. చాలాఏళ్ల తర్వాత ‘తోడేలు’తో తెలుగు వారిని పలకరించనున్నా. ఈ సినిమాని మీరంతా ప్రేమిస్తారని అనుకుంటున్నా. అలాగే ‘ఆదిపురుష్‌’ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నా’’ అంది నాయిక కృతి సనన్‌. కార్యక్రమంలో దినేష్‌ విజన్‌ పాల్గొన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు