Ravi Teja: టైగర్‌ Vs టైగర్‌.. రవితేజ ఏమన్నారంటే?

‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్ర బృందం ముంబయిలో సందడి చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్కడ విడుదల చేశారు. అనంతరం, మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ మూవీ టీమ్ సమాధానమిచ్చింది.

Published : 03 Oct 2023 21:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రవితేజ (Ravi Teja) హీరోగా ‘దొంగాట’ ఫేమ్‌ వంశీ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుక ముంబయిలో మంగళవారం జరిగింది. అనంతరం, చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా విడుదలకానున్న తేదీనే బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటించిన చిత్రం విడుదల కానుంది. దాంతో, ‘టైగర్‌గా మీరు నటించిన సినిమా, మరోవైపు టైగర్‌ నటించిన సినిమా ఒకే రోజు రానున్నాయి. ఈ పోటీపై మీరేమంటారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. పోటీ అంటూ ఏం లేదు.. రెండు సినిమాలూ ప్రేక్షకులను అలరించి, మంచి విజయాన్ని అందుకోవాలని రవితేజ ఆకాంక్షించారు.

‘సిద్ధార్థ్‌ సినిమానా? ఎవరు చూస్తారు’ అన్నారు.. వేదికపై కన్నీటి పర్యంతమైన నటుడు

ఈ సినిమా విషయంలో ‘ఇన్‌స్పైర్డ్‌ ఫ్రమ్‌ ట్రూత్‌ రూమర్స్‌’ అని ఎందుకు ట్యాగ్‌లైన్‌ పెట్టారన్న ప్రశ్నకు దర్శకుడు సమాధానమిస్తూ.. ‘‘ఇది బయోపిక్‌. సెలబ్రిటీ దొంగకు సంబంధించిన కథ. నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఇలా ప్రముఖుల గురించి సమాచారం కావాలంటే డాక్యుమెంట్స్‌ ఉంటాయి. గూగుల్‌లో వెతికినా ఎన్నో విషయాలు తెలుస్తాయి. కానీ, దొంగ గురించి డాక్యుమెంట్స్‌ ఎవరూ రాయరు. దాంతో నేను విన్న రూమర్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించా. అందుకే ఇన్‌స్పైర్డ్‌ ఫ్రమ్‌ ట్రూత్‌ రూమర్స్‌ అని ట్యాగ్‌లైన్‌ పెట్టా’’ అని తెలిపారు. 70ల కాలంలో పేరు మోసిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందిన చిత్రమిది. నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ కథానాయికలు. రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున టైగర్‌ ష్రాఫ్‌ ‘గణపథ్‌’ చిత్రం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని