Sarath Babu: స్నేహితుల బలవంతంతో వెళ్లి.. 3వేల మందిని దాటుకుని హీరోగా.. శరత్‌బాబు ప్రయాణమిది
సీనియర్ నటుడు శరత్‌బాబు (Sarath Babu) సినీ ప్రయాణం ఎలా సాగిందంటే..?
Sarath Babu: సత్యనారాయణ దీక్షిత్, సత్యంబాబు దీక్షితులు.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, శరత్‌బాబు (Sarath Babu) అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు. ఆమదాలవలస అందగాడిగా పేరు తెచ్చుకున్న ఆయన దక్షిణాదిలో ఎన్నో చిత్రాల్లో నటించి సహజ నటుడిగా ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఐపీఎస్ కావాలనే కలను పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్‌బాబు తన కెరీర్ ఎలా మొదలైందో గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారిలా..!
చిన్నప్పుడే నాటకాలు..!
‘‘శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు, సుశీలాదేవిల కుమారుడిని నేను. మేము 13 మంది సంతానం. ఇంట్లో అందరూ నన్ను సత్యంబాబు అని పిలిచేవారు. శ్రీకాకుళం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదివాను. కాలేజీలో చదువుతున్న రోజుల్లో నాటకాలు వేసేవాడిని. మొదటిసారి ‘దొంగాటకం’ అనే నాటిక కోసం స్టేజ్ ఎక్కాను. ఆ నాటిక సూపర్‌హిట్ అయ్యింది. అందరూ నన్ను మెచ్చుకున్నారు. నాలో నటుడున్నాడని ఉపాధ్యాయులు ప్రశంసించారు. నేను పోషించిన నాటికలు కాలేజీ మ్యాగజైన్‌లో కూడా వచ్చాయి. వాటిని చూసి స్నేహితులందరూ ‘నువ్వు ఉండాల్సింది కాలేజీలో కాదు, మద్రాసులో’ అనేవాళ్లు’’
స్నేహితులు బలవంతం చేయడంతో..!
‘‘ఊర్లో మాకు ‘గౌరీశంకర్’ అనే హోటల్ ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా హోటల్‌కు మంచి పేరు. అన్నయ్యా, నేనూ దాన్ని చూసుకునేవాళ్లం. కాలేజీ చదువు పూర్తైన వెంటనే అన్నయ్యకు హోటల్ పనుల్లో సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి సమయంలో మద్రాసు వెళ్లమంటూ స్నేహితులు బలవంతం చేయడంతో చేసేది లేక నా అభిమాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారికి ఫొటోలు పంపాను. ఇంటర్వ్యూకు రమ్మని ఆయన ఉత్తరం పంపారు. మద్రాసుకు వెళ్లగా ఆయన నన్ను పై నుంచి కింద వరకూ చూసి.. ‘మళ్లీ కబురు పంపిస్తాను అప్పుడు కనపడు’ అని చెప్పారు’’
ఆ మాటకు ఆశ్చర్యపోయా..!
‘‘సుబ్బారావు గారి పిలుపు కోసం మద్రాస్‌లోనే ఉన్నాను. అదే సమయంలో రామా విజేత ప్రొడెక్షన్స్ వారు కొత్త హీరో కావాలని ప్రకటన ఇచ్చారు. ఆడిషన్‌కు 3000 మంది రాగా.. చివరకు నన్ను సెలెక్ట్ చేశారు. ‘యూ ఆర్ ద హీరో ఆఫ్ మై పిక్చర్’ అని దర్శకుడు బాబూరావు చెప్పడంతో ఆశ్చర్యపోయా. ఇదంతా నిజమేనా అనిపించింది. జగ్గయ్య, ఎస్.వి.రంగారావు, చంద్రకళ, సావిత్రి.. ఇలా అగ్రహీరోలతో కలిసి నా మొదటి సినిమా ‘రామరాజ్యం’ కోసం పనిచేశా. 1973లో అది విడుదలైంది. హీరోగా తొలి ప్రయత్నంలోనే నాకు గుర్తింపు లభించింది’’
అసౌకర్యంగా అనిపించింది..!
‘‘1974లో విడుదలైన ‘నోము’లో నేను నెగెటివ్ రోల్‌లో నటించా. ఆ తర్వాత ఏడాది వచ్చిన ‘అభిమానవతి’లోనూ ప్రతినాయకుడిగా కనిపించా. నా నటన అందరికీ నచ్చింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ, విలన్ పాత్రల కోసం ఆఫర్స్ ఎక్కువగా రావడం వల్ల కాస్త అసౌకర్యంగా అనిపించింది’’
బాలచందర్ చిత్రం..!
‘‘‘నిళిల్ నిజమా గిరదు’ అనే తమిళ సినిమా కోసం మొదటిసారి ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో నటించా. కమల్‌హాసన్, అనంత్, నేను ముగ్గురం హీరోలం. అది సూపర్‌హిట్. దాంతో తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. బాలచందర్ తెరకెక్కించిన తెలుగు సినిమాలన్నింటిలో నేను ఏదో ఒక రోల్‌లో కనిపించా. ‘సాగర సంగమం’లో కమల్ స్నేహితుడిగా నా నటన అందరి మనసులను హత్తుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా ఆరు భాషల్లో హీరో, విలన్, సహాయనటుడిగా 250కి పైగా చిత్రాల్లో నటించాను. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అందరి మన్ననలు అందుకున్నాను. అవార్డులు పొందాను’’
సీరియల్స్.. దర్శకత్వం..!
‘‘వెండితెరపైనే కాదు బుల్లితెర వేదికగానూ ప్రేక్షకులకు చేరువగా ఉండాలనుకున్నాను. అందుకే పలు ధారావాహికల్లో నటించాను. ‘అంతరంగాలు’ సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘గాంధర్వ మాలతీయం’ అనే సీరియల్‌తో నిర్మాతగానూ సక్సెస్ అందుకున్నా. నాకు దర్శకత్వంలోనూ రాణించాలని ఉంది’’ అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో శరత్‌బాబు చెప్పారు. 2009 వరకు వరస సినిమాల్లో నటించిన శరత్‌బాబు కెరీర్‌పరంగా ఆ తర్వాత కాస్త నెమ్మదించారు. ఓ వైపు సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషిస్తూనే వీలునప్పుడల్లా పలు సినిమాల్లోనూ సహాయనటుడిగా కనిపించేవారు. అలా, ఈ ఏడాది విడుదలైన ‘వసంత కోకిల’లోనూ ఆయన చిన్న రోల్‌లో కనిపించి మెప్పించారు. ఆ సినిమా తర్వాత ఆయన ఏ ఇతర ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన దాఖలాలు లేవు.
ఇండస్ట్రీలో అందరితో స్నేహితుడిగా ఉంటూ అందరి ప్రేమను అందుకుని.. సహజ నటనతో ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానాన్ని దక్కించుకున్న శరత్‌బాబు అకాల మరణంతో తెలుగు సినీ లోకం మూగబోయింది. ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్న
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad: సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ మహారాష్ట్ర ముఠా పనేనా?
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు మోస్తరు వర్షాలు
-
Sports News
MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’
-
Politics News
Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్: మంత్రి హరీశ్‌రావు