Updated : 24 May 2022 10:51 IST

Tollywood: మహేశ్‌ డ్యాన్స్‌, వెంకటేశ్‌ డైలాగ్‌.. స్టేజ్‌ ఎక్కితే దద్దరిల్లాల్సిందే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత గొప్ప నటుడైనా.. వందకుపైగా చిత్రాలు చేసినా వేలాదిమంది ప్రేక్షకుల ముందు నటించాలంటే కాస్త బెరుకుగానే ఉంటుంది. ఏదైనా వేడుకలో వేదికపైన ప్రదర్శన ఇవ్వాలంటే టెన్షన్‌ మొదలవుతుంది. అభిమానుల కోరిక మేరకు కొంత మంది చిన్న డైలాగ్‌ చెప్పో, పాటకు అటూఇటూ కాలు కదిపో మెల్లగా తప్పించుకుంటుంటారు. అయితే.. కొందరు మాత్రం ఎలాంటి సందేహం లేకుండా సెట్స్‌లో చేసినట్టే వేదికపైనా అలవోకగా చేస్తూ అదరగొడతారు. అలా తమ సినిమా ప్రచారంలో భాగంగా స్టేజ్‌పై ఇటీవల డ్యాన్స్‌/ డైలాగ్స్‌ చెప్పిన కొందరు తారలెవరంటే...

సర్కారు వారి జోష్‌

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఎన్నడూలేనిది తానే స్వయంగా వేదికపైకెక్కి డ్యాన్స్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈయన హీరోగా పరశురామ్‌ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకలో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. కర్నూలు దీనికి వేదికైంది. ఈ చిత్రంలోని ‘మ మ మహేశా’ పాటకు పలువురు కంటెస్టెంట్‌లతో కలిసి సంగీత దర్శకుడు తమన్‌ డ్యాన్స్‌ చేస్తుండగా మహేశ్‌ ఉత్సాహంగా ముందుకెళ్లి వారితో స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

సినిమాకు మించిన ఫన్‌

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. హీరోలతోపాటు దర్శకుడు, ఇతర నటులూ స్టేజ్‌పై డైలాగ్‌లు చెప్పి ఉర్రూతలూగించారు. తమ సినిమాకు సంబంధించిన సంభాషణలనే కాకుండా ఇతర హీరోల పంచ్‌ డైలాగ్‌లు చెప్పడం విశేషం.

డాన్‌ నోట రజనీ మాట

తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్‌ సంపాదించుకున్న తమిళ నటుల్లో శివ కార్తికేయన్‌ ఒకరు. తాను హీరోగా తెరకెక్కిన ‘డాన్‌’ ఇటీవల విడుదలై టాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి, టాలీవుడ్‌ ప్రేక్షకులతో ముచ్చటించింది చిత్ర బృందం. అభిమానుల కోరిక మేరకు ఈ వేదికపై రజనీకాంత్‌ డైలాగ్‌ను కార్తికేయన్‌ అచ్చుగుద్దినట్టు చెప్పారు.

పూజా అరబిక్‌ కుతు

తాను నటించిన ‘బీస్ట్‌’ చిత్ర ప్రచారంలో భాగంగా ‘అరబిక్‌ కుతు’ పాటకు డ్యాన్స్‌ పెర్ఫామ్‌ చేసింది పూజాహెగ్డే. వేదికపై ఆమె మాట్లాడుతుండగా ‘డ్యాన్స్‌ డ్యాన్స్‌’ అని అభిమానులు కోరడంతో ఓకే చెప్పింది. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి స్టెప్పులేసి వావ్‌ అనిపించింది. విజయ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలైంది.

రష్మిక సామి సామి

అల్లు అర్జున్‌- రష్మిక జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రష్మిక చేసిన డ్యాన్స్‌ ఎవరూ మరిచిపోలేరు. ‘సామి సామి’ అనే పాటకు సిగ్నేచర్‌ స్టెప్‌ వేసి ఆకట్టుకుంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని