Adipurush: సూర్యనారాయణ నుంచి ప్రభాస్‌ వరకు.. ‘జైశ్రీరామ్‌’ అనిపించిన నటులు

‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడి పాత్ర పోషించి, అందరి దృష్టిని ఆకర్షించారు ప్రభాస్‌. ఈయనకు ముందు ఎవరెవరు? ఏయే చిత్రాల్లో రామ అవతారంలో కనిపించారంటే..

Updated : 03 Oct 2022 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాముడిగా ప్రభాస్‌ (Prabhas) ఎలా ఉంటాడు? ఎలాంటి సంభాషణలు చెబుతాడు?.. ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా ప్రకటన వెలువడగానే సినీ అభిమానుల్లో ఉత్పన్నమైన సందేహాలివి. ఆదివారం విడుదలైన టీజర్‌ అన్ని ప్రశ్నలకు  చెక్‌ పెట్టింది. ప్రభాస్‌ ఆహార్యం, మాటలకు భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఫిదా అయింది. రామ నామం జపిస్తోంది. మరి, ప్రభాస్‌ కంటే ముందు రాముడిగా ఎవరెవరు కనిపించారో చూద్దాం..

రాముడి పాత్రకు ఆద్యుడు

తెలుగు సినిమా మాటలు నేర్చుకుంటున్న దశ (టాకీ)లో పౌరాణిక కథలనే ఎక్కువగా తెరపైకి తీసుకొచ్చారు. అలా తొలిసారి రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందిన తెలుగు చిత్రం ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. ఇందులో యడవల్లి సూర్యనారాయణ (Yadavally Suryanarayana) రాముడిగా నటించారు.  శ్రీరాముడి పాత్రను పోషించిన తొలి నటుడు కాబట్టి సూర్యనారాయణను ‘తెలుగు టాకీ తొలి రాముడు’ అని పిలిచేవారు. బాదామి సర్వోత్తమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1932లో విడుదలైంది.

రాముడిగానే పరిచయం..

అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) ‘ధర్మపత్ని’ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో ఆయనది సహాయ నటుడి పాత్ర. కథానాయకుడిగా ఏఎన్నార్‌ నటించిన తొలి సినిమా ‘సీతా రామ జననం’ (1944). హీరోగా తొలి ప్రయత్నంలోనే రాముడి పాత్రను ఎంపిక చేసుకుని, తనకు తానే సాటి అని నిరూపించారు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.

రాముడికి ప్రతిరూపం..

‘ఈయనే రాముడు’ అని అనిపించేంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు నందమూరి తారకరామారావు. రాముడిగా అత్యధిక సినిమాల్లో కనిపించిన నటుడిగా నిలిచారు. కె. సోము దర్శకత్వంలో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’ (1959), సి. పుల్లయ్య తెరకెక్కించిన ‘లవకుశ’ (1963), చిత్తూరు వి. నాగయ్య దర్శకత్వంలో వచ్చిన ‘రామదాసు’ (1964), బాపు డైరెక్ట్‌ చేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975), స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీరామ పట్టాభిషేకం’(1978) చిత్రాల్లో ఎన్టీఆర్‌ రామ చరితను వివరించారు.

సీతారామ కల్యాణంతో..

శ్రీరామ పాత్ర పోషించిన అలనాటి నటుల్లో హరనాథ్‌ ఒకరు.  నందమూరి తారక రామారావు దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామ కల్యాణం’ (1961) సినిమా కోసం తొలిసారి ఆయన శ్రీరాముడిగా మారారు. ఆ తర్వాత ‘శ్రీరామ కథ’ (1969)లో రాముడిగా కనిపించారు.

శోభన్‌ బాబు ఇలా..

మహిళా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉన్న నాటి నటుడు శోభన్‌బాబు. ఆయనా రాముడిగా నటించి ప్రేక్షకాదరణ పొందారు. బాపు దర్శకత్వం వహించిన ‘సంపూర్ణ రామాయణము’ (1972) చిత్రంలో శోభన్‌ బాబు శ్రీరాముడిగా కనిపించారు.

కాంతారావు.. 

కాంతారావు.. ‘వీరాంజనేయ’ (1968), రవికుమార్‌.. ‘సీతా కల్యాణం’ (1976) సినిమాల్లో రాముడిగా ఒదిగిపోయారు.

చిన్నప్పుడే రాముడి పాత్రలో నటించి, మెప్పించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. గుణ శేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’తో ఎన్టీఆర్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది ‘బాల రామాయణం’.

‘దేవుళ్లు’ సినిమాలోని ‘అందరి బంధువయా’ పాటలో రాముడిగా కనిపిస్తారు శ్రీకాంత్‌. ఆ పాత్రకు సంబంధించిన నిడివి సెకన్లే అయినా మంచి ప్రభావం చూపింది.

నాగార్జున హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తిరస చిత్రాల్లో ‘శ్రీరామదాసు’ ఒకటి. అందులో నాగార్జున రామదాసుగా నటించగా శ్రీరాముడిగా సుమన్‌ నటించారు.

‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌)ను రాముడిగా చూపించిన దర్శకుడు బాపు.. ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణనూ రాముడి పాత్రలో ఒదిగిపోయేలా చేశారు. బాపు- బాలకృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన ఆ దృశ్యకావ్యమే ‘శ్రీరామరాజ్యం’.

* ‘ఆదిపురుష్‌’.. వీటన్నింటికీ భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. విజువల్‌ వండర్‌గా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన ఈ చిత్రం 2023 జనవరి 12న విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని