Cinema News: ఒకటి కాదు... అంతకు మించి!

కొత్తందాల పట్టుకొమ్మలా నిత్యనూతనంగా కాంతులీనుతుంటుంది చిత్రసీమ. దక్షిణాది భామలు హిందీ చిత్రసీమలోకి వెళ్లి జోరు చూపించడం.. అక్కడి భామలు ఇక్కడి చిత్రాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ఏటా కనిపించే ఆనవాయితీనే.

Updated : 10 Jul 2024 03:57 IST

కొత్త భాషలోకి నాయికల తొలి అడుగులు 
మొదటి చిత్రం విడుదల కాకముందే వరస అవకాశాలు

ప్రకృతిలో ఒక్కో నది ప్రయాణం ఒక్కో తీరున సాగినట్లే.. చిత్రసీమలో తారల సినీ ప్రయాణం ఒక్కో తరహాలో సాగుతుంటుంది. తొలి అడుగులోనే హిట్టు మాట వినిపించి వరుస అవకాశాలతో జోరు చూపేవారు కొందరైతే.. తొలి అడుగులు పడకుండానే రాకెట్‌ వేగంతో కెరీర్‌ను పరుగులు పెట్టించేవారు ఇంకొందరు. ప్రస్తుతం ఈ రెండో కోవకు చెందిన నాయికలు ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు బాలీవుడ్‌లోనూ పలువురు కనిపిస్తున్నారు. ఆయా భాషల్లో ఇంకా అడుగుకూడా పెట్టకముందే ఒకటికి రెండు అవకాశాల్ని అందిపుచ్చుకొని జోరు ప్రదర్శిస్తున్నారు.

కొత్తందాల పట్టుకొమ్మలా నిత్యనూతనంగా కాంతులీనుతుంటుంది చిత్రసీమ. దక్షిణాది భామలు హిందీ చిత్రసీమలోకి వెళ్లి జోరు చూపించడం.. అక్కడి భామలు ఇక్కడి చిత్రాల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ఏటా కనిపించే ఆనవాయితీనే. అయితే ఒకప్పుడు బాలీవుడ్‌ నుంచి తెలుగు తెరపైకి వచ్చే వారిలో స్టార్‌ నాయికలతో పోల్చితే కొత్తతారలే ఎక్కువ ఉండేవారు. అలాగే ఇక్కడి స్టార్‌ భామలు ఉత్తరాదికి వెళ్లాల్సి వచ్చినా అగ్ర హీరోల సరసన చోటు దక్కించుకునే వాళ్లు పరిమితంగానే కనిపించేవారు. కానీ, పాన్‌ ఇండియా సంస్కృతి పుణ్యమాని ఇప్పుడా లెక్కలన్నీ మారిపోయాయి. హిందీ నుంచి మన ప్రాంతీయ భాషలకు వస్తున్న వాళ్లలో కొత్తందాలతో పాటు స్టార్‌ నాయికలూ ఉంటున్నారు. అలాగే ఇక్కడి నుంచి వెళ్లి అక్కడి భారీ చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న నాయికల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడలా అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తొలి అడుగులు వేస్తున్న వాళ్లలో ఒక్క చిత్రమైనా బయటకు రాకముందే రెండో అవకాశం అందిపుచ్చుకున్న వాళ్లు పలువురు కనిపిస్తున్నారు.


తెలుగులో రయ్‌.. రయ్‌..

డక్‌’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించి.. ‘గుంజన్‌ సక్సేనా’, ‘మిలి’ విజయాలతో బాలీవుడ్‌లో స్టార్‌ నాయికగా పేరు తెచ్చుకుంది నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌. ఇప్పుడా అమ్మడు ఎన్టీఆర్‌ ‘దేవర’తో తెలుగులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముగింపు దశ చిత్రీకరణకు చేరుకున్న ఈ సినిమా సెప్టెంబరు 27న థియేటర్లలోకి రానుంది. ఈలోపే జాన్వీ తెలుగులో రెండో అవకాశాన్నీ అందిపుచ్చేసుకుంది. ఈసారి తను కథానాయకుడు రామ్‌చరణ్‌కు జోడీగా అలరించనుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న ఈ పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా సినిమా త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగు తెరపైకి కాలుమోపనున్న మరో కొత్తందం భాగ్యశ్రీ బోర్సే. ఇప్పుడీ సినిమా ఇంకా తెరపైకి రాకముందే భాగ్యశ్రీ మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆమె ఇప్పటికే విజయ్‌ దేవరకొండ సరసన ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటిస్తోంది. మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌ చేయనున్న కొత్త తెలుగు సినిమాలోనూ నాయికగా నటించే అవకాశం అందిపుచ్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది నటి శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం ఆమె సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమాతో తెలుగుకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిది చిత్రీకరణ దశలో ఉండగానే తాజాగా ఆమె మరో తెలుగు ప్రాజెక్ట్‌ను అందిపుచ్చుకున్నట్లు తెలిసింది. రానా కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్‌ నిర్మించనున్న కొత్త చిత్రంలో శ్రీనిధి కథానాయికగా నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.


హిందీలో స్టార్‌గా మెరిసేనా!

థా బలమున్న చిత్రాలకు.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు చిరునామాగా నిలుస్తుంటుంది సాయిపల్లవి. తనదైన సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈ భామ.. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికగా జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడామె హిందీ చిత్రసీమకు తన ప్రతిభను రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. సాయిపల్లవి ఇప్పటికే హిందీలో తన తొలి చిత్రాన్ని పూర్తి చేసేసింది. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో   థియేటర్లలోకి రానుంది.. ఇప్పుడిది ఇంకా బయటకు రాకముందే సాయిపల్లవి తన రెండో సినిమా ‘రామాయణం’ను ప్రారంభించేసింది. రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

దక్షిణాదిలో నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తున్న కీర్తి సురేశ్‌ ఇప్పుడు హిందీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. తను ఇప్పటికే అక్కడ వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘బేబీ జాన్‌’లో నటిస్తోంది. ఇప్పుడిదింకా పూర్తికాక ముందే కీర్తి హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌కు కూడా శ్రీకారం చుట్టేసింది. ‘అక్క’ పేరుతో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌  నిర్మిస్తోన్న ఆ సిరీస్‌లో కీర్తితో పాటు రాధికా ఆప్టే కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

‘పెళ్లి సందడి’తో తెలుగు తెరపైకి అడుగు పెట్టిన శ్రీలీల.. ఇప్పుడు హిందీలో ఇదే బాటలో జోరు చూపేందుకు సిద్ధమవుతోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా తెరకెక్కనున్న ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇదింకా చిత్రీకరణ ప్రారంభించుకోక ముందే సైఫ్‌ అలీ ఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రం కోసమూ శ్రీలీల పేరు పరిశీలనలో తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని